‘గెల్లుకు 25 వేల మెజారిటి’

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి సభలో ప్రసంగిస్తూ టిఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 25 వేల మెజారిటీ వస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అధికార పార్టీని ఉరుకులు పెట్టించిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తరఫునుంచి ఇంకా ఇలాంటి ప్రకటన రాలేదు. ఈటెల శిబిరంలో కూడా గెలుపు ఉత్సాహం కనిపిస్తూ ఉంది. టిఆర్ ఎస్ లాగే , ఈటెల కూడా ధైర్యంగా తన మెజారిటీ ప్రకటిస్తాడమో చూడాలి.

టిఆర్ ఎస్ తరఫున హరీష్ రావు  5 నెలల కిందటే ప్రచారం  మొదలుపెట్టారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి అంతకు ముందు మహత్తరమయిన తెలంగాణ ఉద్యమం నడిపి, అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించినా  ఒక ఉప ఎన్నిక కోసం ఐదు నెలల ముందే టిఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిందంటే ఈ ఎన్నికకు  ముఖ్యమంత్రి కెసిఆర్  ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో అర్థమవుతుంది.

మంత్రి హారీష్ రావు తీవ్రంగా కష్డపడుతున్నారు. కెసిఆర్ కుటుంబం నుంచి ఎవరూ  ప్రచారం పాల్గొనలేదు. ఎమ్మెల్సీ కవిత హుజూరాబాద్ లో బతుకమ్మ  డ్యాన్స్ కోసం కూడా రాలేదు. అలాగే ఐటి మంత్రి కెటిఆర్ కూడా ఈ పక్కకు రాలేదు. గెల్లుశ్రీనివాస్ ని గెలిపించే బాధ్యతను పార్టీ పూర్తిగా హరీష్ రావు మీదే వేసింది. ఆయన హుజూరాబాద్ లోనే మకాం వేసి పగలు వూరేగింపులు ర్యాలీలు, రాత్రి మంతనాలు, కులసంఘాల సమావేశాలు నిర్వహించి చేస్తున్న ప్రచారానికి నేడు చివరి రోజు.

ఈ రోజు జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ లో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ప్రచారం రాత్రి ఏడుగంటలకు ముస్తుంది. రాత్రి ఏడూ గంటల నుండి మైకుల చప్పుడు ఉండదు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్యే కళ వచ్చింది. సి ఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ 25 వేల మెజారిటీతో గెలవబోతున్నారు అని హరీష్ ప్రకటించారు.

ఈరోజు ప్రచారం చివరి రోజు.. అందరి మాటలు విన్నారు. ఎవరు ప్రజలకు సహాయం చేస్తారు. ఎవరి వల్ల పనులు జరుగుతాయి అన్నది అలోచించి ఓటు వేయాలి. అందరు చెప్పింది వినాలి. కానీ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. తిన్న రేవు తలవాలి అన్నారు పెద్దలు. ఆలా తెలిస్తేనే… నీయతి, బర్కత్ ఉంటది అని హరీష్ రావు అన్నారు.

ఆయన చివరి రోజున  ప్రచారం చివరి ఉపన్యాసం  ఇలా సాగింది

2016 రూ. పింఛన్ ఇచ్చింది కారు, కేసీయారు కాదా?

ప్రధానమంత్రి సొంత రాష్ట్రము గుజరాత్ లో ఇస్తున్నది వృద్దులకు వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్ మాత్రమే…

మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు రూ. 200 ఉన్న పింఛన్ రూ. వెయ్యి చేసాం. మరోసారి 2016 చేసాం..

కల్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు మొదట ఎస్సీలను మాత్రమే అమలు చేసాం.. అప్పుడు రూ 50 వేలు మాత్రమే ఇచ్చినాం.. కొంచం చేయి తిరిగిన తర్వాత.. అందరికి అమలు చేసారు… ప్రస్తుతం రూ. లక్ష 116 రూపాయలు ఇస్తున్నాం.

కేసీఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానలో డెలివరీ చేసి రూ. 12 వేల రూపాయలు ఇచ్చి ఇంటిదగ్గర దింపుతున్నది కేసీఆర్ ప్రభుత్వం

జమ్మికుంటలో డాక్టర్ల మీటింగ్ పెడితే.. డాక్టర్లు చెప్పారు.. కేసీఆర్ కిట్ ప్రథకం పెట్టిన తర్వాత మాకు గిరాకీ తగ్గిందని. అందరు సర్కారు దవాఖానలపై వెళ్తున్నారని, గతంలో 15 డెలివరీలు చేసేవాళ్ళం.. ఇప్పుడు ఒకటి రెండు కూడా రావడం లేదని చెప్తున్నారు.. కేసీఆర్ పెట్టిన పథకం మంచి ఫలితం ఇచ్చినప్పుడు నా మనసుకు సంతోషం కలిగింది..

హరీష్ రావు చివరి ప్రచార సభ

70 ఏళ్ల పాలనలో రైతులకు డబ్బు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రైతులతో నీటి తీరువా, భూమి శిస్తు కట్టించారు. కానీ రైతుబంధు ఇస్తూ రైతుకు శిస్తు కడుతున్న ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం… ఉచిత కరెంటు ఇచ్చింది టీఆరెస్ ప్రభుత్వం…

ఎండాకాలం యాసంగి పంట వేయాలంటే.. రైతులు నీళ్లు లేక బాధపడేవాళ్లు… మొఖాన్ని మొగులుగు పెట్టి చూసేవాళ్ళు… అనుమానం మీద నారు పోసేవాళ్ళు.. పొట్టకు వచ్చే వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి.. షెట్టర్లు పగులగొట్టేవాళ్ళు… కాలువలు తెగ్గొట్టేవాళ్ళు… ఎవరైనా కాలువకు మోటార్లు పెడితే… ఎమ్మార్వో ఆఫీసు వాళ్ళు వచ్చి పైపులు కోసేవాళ్ళు.. మోటార్లు జీపులో వేసుకుపోయేవాళ్లు, ధర్నాలు చేసేవాళ్ళు… ఇప్పుడు ఆ బాధలు ఉన్నాయా? బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం… నీళ్లు ఇక చాలు.. బంద్ చేయండి అనే దాకా ఇస్తున్నాం..

వెనుకటి ఎవరైనా పెద్దలు చనిపోతే… బొక్కలు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లలో కలిపి సీసాల్లో నీళ్లను తెచ్చుకునేవాళ్ళం.. వంద తాటిచెట్ల లోతున ఉన్న కాళేశ్వరం నీళ్లను ఎత్తి పోస్తే.. బిజిగిరి షరీఫ్ నడి ఊళ్ళో నుండి నీళ్లు పోతున్నాయా? లేదా? .. ఈ ఘనత టీఆరెస్ దే

కరెంట్ గతంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు… బావుల గడ్డల మీద, పొలం గట్ల మీద రైతులు పడుకునేవాళ్ళు… కానీ నేడు 24 గంటల కరెంటు ఇచ్చింది టీఆరెస్ ప్రభుత్వం…

కానీ ఈటల రాజేందర్, బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చారు? బొందపెడుతా… కూలగొడుతా.. కాలవెడుతా.. అంటు చూస్తా.. గోరీ కడుతా అని అన్నాడే తప్ప . నిరుపేదలకు ఏమైనా చేస్తా అని చెప్పాడా?

టీఆరెస్ వాళ్ళను తిట్టడం తప్ప రాజేందర్ చెప్పింది ఏమి లేదు.. నీ స్వార్థం కోసం బీజేపీ లో చేరావు

బీజేపీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1050 చేసింది. ఓట్లు అయిపోయిన తర్వాత రూ. 200 ఒకేసారి పెంచుతారట .. సబ్సిడీ మాత్రం తగ్గించారు..

ప్రతి గ్రామానికి మహిళా భవనానికి రూ. 15 లక్షలు ఇచ్చాము.. మహిళా సంఘాలకు రుణాలు చెక్కులు ఇచ్చాము.. రోడ్లకు నిధులు ఇచ్చాము.. మేము పనిచేశాం… మాకు ఓట్లు వేయమని అడుగుతున్నాం…

ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు.. సిలిండర్ ధర తగ్గించాలని అడిగాం… సబ్సిడీ రూ. 250 ఇవ్వాలని అడిగాం.. ఉత్త చేతులు, గాలి మాటలు తప్ప పేదలకు ఏం చేస్తారో చెప్పలేదు..

బీహార్ రాష్ట్రానికి చెందిన డోలా కుమారి కి ప్రధాని మోడీ ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చారు.. గ్యాస్ సిండర్ 400 నుండి వెయ్యి దాటడంతో ఆమె సిలిండర్ అటక ఎక్కించింది.. పొయ్యిల కట్టెలు వాడుతోంది.. ఏడాది వరకు సిలిండర్ రూ. రెండు వేలు దాటుతుంది… ఇందుకు బీజేపీకి ఓటు వేద్దామా?

ఇక సిలిండర్ ధర పెంచమని చెప్పండి అని బీజేపీ నాయకులను అడిగాం… అదికూడా వారు చెప్పడం లేదు..

30 వ తారీకు రోజు ఓటు వేసే ముందు మహిళలు వంట గదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి బీజేపీని బొందపెట్టండి… ఆలాగైతేనే గ్యాస్ ధర తగ్గుతుంది…

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు.. ఒక ఎకరం దూన్నెందుకు రూ. 2500 అయ్యేది. కానీ నేడు.. రూ. 6 వేలు అవుతోంది. డీజిల్ ధర పెరగడమే.. దీనికి కారణం… కేసీఆర్ రైతుబంధు రైతు కుడి చేతికి ఇస్తుంటే… ఎడమ చేతితో బీజేపీ తీసుకుంటోంది.. మంచినూనె 200 అయింది.. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి….

హరీష్ రావు ప్రచార అస్త్రాలు

రాజేందర్ కు ఎం చెప్పాలో తెలియడం లేదు.. అందుకే టీఆరెస్ ను తిడుతున్నాడు… బీజేపీ కాంగ్రెస్ తెలంగాణాలో అధికారం లోకి వచ్చేది లేదు..

రాజేందర్ రాక ముందు టీఆరెస్ గెలిచింది… రాజేందర్ పోయిన తర్వాత కూడా గెలిచేది.. టీఆరెస్ పార్టీనే..

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి.. ఇంటి అడుగు జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల 4 వేలు మంజూరు చేస్తాం… రాజేందర్ మంత్రి గా ఉంది ఒక్క ఇంటిని కూడా నిరుపేదల కోసం నిర్మించి ఇవ్వలేక పోయారు..

మైనారిటీలకు షాదీ ముబారక్ సి ఎం ఇస్తున్నారు.. మైనారిటీ విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో గురుకుల పాఠశాలలు సి ఎం కేసీఆర్ పెట్టారు… ఒక్కో విద్యార్ధి పేరు మీద రూ. లక్ష ఏడాదికి ఖర్చు చేస్తున్నారు..

రైతులకు రూ. లక్ష మాఫీ వచ్చే బడ్జెట్లో మాఫీ చేస్తాం… 57 ఏళ్లకే పింఛన్ కూడా ప్రారంభిస్తాం.. దళిత బందును అమలు చేస్తాం…

ఇంకా రెండేళ్లు టీఆరెస్ ప్రభుత్వమే ఉంటుంది… దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే వస్తాయా?

బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు.. ఏమి ఇచ్చేది కూడా లేదు.. వాళ్ళు జుట మాటలు, తొండి మాటలు మాట్లాడుతున్నారు..

బీజేపీ నాయకులూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. గ్యాస్ లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందని చెప్తున్నారు.

రైతులు ఇష్టం వచ్చిన పంటలు వేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ఏదైనా వేసుకోవచ్చు.. దీనిపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.. రైతులు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం..

ఎవరో దాడులు చేసినట్టు సృష్టించి సానుభూతి పొందే ప్రయత్నం ఈటల రాజేందర్, బీజేపీ చేస్తోంది.. వాటిని నమ్మకండి… సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయాలనీ చూస్తున్నారు… బీజేపీ నాయకులూ… వీటిని నమ్మొద్దు… హుజురాబాద్ ప్రజలు లాభపడాలి..

మండలంలో బిజిగిరి షరీఫ్ లో ఎక్కువ మెజారిటీ గెల్లు శ్రీనివాస్ కు ఇవ్వాలి… కోటి రూపాయలు అభివృద్ధి పనులకు ఇస్తా..

గెల్లు గెలుపు ఖాయమైంది.. మెజారిటీనే ఎక్కువ రావాలి.. ఇల్లందకుంట రామాలయానికి రూ. 10 కోట్లు, బిజిగిరి షరీఫ్ కు రూ. కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *