అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని “న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’’నినాదంతో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ఈ రోజు మూడో రోజుకు చేరుకుంది.
ఈ రోజు విశేషం యాత్రలో 75 సంవత్సరాల మహిళా కూడా ఉండటం. ఆమెకూడా అమరావతి విధ్వంసం బాధితురాలే.ఆమె పేరు శ్రీమతి రాజ్యలక్ష్మి. ఈ వయసులో కూడా ఆమె ఈ పాదయాత్ర పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఆమె స్వగ్రామం వెంకటాయపాలెం. ఆమె కుటుంబం అమరావతి రాజధాని నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమి ఇచ్చింది.
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి ఆమె మందడం దీక్షా శిబిరంలో పట్టుదలగా క్రమం తప్పకుండా కూర్చుని ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఈ యాత్ర ఇవాళ గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభన సంగతి తెలిసిందే. నేడు 10.8 కిలోమీటర్ల మేర చేసే ఈ పాదయాత్ర గుంటూరు నగరంలో కొనసాగనుంది. దారిపొడవునా ఈరైతులకు, మహిళలకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర ఈ రోజు గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో యుగియనుంది.
అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 గ్రామాల మీదుగా శాంతియుతంగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగుస్తుంది.