*లోక్ సత్తా పార్టీ నూతన అధ్యక్షుడిగా భీశెట్టి బాబి, 8 లక్ష్యాలతో కార్యాచరణ
హైదరాబాద్, : పక్షపాత రాజకీయాలకి అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సత్తా పార్టీని పునర్నిర్మాణం చేస్తున్నట్లు వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్ నారాయణ్ ప్రకటించారు.
ఈ లక్ష్యాలపైన అధ్యయనం చేయటానికి, ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టటానికి, నిర్మాణాత్మకమైన ఉద్యమ కార్యకలాపాలు చేపట్టటానికి, తగిన రీతిలో ప్రతి లక్ష్యానికి సంకల్పం, సామర్థ్యం ఉన్న నాయకులను గుర్తించి వారితో బృందాల్ని ఏర్పాటు చేయటానికి ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నేత భీశెట్టి బాబ్లీని లోక్సత్తా పార్టీ ఏపీ నూతన అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు.
“ఈవేళ దేశం ఉన్న పరిస్థితుల్లో ఈ రంగాల్లో మౌలిక మార్పుల కోసం లోక్సత్తా ఉద్యమం, ప్రజాస్వామ్య పీఠం (ఎడీఆర్).. అవే లక్ష్యాల కోసం ఒక పార్టీగా లోక్సత్తా ఏర్పడ్డాయి. ఇదే నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలు, పక్షపాత రాజకీయాలకి అతీతంగా దీర్ఘకాల దృక్పథంతో పైన పేర్కొన్న లక్ష్యాల కోసం కృషి చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని పెంచి నిర్మాణాత్మక ఉద్యమ కార్యకలాపాలని చేపట్టటం లోకసత్తా పార్టీ బాధ్యత. అందుకనుగుణంగా లోక్ సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖను పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్మిర్మాణం చేపట్టటం కోసం పార్టీలో సభ్యత్వ నమోదు, అంతర్గత ఎన్నికల్ని నిర్వహించే వరకు శ్రీ భీశెట్టి బాబి గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించటమైనది.
పైన పేర్కొన్న 8 లక్ష్యాలపై అధ్యయనం చేయటానికి, ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టటానికి, నిర్మాణాత్మకమైన ఉద్యమ కార్యకలాపాలు చేపట్టటానికి తగిన రీతిలో ప్రతి లక్ష్యానికి సంకల్పం, సామర్థ్యం ఉన్న నాయకులను గుర్తించి వారితో బృందాల్ని ఏర్పాటు చేయటం నవంబర్ 30 నాటికల్లా పూర్తి చేయాలని నూతన అధ్యక్షుడ్ని కోరటమైనది. రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలకి, పక్షపాతాలకి అతీతంగా ఉండి విశ్వసనీయత, అనుభవం ఉన్న నాయకులు, పౌరులతో సంప్రదింపులు, సమావేశాలు జరిపి రాష్ట్ర రాజకీయాల్లో సామరస్య వాతావరణం ఉండేలా కృషి చేయటం.. తేవాల్సిన సంస్కరణలు, ప్రభుత్వ విధానాలపైన ఆరోగ్యకరమైన, హేతుబద్దమైన బహిరంగ చర్చను చేపట్టటం అత్యవసరం. ఇందుకు కావలసిన చర్యలన్నిటినీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రముఖులనీ సంప్రదించి చేపట్టాలని కోరటమైనది” అని శనివారం ఒక ప్రకటనలో జయప్రకాష్ నారాయణ్ తెలిపారు.
ఎనిమిది లక్ష్యాలు ఇవే…
(1) అధికార వికేంద్రీకరణ: ఓటుకి, వ్యక్తి జీవితానికి మధ్య సంబంధం ప్రజలకు బోధపడేలా అధికార వికేంద్రీకరణ
(2) చట్టబద్ధపాలన: ఎక్కువ తక్కువలు, ధనిక-బీద, అగ్ర-నిమ్న కులవివక్ష లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తించేలా చేయటం
(3) సామాన్య పౌరులకి సక్రమంగా పౌర సేవలు: వేధింపులు, అవమానాలు, లంచాలు లేకుండా సామాన్య పౌరులకి సకాలంలో, సక్రమంగా, గౌరవప్రదంగా పౌర సేవలు అందే ఏర్పాటు
(4) ప్రజలకు ఆర్థిక భారం లేకుండా సమగ్ర ఆరోగ్య వ్యవస్థ అమలు: కొవిడ్ కాలంలో ఆరోగ్య రంగంలో సంక్షోభం చూశాక ప్రజలంతా కోరుకుంటున్నట్లు.. ప్రాథమికం నుండి తృతీయ దశ వరకూ అన్ని స్థాయిలో ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ప్రజానీకం తమకు నచ్చిన వైద్యుని వద్ద చికిత్స పొందేలా సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించటం
(5) ఏ స్కూల్లో చదివినా ప్రతి బిడ్డకూ మంచి ప్రమాణాల విద్య. విద్యలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల తేడా లేకుండా మంచి ప్రమాణాల విద్యను ప్రతి బిడ్డకూ అందేలా చేయటం, కుటుంబం మీద ఆర్థిక భారం లేకుండా
(6) పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం: అన్ని స్థాయిలో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం తగిన ఏర్పాట్లకు కృషి
(7) వ్యవసాయంలో ఆదాయం: సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని పొందేందుకు విధానాలు చేపట్టటం, వ్యవసాయానికి ఇతర రంగాలకు మధ్య సంబంధాలను పెంచి యువతకు ఉపాధిని కల్పించటం, చిన్న పట్టణాల అభివృద్ధి, వాటితో వ్యవసాయానికి అనుబంధం ద్వారా వలసల అవసరం లేకుండా మంచి ప్రమాణాల జీవితాన్ని గ్రామీణ ప్రజలకు అందించటం
(8) రాజకీయ సంస్కరణలు: ఎన్నికల్లో డబ్బు, తాత్కాలిక తాయిలాలు, కుల, మత, ప్రాంత విభజనల్ని అరికట్టి మంచి నాయకత్వం ఎదిగేందుకు వీలుగా ఎన్నికల వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో సమూల సంస్కరణలు..