తెలంగాణని క్షుద్ర రాజకీయల ప్రయోగశాలగా మార్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇద్దరు పెట్టుబడిదారుల మధ్య ఎన్నిక: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్
”హుజురాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరిగిన ఎన్నిక కాదు. ఇద్దరు పెట్టుబడిదారుల మధ్య జరిగిన ఎన్నిక. ఆత్మ గౌరవం అని ప్రచారం చేసుకున్న వ్యక్తి పెట్టుబడి రూ. 500 కోట్లు. కేసీఆర్ అహంకారం నిలబెట్టుకోవడం కోసం పెట్టిన పెట్టుబడి రూ.5500 కోట్లు. ఇంత నీచ రాజకీయమా ? అని ధ్వజమెత్తారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
బుధవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు దాసోజు.. తెలంగాణ ఉద్యమం పేదోడి రక్తతర్పణం. తెలంగాణ రాష్ట్రం త్యాగాలు, ఆత్మ బలిదానాల ఫలితం. రాష్ట్రం ఏర్పడితే సామాజిక న్యాయం జరుగుతుందనే గొప్ప మనసుతో సోనియా గాంధీ తెలంగాణ కల సాకారం చేశారు. కానీ నేడు హుజురాబాద్ ఎన్నిక చూస్తుంటే .. టీఆర్ఎస్, బిజెపి.. తెలంగాణని క్షుద్ర రాజకీయల ప్రయోగశాలగా మార్చారు ” అని మండిపడ్డారు.
‘అసలేం ఎన్నిక ఇది. ? రూ.5500 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ఓడిపోయారని సంబరపడాలా ? రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి గెలిచినందుకు ఆనందపడాలా? హుజురాబాద్ ఎన్నిక చుసిన తర్వాత రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఎన్నికల్లో అడుపెట్టడానికి వీలు లేకుండా క్షుద్ర రాజకీయం చేశారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ .. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అసలు తెలంగాణని ఎందుకు తెచ్చుకున్నామో అని బాధ పడే రీతిలో రాష్ట్రాన్ని రాజకీయ వ్యాపార ప్రయోగ శాలగ మార్చారు తెలంగాణ సమాజం ఈ క్షుద్ర రాజకీయాన్ని గమనించాలి.” అని కోరారు.
”కేంద్ర ఎన్నిక కమీషన్ ని ఆశ్రయించాం. హుజురాబాద్ లో మద్యం, మాంసం, డబ్బులు ఏరులైపారుతుంది. ఎన్నికల కోడ్ ని అడుగడుగునా తూట్లు పొడుస్తూ టీఆర్ఎస్ బిజెపిలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంకు వెన్నుపోటు పొడిచి జరుగుతున్న కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయండని కోరితే.. ఇంకాస్త ముందు రావాల్సిందని ఎన్నికల కమీషన్ సన్నాయి నొక్కులు నొక్కింది. మద్యం, మాంసం, డబ్బు సంచులు విచ్ఛవిడిగా పంచుతుంటే ఒక్క వందరూపాయిల నోటు ని పట్టుకున్న పాపాన పోలేదు. ఇదేం ఎన్నికల కమీషన్ ? ఎవరి కోసం ఎన్నికల కమీషన్ ? దొందుదొందుగా మారి తెలంగాణలో క్షుద్ర రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణ లో ఒక రాజకీయ వ్యాపరం జరుగుతుంది. ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఓట్లకు మాకు డబ్బులు ఇవ్వలేదని నిరస తెలుపుతున్నారంటే.. ప్రజలని ఎంత మానసిక దౌర్భల్యంలోకి నేట్టాశారో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్దులు, మేధావులు ఈ కుటిల రాజకీయాన్ని ప్రశ్నించాలి” అని విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నిక తో కేసీఆర్ కోట గోడ బద్దలైయింది. ఓటమి వుండదనే పరిస్థితిలో టీఆర్ఎస్ ఓడింది. ఇది బిజెపి గెలుపు కూడా కాదు. ఆ పార్టీకి నిర్మాణం లేదు, తల లేదు తోక లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది” అని వెల్లడించారు దాసోజు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి, సినియర్ నాయకులు షబ్బీర్ అలీ. మల్లు రవి, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.