రష్యా సోషలిస్టు విప్లవం విజయం సాధించి నేటికి సరిగ్గా 104 ఏళ్ళు!
తొలి సోషలిస్టు విప్లవం బ్రిటన్ లో జరుగుతుందని మొదటి కొమింటర్న్ ప్రాధమిక అంచనా! అది మార్క్స్, ఎంగెల్స్ ల తొలి రాజకీయ జీవిత కాలపు మాట! (అది చివరలో మారింది, ముఖ్యంగా మార్క్స్ మరణాంతరం కాట్సకీ కి ఎంగెల్స్ లేఖలో బ్రిటన్ కార్మికవర్గం పట్ల మార్పు అర్ధవుతుంది)
తొలి సోషలిస్టు విప్లవ కేంద్రం బ్రిటన్ కి బదులు జర్మనీకి మారుతుందనేది మరోదశలో అంచనా! తన మరణానికి రెండేళ్ల ముందు ఫ్రాన్స్ పై మార్క్స్ రచించిన ఓ గ్రంధానికి ఎంగెల్స్ ముందుమాటలో కూడా యిది బోధపడుతుంది.
బ్రిటన్… ఫ్రాన్స్… జర్మనీ… ఇవన్నీ పడమర దేశాలే! ఇంకా చెప్పాలంటే పడమర ప్రపంచంలో యూరోప్ ఉంటే, ఆ యూరోప్ లో కూడా పడమర దేశాలివి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ జన్మస్థలమది. ఇవే సోషలిజం స్థాపనకి కూడా తొలి జన్మస్థానంగా వుంటుందనే అంచనాకి దారితీసింది. ఆ పడమర దేశాల ఆర్ధిక వ్యవస్థలే చరిత్రలో పెట్టుబడిదారీ వ్యవస్థను సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థగా మార్చి వేసాయి. ఫలితంగా సామ్రాజ్యవాద యుగం ఏర్పడింది. దీంతో తొలి సోషలిస్టు విప్లవాల జన్మస్థలం పై ఆనాటి అంచనా గురి తప్పింది. తొలి సోషలిస్టు విప్లవానికి జన్మస్థానం రష్యాకి బదిలీ కావడం కాకతాళీయ సంఘటన కాదు.
రష్యా తూర్పు దేశమా? కాదు, మరి పడమర దేశమా? కాదు. ఈరెండూ కాకపోతే మరేమిటి? భౌగోళికంగా రష్యా స్థానాన్ని బట్టి తూర్పు దేశాల దృష్టిలో అది పడమటి దేశమే! పడమటి దేశాల దృష్టిలో తూర్పు దేశమే!
అదే విధంగా అవి దక్షిణ దిక్కు వైపు సాగాయి. చీకటి ఖండమైన ఆఫ్రికా లో వరసగా జాతీయ విమోచన విప్లవాలు! అవి పడమర భూగోళంలో దక్షిణ దిశలోని లాటిన్ అమెరికా దేశాలకు కూడా విస్తరించాయి. ఐతే అవి సోషలిస్టు విప్లవాలు కాదు. వాటికి ముందు అవి మధ్యంతరంగా ముందుకొచ్చినవే! అవే సోషలిస్టేతర విప్లవాలు! అవి జాతీయ విమోచన విప్లవాలుగా మారాయి.
పై సోషలిస్తేతర విప్లవాలు మరో రూపంలో ప్రపంచ పెట్టుబడి మీద ఎక్కుపడిన తుఫాన్లే! ఏ నినాదంతో జరిగినా, ఏ రూపం తీసుకున్నా అవి నేటికీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి పలు యూరోపేతర దేశాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. అదో చరిత్ర!
రష్యా సోషలిస్టు విప్లవ చరిత్ర సంస్మరణ ద్వారా రాజకీయ కర్తవ్య దీక్ష వహించడం ఓ భాగం. గుర్తించదగ్గ కర్తవ్య దీక్షా స్ఫూర్తి మరొకటి వుంది. అది గుర్తు చేసుకుందాం.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి జన్మస్థానమైన పడమర యూరోప్ లోని కార్మికవర్గం నిజానికి ప్రపంచ సోషలిస్టు విప్లవ గమనంలో అగ్రగామి పాత్రని పోషించాల్సి ఉండేది. కానీ ‘ప్రపంచ పెట్టుబడి’ 20వ శతాబ్ది ఆరంభంలో దాని దారిని తప్పించింది. అది నాటి సామ్రాజ్యవాద యుగం ఏర్పడటంతో జరిగింది. దానివల్ల విప్లవ దిశ మారింది. విప్లవాల గమనదిశ పడమర నుండి తూర్పు, దక్షిణాల వైపుకు మారింది. నేటి సామ్రాజ్యవాద యుగ విప్లవ స్వభావమిది.
రష్యా నుండి విప్లవాలు తూర్పు వైపు ప్రయాణించాయి. ఫలితమే చైనా, కొరియా, వియత్నాం, లావోస్, కంపూచియా విప్లవాలు!
ఇక్కడ దిక్కులు, దిశలు ముఖ్యం కాదు. కేవలం అవి భౌగోళిక ప్రస్తావనకే పరిమితం. ఆయా ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలే ముఖ్యమైనవి. తూర్పు, దక్షిణ దిక్కుల్లోని దేశాల్లో అవి ఉండటమే కారణం. రష్యా సోషలిస్టు విప్లవ సంస్మరణ నుండి పొందే విప్లవ రాజకీయ స్ఫూర్తి సామ్రాజ్యవాద యుగ విప్లవ కర్తవ్యానికి ఉపయోగపడాలి. నేడు గమనదిశను మార్చుకొని నేడు ప్రపంచ పెట్టుబడి పై విరుచుకుపడే విప్లవ తుఫాన్లని ఆహ్వానిద్దాం. సామ్రాజ్యవాదంపై ఇక్కడ కొట్టే దెబ్బలు అక్కడి పెట్టుబడిని బలహీన పరుస్తుంది. అలాంటి స్థితే పడమర యూరోప్ లో రేపటి సోషలిస్టు విప్లవాల వెల్లువకు దారితీస్తుంది. 104వ రష్యా సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కర్తవ్య దీక్షను చేపడదాం.