తెలంగాణలో వరి టెన్షన్…టెన్షన్

తెలంగాణలో గత యేడున్నరేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయపార్టీలేవీ టెన్షన్ క్రియేట్ చేయలేకపోయాయి.  కాంగ్రెస్ చాలా ఉద్యమాలు చేపట్టింది.అవన్నీ ఉద్యమం నడుస్తున్నంత సేపు వార్తగా ఉండింది తప్ప, తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం సృష్టించలేకపోయింది. ఇలాగే ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి ప్రాజక్టు ముంపు భూములకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. అప్పుడు ఉద్యమ ప్రాంతంలో ఉద్రిక్తత తప్ప తెలంగాణ ప్రభుత్వానికి కంపరం పుట్టించలేకపోయింది. విద్యార్థులు,యువకులు, ఉద్యోగులు ఎవరూ తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి చీకాకు కలిగించలేకపోయాయి. నిజానికి ఆరోజు భారతీయ జనతా పార్టీకి కూడా  అంతశక్తి లేకుండా పోయింది. అయితే,  ఈ మధ్య కాలంలో బిజెపి రాజకీయ ఉద్రికత్త కలిగించే స్థాయికి చేరింది. లోక్ సభ ఎన్నికల తర్వాత బిజెపి కొంత బలపడినట్లకనిపించినా, అప్పటికి దుబ్బాక కు మధ్య పెద్దగా పార్టీ కార్యక్రమాలు లేవు. అయితే,   దుబ్బాక ఉప ఎన్నిక విజయం తర్వాత బిజెపిలో ఎదో ఆత్మ విశ్వాసం చిగురించినట్లు కనిపిస్తుంది.ఇపుడు హుజూరాబాద్  ఘన విజయం తర్వాత బిజెపికి కచ్చితంగా  టిఆర్ ఎస్ ప్రభుత్వానికి చికాకు కలిగించే శక్తియుక్తులు వచ్చాయి.

ఇపుడు రాష్ట్రంలో నడుస్తున్న వరి కొనుగోలు రాజకీయాల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.  కేంద్రం యాసంగి బియ్యం కొనుగోలు చేయనంది. రాష్ట్రం చేయాలనుకుంటున్నది. ఇది బాగా రాజకీయ వివాదంగా ముదురుతున్నది. రెండుపార్టీలు రైతుల పక్షానే నిలబడుతున్నాయి. సమస్య కు పరిష్కారం చూపలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కొనుగోలు కేంద్రాల సందర్శనకు బయలు దేరారు. మంది మార్బలంతో జరుగుతున్న ఈ పర్యటనలను అడ్డుకునేందుకు టిఆర్ ఎస్ ప్రయత్నిస్తున్నది. దాడులు జరుగుతున్నాయని బిజెపి ఆరోపిస్తున్నది.  ఈ రోజు ఈ వ్యవహారం కొద్దిగా ముదిరింది. పోలీపులు లాఠీ ఝళిపించారు. కొందరికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తమవుతున్నది.. ఉద్రిక్తతకి ఎవరు కారణమయినా, అది బిజెపికి బాగా లాభిస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు

 ఈ రోజు జరిగిందంటే…

వరి కొనుగోలు జాప్యం కావడంతో ఆందోళన చెందుతున్న రైతులకు మరొక వైపు నుంచి వర్షం భయపట్టుకుంది. ఎపుడు వర్షం వచ్చిన వరికుప్పలను ముంచేస్తుందేమోనన్న భయం చాలా మంది రైతులను పీడిస్తూ ఉంది.

ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ రోజు స్వయంగా తెలుసుకున్నారు.

ఈ రోజు సూర్యాపేట జిల్లాలోని చివ్వేమ్ల ను బండి సంజయ్ సందర్శించారు.

చివ్వేమ్ల నుండి ఆత్మకూరు(ఎస్) వైపు వెళుతున్న  బండి సంజయ్ కుమార్ ను  తమ పొలాల్లోకి తీసుకెళ్లి తాము పడుతున్న బాధలను  లక్ష్మీ నాయక్ తండా రైతులు వివరించారు.

రోజుల తరబడి ధాన్యం కొనాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడుతుండగా వర్షం ప్రారంభం కావడంతో వారితో కలిసి బండి సంజయ్ స్వయంగా ధాన్యంపై టార్పాలిన్ ను కప్పారు. ఇంకేముంది ఆయన రైతు వకాల్తా బాగాబలపడింది.

రైతులు పడుతున్న బాధలను చూసైనా కేసీఆర్ బుద్ది తెచ్చుకొని తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

రోజూ వరి కొనుగోలు కేంద్రాలను  సందర్శించి, అక్కడి రైతులతో సంజయ్  మాట్లాడుతున్నారు. సంజయ్ పర్యటలన టిఆర్ ఎస్ కార్యకర్తులు పోలీసులు అడ్డుకుంటున్నారని బిజెపి ఆరోపింస్తున్నది. అలాగే కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో  బిజెపి దాడులకు పాల్పడుతూ ఉందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో వరి టెన్షన్ పెరుగుతూ ఉంది.

బండి పర్యటలను ఖండిస్తున్న మంత్రులు

బిజెపి అధ్యక్షుడు గుండాలతో వచ్చి రైతుల మీద పాశవికంగా దాడి జరిపాడని  తెలంగాణ విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ‘దాడి’ అని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళలు,గిరిజనులు,దళితులు అన్న తేడా తెలియకుండా యాసంగిలో తెలంగాణా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అని నిలదీసినందుకే బిజెపి నేతలు ఇంతటి గుండాయిజానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

రైతుల మీద దాడులా?: వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి

అయితే, బిజెపి వరి ఉద్యమాన్ని టిఆర్ ఎస్ ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  బండిసంజయ్ ధోరణిని తీవ్రంగా ఖండించారు. రైతుకొనుగోలు కేంద్రాలకు వెళ్లేఅర్హతే బిజెపి నేతలకు లేదని మంత్రి అన్నారు.

కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో దాడులు చేస్తున్నారని  ఏ అర్హతతో మీరు కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నారని ఆయన పశ్నించారు.

‘తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రైతాంగం పంటలు , ధాన్యం పండిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ తెలంగాణ రైతులకు నీళ్లిచ్చిందా ? కరంటు ఇచ్చిందా ? రైతుబంధు, రైతుభీమా పథకాలలో మీ భాగస్వామ్యం ఏంటి ? దేశంలో రైతులు రోడ్డెక్కించిన పుణ్యం బీజేపీ పాలనదే .. 70 ఏండ్ల పాలనలో నెలల తరబడి రైతులు వీధులలో ఆందోళన చేస్తున్నారు,’ మంత్రి వ్యాఖ్యానించారు.

క్వింటాలు వడ్లకు 67 లేదా 68 కిలోల బియ్యం వస్తాయని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లెక్కలే చెబుతున్నాయి కాని,  క్వింటాలుకు 80 కిలోలు వస్తాయని  అబద్దాలను బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు.

నిరంజన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…

‘శుద్ద అబద్దాలను ప్రచారం చేయడానికి కనీస ఇంగితజ్ఞానం బీజేపీకి లేదు .. కనీస అవగాహన లేని వారు బీజేపీలో నేతలుగా చలామణి అవుతున్నారు. మూర్ఖపు, అసత్యపు ప్రచారం చేస్తున్నారు. రైతుల రెక్కల కష్టంపై బీజేపీ దండయాత్ర. బీజేపీ అంటే బిజినెస్, కార్పోరేట్ పార్టీ. రైతుల పట్ల అభిమానం ఉంటే బీజేపీ నేతలు ఢిల్లీ యాత్ర చేసి నల్ల చట్టాలను రద్దు చేయమని కేంద్రాన్ని కోరాలి, రైతుల ఆందోళనలో చనిపోయిన రైతులకు పరిహారం రైతు కుటుంబాలకు అందించి క్షమాపణలు కోరాలి

బీజేపీ కొనుగోలు కేంద్రాల సందర్శన ఎలా ఉందంటే, గర్భవతి దగ్గరకు వెళ్లి వెంటనే బిడ్డను కను  కను అని అన్నట్లుంది.  కొనుగోలు కేంద్రాలలో ఎలాగు జరిగేది కొనుగోళ్లే. కొనుగోళ్లకు ఒక ప్రొసీజర్ ఉంటుంది .. తేమ శాతం, తాలు, మట్టిపెళ్లలు పరిశీలించాల్సి ఉంటుంది .. ఈ మాత్రం కనీస అవగాహన బీజేపీ పార్టీకి లేకపోవడం దౌర్భాగ్యం.  తేమ, తాలు, మట్టి పెళ్లలతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం ఎఫ్ సీఐ ఆమోదిస్తుందా ?

ధాన్యం కొనుగోళ్లలో కేవలం రెండు నెలలకే కేంద్రం వడ్డీ ఇస్తుంది. కానీ కేంద్రం డబ్బులు ఇవ్వడానికే ఆరునెలలు పడుతుంది. దీనికి సంబంధించి మిగతా వడ్డీ , ఇతర నష్టాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. యాసంగి వడ్లు కొనమని కేంద్రప్రభుత్వం చెప్పింది .. ఎప్పుడన్నాం బాయిల్డ్ వడ్లు కొనమని అన్నాం అని రాష్ట్ర బీజేపీ నేతలు అంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *