పాలించే పార్టీల ధర్నాలు ఎవరికోసం?
ప్రజలు నిరసన తెలిపితే లాఠీఛార్జితో రక్తం పారించారు. తెరాస ధర్నాలకు పోలీసుల లాఠీలు పనిచేయవా?
(వడ్డేపల్లి మల్లేశము)
ఇంటి యజమాని నిరసనకు దిగిన, ప్రభుత్వ పార్టీ బజార్ కెక్కినా, కంచే చేను మేసిన వికృతచేష్టలు గానే కనపడతాయి. బాధ్యతల్లో ఉన్న వాళ్లు మరింత కర్తవ్య దీక్షతో అందరి మేలు కోరి పని చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు అధికార పార్టీ సంయమనంతో ప్రజల కోసం పనిచేయాలి. కానీ దానికి భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ వరుసగా గురు, శుక్ర వారాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలతో ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు. ఎందుకంటే పరిపాలించే పార్టీలు ధర్నాలు, నిరసనలు చేయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.
అసలు సమస్య
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పండిస్తున్న టువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రాలకు జాతీయ పంపిణీ పథకం ద్వారా ప్రజలకు అందించడానికి కృషి చేస్తూ ఉంటుంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రమేయం లేకుండా చివరి గింజ వరకు కూడా కొంటామని హామీ ఇవ్వడంతో పాటు కొనుగోలు కూడా చేసింది. అయితే తర్వాతి పంటకు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని రైతులు తమ ఇష్టం ఉన్న చోట అమ్ముకోవచ్చని కొనుగోలు చేయడం అనేది తమ బాధ్యత కాదని తెరాస ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో వంత పాడింది.
కేంద్ర రైతు చట్టాలకు మద్దతుగా తెరాస శ్రేణులు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చినటువంటి కేంద్ర రైతు చట్టాలు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వ విధానాలే నచ్చవు అని చెప్పడంలో అర్థం ఏమిటి? అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను ఇటీవల హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా నూ వరి ధాన్యం కొనుగోలు సందర్భంగానూ ధర్నాలో తెరాస పార్టీ తూర్పారబట్టినది. ఇదంతా తెరాస పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి కాదా?🎂
ప్రస్తుత ధర్నా ల విషయానికి వస్తే వర్షాకాలపు పంట వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొ నడం లేదని బీజేపీ ధర్నాలు చేస్తే, యాసంగి పంట ను పూర్తిగా కొనుగోలు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ తెరాస ప్రభుత్వ శ్రేణులు శుక్రవారం ధర్నాలు చేసినవి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి బాధ్యత మరచిన ప్రదర్శనలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నది.
అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి గత సంవత్సరం రైతుల మేలు కోసం అంటూ చేసిన చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు అని రైతుల ఆగ్రహానికి గురైన సందర్భంలో ఆ సమస్యను పరిష్కరించుకునే బదులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ అయిన వరి కొనుగోలు విషయానికి హామీ ఇచ్చే బదులు నిరసనలతో తాత్సారం చేయడం కూడా అసంబద్ధ మే.
ధర్నాలు నిరసనలు జరిగిన తీరు
తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి అంటూ ప్రత్యేకంగా ఇందిరా పార్కు సమీపంలో ధర్నా చౌక్ గతంలో ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది.. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిల పక్షాలు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల సందర్భంగా నిరసనలు తెలపడానికి ఈ ధర్నా చౌక్ అనాదిగా వాడుకుంటూ ఉన్నాము. తెరాస ప్రభుత్వం ధర్నాచౌక్ ను 2016లో ఎత్తివేస్తూ రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి వీలు లేదని నిరసన ప్రదర్శనకు తావులేదని నియంత్రణ విధించడంతో పాటు అనేక సందర్భాలలో లాఠీచార్జి భాష్పవాయువు ప్రయోగం తో పాటు ఉద్యమాలను ప్రభుత్వం అణచి వేసింది. 2016లో ధర్నాచౌక్ ఎత్తివేసిన తర్వాత ప్రజా సంఘాలు అఖిలపక్షా లు పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాలేదు .చివరికి రాష్ట్ర హైకోర్టు జోక్యం తో తిరిగి ధర్నా చౌక్ సాధించుకోవడం జరిగింది 2018 సంవత్సరంలో. అయినా కూడా నిరసన తెలపదానికి ప్రభుత్వ, పోలీసు అనుమతి తీసుకోవాల్సి రావడం చాలా బాధాకరం.