1996 లో ఇదే రోజున అంటే నవంబర్ 12న పౌర విమానచరిత్రలో మరొక పెద్ద విషాదం ఎదరుయింది. హర్యానాలోని చర్ఖి దాద్రి ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. 351 మంది ప్రయాణికులు మరణించారు. ఇలా ఆకాశంలో విషాదం ఎదురుకావడం పౌరవిమాన సర్వీసులు మొదలు పెట్టిన తర్వాత మూడోది. కారణాలేంటో తెలుసా?
అర్థంకాని భాష, సంకేతాల సమన్వయ లోపం.
ఇదెలా జరిగిందో చూద్దాం.
సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ 763 (బోయింగ్ 747) కజికిస్తాన్ కు చెందిన ఫ్లైట్ 1907 ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌదీ విమానం ఢిలీ నుంచి సౌదీలోని ధహరాన్ వెళ్తూ ఉంది. కజిక్ విమానం ఢిలీ వస్తున్నది. చర్ఖి దాద్రి జిల్లాలోని తికాన్ గ్రామం మీద ఎగురుతున్నపుడు రెండు విమానాలు ఢీకొన్నాయి. ఒక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు దిగుతున్నది.మరొకటి దహరాన్ వెళ్లందుకు పైపైకి ఎగరాలనుకుంటున్నది. మార్గమధ్యంలో రెండు ఢీకొన్నాయి.
విమానాలు ఢీకొనడానికి ముందు…
1996 నవంబర్ 12 సాయంకాలం.
కజికిస్తాన్ విమానానికి చెందిన గెన్నడీ చెరపనోవ్ తన విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తునుంచి 18 వేల అడుగల ఎత్తకు దించాలనుకుంటున్నట్లు న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ (ఎటిసి) రూం కు సమాచారం అందించారు. అపుడు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంలో వికె దత్తా డ్యూటీలో ఉన్నారు. ఆయనకు సర్వీసులో చాలా అనుభవం ఉంది. ఈ మధ్యే ప్రమోషన్ కూడా అందుకున్నారు. చెరపనోవ్ నుంచి సమాచారం అందగానన ఆయన 15వేల అడుగులు ఎత్తుకు దిగేందుకు అనుమతించారు. దీనికి చరపనోవ్ సరే అన్నాడు. విమానం దత్తా సూచించిన ఎత్తుకు దిగుతూ ఉంది.
ఇంతలో సౌదీ విమానం నుంచి కాల్ వచ్చింది. కెప్టెన్ ఎ ఎల్ షాబలీ తన విమానం ప్రస్తుతం 10 వేల ఎత్తులో ఉంది. 14 వేల అడుగుల ఎత్తుకు ఎగిరేందుకు అనుమతి కావాలని అడిగారు. దీనికి దత్తా అనుమతినిచ్చారు. ఈ విమానం వారానికి మూడుసార్లు ఢిల్లీ- ధహరాన్ మధ్య ఎగురుతూ ఉంటుంది. ఈ విమానచోదకులంతా అనుభవజ్ఞులు. ఇలా వారు అనుమతి అడగడం, ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రావడం రోటీన్ వ్యవహారమే. అలాగే నవంబర్ 12 సాయంకాలం కూడా. జరిగింది. అయితే, ఈ సారి అనుకోనిపరిణామం ఎదుయింది. ఆకాశంలో విషాదానికి దారి తీసింది.
అపుడు కజక్ విమానాం ఢిల్లీలో దిగేందుకు సమీపిస్తూ ఉంది. సౌదీ విమానం ఢిల్లీనుంచి వెళ్లేందుకు ఎగురుతూ ఉంది. ఈ సమయంలో తమకు 14 మైళ్ల దూరాన మరొక విమానం ఎగురుతూ ఉందని కజక్ పైలట్ ఢిల్లీ ఎటిసికి సమాచారమిచ్చారు. అయితే, ఈ రెండు విమానాలు కనీసం వేయి అడుగుల ఎత్తు వ్యత్యాసంలో వెళ్లిపోతాయని ఢిల్లీ ఎటిసి అధికారులు భావించారు. అలా జరగలేదు.
రెండు విమానాలు గంటలకు 300 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. కార్లు ఢీకొంటే ఎదురయ్య వత్తిడి కంటే 700రెట్లు అధిక వత్తిడి వచ్చే వేగంతో ఈ విమానాలు వెళ్తున్నాయి. అపుడేజరగరానిది జరిగింది. చూస్తుండగనే రెండు విమానాలు ఢీకొన్నాయి.
దత్తా దగ్గిర ఉన్న పాత రాడార్ లో ఒక పాయింట్ వద్ద రెండు విమానాలు కలసిపోయి మాయమైపోయాయి. అంతే, కాని బయట ఆకాశంలో ఒక పెద్ద అగ్నిగోళం మండుతూ భూమ్మీదికి రాలిపడుతున్నది.
రెండు విమానాలు సాయంకాలం 6.40 కి తికాన్ గ్రామ పరిసరాల్లో తునాతునకలై పడిపోయాయి. సుమారు 6 మైళ్ల విస్తీర్ణంలో విమాన తునకలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన వెన్వెంటనే అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సి-141 విమానం పైలట్ ఈ విమానం అగ్నిగోళంలాగా పడిపోతూ ఉండటం చూశానని చెప్పారు. తాను రెండు అగ్నిగోళాలు మేఘాల్లోనుంచి దూసుకువచ్చి భూమ్మీదపడిపోయినట్లు ఆయన అధికారులకు రిపోర్టు చేశారు.
ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. సౌదీ విమానంలో 312 మంది ప్రయాణికులుంటే, కజక్ విమానంలో 39 మంది ఉన్నారు. విమానం ప్రమాదం గురించి లోతైన విచారణ జరిగింది. చివరకు కజక్ చోదకులవైపే తప్పుందనే నిర్ణయానికి వచ్చారు. దీనికి కారణం సంకేతాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. కజకిస్తాన్ పైలట్స్ గతంలో సోవియట్ యూనియన్ విమానాలను నడిపేవారు. సోవియట్ పైలట్లు మెట్రిక్ ప్రమాణాలు వాడతారు. ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఇంగ్లీష్ యూనిట్లు వాడే వారు. విమానం ఎగురుతున్న ఎత్తును కజక్ పైలట్లు మీటర్లలో కాకుండా అడుగుల్లో చెప్పారు. ఇది గందరగోళానికి దారి తీసింది. దానికి తోడు కజక్ పైలట్లు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. సమీపంలో మరొక విమానం ఎగురుతూ ఉందని ఢిల్లీ ఎటిసి రెండు విమానాల పైలట్లను హెచ్చరించింది. తమ సమీపంలో మరొక విమానం ఉందని ఇద్దరు పైలట్లకు కూడా తెలుసు. దీనికితోడు టెక్నాలజీ ఆధునికీకరించపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణమయింది.అందరికీ సమాచారం ఉన్న సమన్వయం లోపించింది. దీనికి కారణం కొలమాణాలు తారుమారుకావడమేనని చెబుతారు
మొత్తానికి సంకేతాలు సరిగ్గా అర్థం చేసుకొనకపోవడంతో కజక్ విమానం 15 వేల అడుగుల కంటే తక్కువకు దిగే ప్రయత్నం చేశాడు. దీనికి ఢిల్లీ ఎటిసి అనుమతి లేదు. రెండు విమానాలు ఎంత ఎత్తులో ఎగురుతున్నాయనే విషయాన్ని పైలట్లు తెలుసుకునేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం ఎటిసి దగ్గిర లేదు. ఈ కారణలన్నీ కలసి ఆకాశంలో ఆర్తనాదాలు సృష్టించాయి. పౌరవిమాన చరిత్రలో ఇది మూడో పెద్ద ప్రమాదంగా చెబుతారు.
స్మారక స్థూపం
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక స్మారక ఉద్యానవనం నిర్మించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే, ప్రమాదంలో మరణించిన వారి బంధు మిత్రులు అపుడపుడు ఇక్కడి వచ్చి శ్రద్దాంజిలి ఘటిస్తూ ఉన్నారు. వారు ప్రదేశానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించాలి. అందువల్ల ప్రమాదం మరణించిన వారి జ్ఞాపకార్థం ఒక స్మారక స్థూపం నిలబెటి, ఒక ఉద్యానవనం, టూరిజం కాంప్లెక్స్ నిర్మించాలని చర్ఖిదాద్రి జిల్లా అధికారులు భావిస్తున్నారు.
అంతకు ముందటిప్రమాదాలు
అంతకు ముందటి ప్రమాదం 1977 మార్చి 27న కానరీ ఐల్యాండ్స్ మీద జరిగింది. అపుడు కెఎల్ ఎమ్ ఎయిర్ లైన్స్ కు చెందిన747విమానం ప్యాన్ యామ్ జుంబో జెట్ తో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అందులో 538 మంది చనిపోయారు.
తర్వాత 1979 ఆగస్టు 11న మరొక దారణ మయిన ఆకాశప్రమాదం జరిగింది.
అది సోవియట్ యూనియన్ లోని యుక్రేనియా ఆకాశంలో జరిగింది.ఢీకొన్న రెండు విమానాలు కూడా ఏరోప్లాట్ నడిపే తుపొలెవ్ టియు 134 ఎఎస్ (Tupolev Tu-134 As) రకానికి చెందినవి. ఇందులో మానవతప్పిదాలు ఉన్నాయయని,నియమాలను ఉల్లంఘించడం వల్లే ప్రమాదం జరిగిందని సోవియట్ రష్యా విచారణలో తేలింది. ఎరోఫ్లోట్ 7628 విమానం, ఎరోఫ్లాట్ 7880విమానాలు నిప్రోజెర్జిన్ స్కీ (Dniprodzerzhynsk) అనే పట్టణ సమీపంలో ఢికొన్నాయి. రెండు విమానాలలో ఉన్న 178 మంది ప్రయాణికులు మరణించారు.ఇందులో 7880 విమానం డొనెక్స్ –మిన్ స్క్ నగరాల మధ్య ఉన్న సర్వీసు. 7628విమానం చెల్యాబిన్ స్క్-వొరోనెజ్-కిష్నీవ్ మధ్య నడుస్తున్న విమానం. ఇవి భూమినుంచి 26 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నపుడు ఢీకొన్నాయి. ఈ రెండు మార్గాలు క్రాస్ చేస్తూన్నపుడు ఢీకొన్నాయి.