“ప్రధానమంత్రి, హోం మంత్రి ఇంటర్వ్యూలు లభించడం, లభించక పోవడం” అన్న అంశంపై పాలక, ప్రతిపక్ష పార్టీల వారు చేసుకొంటున్న వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలను చదువుతున్నాం, వింటున్నాం.
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకొనే మాజీ ముఖ్యమంత్రికి ఇంటర్యూ నిరాకరణ అంటూ పాలక పార్టీ వారు, ఇంటర్యూ కోసం డిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పడిగాపులు కాయలేదా! అంటూ ప్రతిపక్ష పార్టీ వారు, ప్రధాన మంత్రి లేదా హోంమంత్రి ఇంటర్యూ దొరికితేనో! లేదా! వారు ఫోన్ చేస్తేనో! ఇరుపక్షాల వాళ్ళు ఆయా సందర్భాలలో జబ్బలు చరుచుకోవడం, ఇదొక మానసిక జబ్బు.
కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నవారిలో తాము ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామనే చైతన్యం కొరవడిన కాలంలో జీవిస్తున్నాం. అన్నింటినీ రాజకీయ లబ్ది కోణంలోనే చూసే ధోరణి ప్రబలిపోయింది. “నా వారు, నా ప్రత్యర్థులు” అన్న సంకుచిత రాజకీయ ఆలోచనకు పాలకులు బానిసలైనారు. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు. కానీ, కట్టుబడి ఉండరు. ప్రజాస్వామ్యంపై బల్లగుద్ది ఉపన్యాసాలిస్తారు. ఆచరణలో అప్రజాస్వామిక పాలన సాగిస్తారు. దేశ రాజకీయ రంగంలో బలంగా వేళ్ళూనుకొన్న ఈ నైజమే భారత పార్లమెంటరీ వ్యవస్థను, సమాఖ్య వ్యవస్థను రోజు రోజుకూ బలహీనపరుస్తున్నది.
ప్రధానమంత్రి, హోంమంత్రి ఇంటర్యూ దొరికితే ఏంటి? దొరక్కపోతే ఏంటి? అదొక సమస్యా? ఆ బాధ్యతలు నిర్వహించే వారికి ఆ సమయంలో కుదరకపోవచ్చు! లేదా! రాజకీయపరమైన, మరేదైనా కారణంకావచ్చు కూడా! కానీ, ఏ సమస్యపైన, అంశంపైన ప్రధానమంత్రి, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇంటర్యూకోరిన వారు ప్రయత్నించారన్న దానిపై చర్చ జరగాలి. ఆ చర్చ కూడా సమాజం మరియు ప్రజాప్రయోజనం కోణంలో హేతుబద్ధంగా జరగాలి. అంతే కానీ, చౌకబారు వ్యాఖ్యల వల్ల ప్రయోజనం ఏంటి?