హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాల మీద మోసుకునే హరీష్ రావు చేశారు.కారణం ఏమోగాని, కెసిఆర్ గాని, ఐటి మంత్రి కెటిఆర్ గానీ, కూతురు, ఎమ్మెల్సీ కవిత గాని, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు గాని అటువైపు చూల్లేదు. పగలురాత్రి కష్టపడి హరీష్ రావు పార్టీ గెలుపుకోసం కృషి చేశారు. వూరూరు తిరగారు. వీధి వీధి తిరిగారు. ప్రతి మనిషిని పరామర్శించారు. ఈ క్యాంపెయినలో హరీష్ రావు కష్టానికేమీ డోకా లేదు. ఆయన ప్రచారశైలి బిజెపిని కూడా హడలగొట్టింది.
ఇంకా స్పష్టంగా చెబితే, ముఖ్యమంత్రి కెసిఆర్ బొమ్మ, ప్రస్తావనతోనే ఆయన క్యాంపెయిన్ చేశారు. ఒక విధంగా చెబితే, హుజూరాబాద్ లో హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ ను గెలిపించే ప్రయత్నం చేశారు. హరీష్ రావు హుజూరాబాద్ లో కూడా కొడంగల్ గాలి సృష్టిస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే, పరిస్థితి తారుమారయింది. హరీష్ ఎన్నికల మేనేజ్ మెంటుకి తొలిసారి పరాజయం ఎదురయింది.
చాలా మంది బిజెపి నేతలు అపుడే చెబుతున్నట్లు ఈ ఎన్నిక ముఖ్యమంత్రికి వ్యక్తిగత పరాజయమేమో. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఈ ప్రకటన చేశారు.
“ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున క్రతజ్ఙతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు దన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదు,” అని హరీష్ రావు అన్నారు.
“అయితే, దేశంలో ఎక్కడా లేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కల్సిపనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదు.. గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచిన టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది,” అని అన్నారు.