నవంబర్ 1 గొప్ప ఆశయంతో ఏర్పడిన విశాలాంధ్ర. కానీ 58 సంవత్సరాలికే ముగిసింది. ఆశయం గొప్పది కావచ్చు ఆ ఆశయం ఏ ఆలోచనలకు ప్రతిబింభం , ఏ అవగన ఫలితం అన్న ప్రాధమిక సూత్రాన్ని అధికారంలోకి వచ్చిన పాలకులు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల విశాలాంధ్ర తన మనుగడను సాగించలేదు.
1953 అక్టోబర్ 1 కి పూర్వం తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉంటే రాయలసీమ , కోస్తాంధ్ర కలిపి మద్రాసు రాష్ట్రంలో ఉన్నది. తమిళుల ఆధిపత్యం వద్దు తెలుగు వారిగా విడిపోదాము అన్న ఆలోచన ఫలితం – శ్రీభాగ్ అవగాహనతో 1953 అక్టోబర్ 1 న తొలి భాష ప్రయోక్త రాష్ట్రం ఆంధ్రరాష్టం ఏర్పాటు జరిగింది. తొలి భాషా ప్రయోక్త రాష్ట్రం నిజమే కానీ అందుకు పునాది శ్రీభాగ్ అవగానే. ఆ ప్రాధమిక సూత్రాన్ని నేటికి పాలకులు గుర్తించడం లేదు. రాజధాని , కృష్ణా , తుంగభద్ర నదులపై రాయలసీమ ప్రయోజనాలు కోసం ప్రాజెక్టుల నిర్మాణం , నీటి కేటాయింపు జరగాలి. పేరుకు రాజధాని కర్నూలులో ఏర్పాటు చేసినా కీలకమైన నీటి ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం చేపట్టలేదు ఫలితం కృష్ణా , తుంగభద్రకు ముఖద్వారం అయిన రాయలసీమకు నీటిని వినియోగించే హక్కే లేదని తెలంగాణ వాదించే పరిస్థితి ఏర్పడింది. తదనంతరం 3 సంవత్సరాలికే తెలంగాణ – ఆంధ్రరాష్ట్రం కలిపి విశాలాంధ్ర గా ఏర్పాటు చేయాలని పెద్దల ఆలోచనలలు , పెద్దమనుషుల ఒప్పందం ఫలితంగా 1956 నవంబర్ 1 న ఆంద్రప్రదేశ్ రూపాంతరం చెందింది. విచిత్ర మేమిటంటే 3 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు కోసం శ్రీభాగ్ అవగాహన జరిగిందని అందులో రాజధాని , నీటి ప్రాజెక్టుల పూర్తి రాయలసీమలో జరగాలన్న శ్రీభాగ అవగన ఒకటి ఉంది అని కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో మాటవరసుకు కూడా ప్రస్తావన లేదు. ఒప్పందం చేసుకున్నా అమలు కానీ రాజకీయ వ్యవస్థలో ఒప్పందం చేసుకోకుండా న్యాయం చేస్తారని ఎలా ఆశిస్తాము.
పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది కానీ శ్రీభాగ్ ఒప్పందం లాగే దాన్ని పాలకులు పట్టించుకోకుండా పాలన సాగించారు. ఎంతగా అంటే ఆంధ్రప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంద్రప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలి. చిన్న ఆకాంక్షను కూడా గుర్తించడానికి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇష్టపడలేదు. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన వారు ఆ పదవి వల్ల ప్రయోజనం కలుగుతుందా ? అని ప్రశ్నించారు. 23 జిల్లాల రాష్ట్రంకు ఉప ముఖ్యమంత్రి వద్దు అని నీతులు చెప్పిన వారు 13 జిల్లాల ఏపీకి 2 – 5 మంది , 10 జిల్లాల తెలంగాణ కు 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఎందుకు రాజకీయ అవసరాలకు అనుగుణంగా.. రాజకీయ అవసరాల నిమిత్తం పని చేశారు తప్ప ఒప్పందం ప్రకారం పాలన కోసం ప్రయత్నాలు చేయలేదు.
హైదరాబాద్ కేంద్రంగా కేంద్రీకృత పాలన సాగింది. ఫలితం మరో మంచి నగరం రాష్ట్రంలో లేకుండా పోయింది. శ్రీకృష్ణ కమిటీ అంచనా ప్రకారం రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు అన్ని గ్రామీణ స్వభావంతో ఉన్న పట్టణాలు. కృష్ణా నదికి ముఖద్వారం అయిన దక్షిణ తెలంగాణ , రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం , నీటి కేటాయింపు చేయని పాలకుల నిర్లక్ష్యం నేటికీ నీటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితం 2014 లో మరో విభజన జరిగింది.
శ్రీ భాగ్ , పెద్దమనుషుల ఒప్పందాలను నిర్లక్ష్యం చేయడం వల్ల విభజన జరిగింది అన్న సత్యాన్ని గుర్తించడం కనీస ధర్మం. 2014 లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అందుకు భిన్నంగా పాలనా ప్రాధాన్యతలను రూపొందించుకుంది. రాజధాని ఏర్పాటుతో సహా మరో మారు కేంద్రీకృత అభివృద్ధి నమూనా పాలన చేసింది. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం శ్రీభాగ్ ఒప్పందాన్ని గుర్తిస్తామని ప్రకటించింది. ప్రకటించిన ప్రాధాన్యతలు బాగున్నా అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేని చారిత్రక ప్రాధాన్యం ఉన్న అక్టోబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గుర్తించడానికి అంగీకరించలేదు. రాయలసీమ వాసుల చిరకాల కోరిక కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు నిరాకరించి సంబంధం లేని విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యతలు బాగున్నా అడుగులు అందుకు భిన్నంగా పడుతున్నాయి. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్అవతరణ గొప్ప ఆశయంతో ఏర్పాటు జరిగి ఉండవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు , కుదిరిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని అధికారంలోకి వచ్చిన వాళ్ళు పాలన సాగించకపోతే చరిత్రలో అవి నిలబడవు. శ్రీభాగ్ ఒప్పందానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు పాలన సాగించకపోతే మరో విభజనకు దారి తీస్తుంది.