తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 30 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు.
తిరుచానూరులోని ఆస్థాన మండపంలో మంగళవారం జెఈవో శ్రీ వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ఠ్యా అమ్మవారి వాహన సేవలు, పంచమి తీర్థం ఆలయ వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రం, సంప్రదాయ బద్ధంగా ఏకాంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉద్యాన, విద్యుత్ విభాగాల అధికారులు ఆలయం అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవలను ఎస్వీబిసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో స్నపస తిరుమంజనం నిర్వహించే రోజుల్లో ఆకర్షణీయమైన మాలలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఉద్యానవన విభాగం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులందరికి మూలమూర్తి దర్శనం కల్పించాలన్నారు. అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో డెప్యూటేషన్ సిబ్బందికి అన్నప్రసాదాలు అందిచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబరు 29వ తేదీ ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారన్నారు. నవంబరు 30న ఉదయం ధ్వజారోహణం, డిసెంబరు 4న రాత్రి గజవాహనం, డిసెంబరు 8న పంచమితీర్థం, డిసెంబరు 9న పుష్పయాగం నిర్వహించనున్నట్లు వివరించారు.