జూబిలీ హిల్స్ శ్రీవారి పవిత్రోత్సవాలు

మూడో సంవత్సరంలో ప్రవేశించిన  హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.

జూబిలీ హిల్స్ ఆలయం

జూబిలీ హిల్స్ ఆలయం 2019 మార్చి 13న మొదలయింది. జూబిలీ హిల్స్  రోడ్ నెంబర్ 92లోని ఒక చిన్నగుట్టుమీద ఈ ఆలయం నిర్మించారు. ఆలయంలో శ్రీవారి ఎత్తు 8.6 అడుగులు.

హైదరాబాద్ లో ఏడుకొండల వాడి రెండో అడ్రసు ఇది. మొదటి అడ్రస్ హిమయత్ నగర్ లిబర్టీ సర్కిల్ లో ఉంటుంది. హైటిక్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సైబర్ ప్రాంతాల ప్రజలకు ఈ ఆలయం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నది. ఇక్కడ సుప్రభాత సేవతో పాటే, అభిషేకం, కల్యాణం చేయించేందుకు కూడా వీలుంటుంది.

ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహాన్ని బ్లాక్ గ్రనైట్ర్ రాయితో చేశారు. ఈ రాయిని తమిళనాడులోని  నమక్కల్ గనుల నుంచి సేకరించారు. విగ్రహాన్ని తిరుపతి తిరుపతి దేవస్థానం శిల్పుల పర్యవేక్షణలో రూపొందించారు. ఈ ఆలయం నిర్మాణానికి అంటే ప్రధానాలయం, మహారాజ గోపురం, ప్రాంగణంలోని మహాగణపతి ఆలయానికి మొత్తం  రు.28 కోట్లు ఖర్చయ్యాయి.

ఉదయం 5 నుంచి రాత్రి 8 దాకా భక్తులు ఆలయం సందర్శించవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి  నాలుగు దాకా విరామం ఉంటుంది.

2019  మార్చి13 ఆలయ ప్రారంభం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈకార్యక్రమానికి వచ్చారు.ఉదయం 6 నుంచి 7.30 దాకా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం మీన లగ్నంలో మహాకుంభాభిషేకం జరిగింది. కుంభాభిషేకం తర్వాత పవిత్రజలాలను ఆలయం నాలుగు దిశల్లో చల్లారు. ఆలయ ప్రారంభానికి అంకురార్పన  మార్చి 8 వ తేదీనే జరిగింది.

సాయంత్రం వైభ‌వంగా శ్రీ‌నివాస క‌ల్యాణం జ‌రిగింది. ఆల‌యంలో ఉద‌యం మహాకుంభాభిషేకం అనంత‌రం సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భక్తులకు స‌ర్వ‌దర్శనం క‌ల్పించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వ‌హించారు. శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని వీక్షించిన భ‌క్తులు భ‌క్తిసాగ‌రంలో మునిగితేలారు. భ‌క్తుల గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప‌రిస‌రాలు మారుమోగాయి.

శ్రీ‌నివాస క‌ల్యాణంలో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురారోప‌ణ‌, ర‌క్షాబంధ‌నం – కంక‌ణ‌ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, మ‌ధుప‌ర్కం, మ‌హాసంక‌ల్పం – గోత్ర‌నామాలు చెప్పుకోవ‌డం, క‌న్యాదానం, మాంగ‌ళ్య‌ధార‌ణ‌, హోమాలు, పూల‌మాల‌లు మార్చుకోవ‌డం, అక్ష‌తారోప‌ణం, నీరాజనం ఘ‌ట్టాల‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆయా ఘ‌ట్టాల‌కు అనుగుణంగా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా ఆల‌పించారు.

ఏకాంతంగా ఉత్సవాలు

ఆలయం ప్రారంభమయినప్పటి నుంచి కోవిడ్ సమస్య తలెత్తడంతో కార్యక్రమాలకు ప్రజలు హాజరుకాలేకపోతున్నారు. కార్యక్రమాలు ఏకాంతంగా సాగే సాగుతున్నాయి. ఇదే విధంగా ఇపుడు  పవిత్రోత్సవాలు కూడా ఏకంతంగానే నిర్వహిస్తున్నారు.

అక్టోబరు 30వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగిన దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. నవంబరు 1వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *