ఫోటో వెనక కథ… జపాన్ ఆక్రమణలో ఇండియా భూభాగం

చాలా మందికి తెలియని తెలియని విషయమిది. ఈ ఫోటో భారత  స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక ఆసక్తికరమయిన ఘట్టానికి సంబంధించింది. ఫోటోలో నేతాజీ సుబాష్ చంద్రబోస్  ఉన్నారు. ఆయన ఏదో ఒక భవనం నుంచి బయటకు వస్తున్నారు. పక్కన గోడ మీద జపనీస్ అక్షరాలున్నాయి. ఇదేమయి ఉంటుంది? ఈ ఫోటో ఆయన అండమాన్స్ పోర్ట్ బ్లయర్ లోని  సెల్యూలార్ జైయిల్ (Kala Pani) నుంచి 1943 డిసెంబర్ 30న  బయటకు వస్తున్నప్పటిది. అపుడు అండమాన్స్  జపాన్ అధిపత్యంలో ఉంది. జపనీస్ అక్షరాలు దీనికి సాక్ష్యం.ఈ  ఫోటో వెనక ఉన్న అబ్బురపరిచే చారిత్రక సత్యాలివే.
భారత భూభాగంలోని  కొద్ది ప్రాంతం కొన్ని రోజులు జపాన్ పాలనలో ఉండింది.   రెండో ప్రపంచయుద్ధ కాలంలో జరిగిన దురాక్రమణ ఇది. 1942లో రంగూన్ ను అక్రమించుకున్న తర్వాత భారత్ మీద జపాన్ కన్నేసింది. అపుడు భారత్ బ్రిటిష్ ఏలుబడిలో ఉంది. రంగూన్ నుంచి జపాన్ సేనలు అండమాన్స్ కు వచ్చాయి. బ్రిటిష్ ఇండియాలో భూభాగమయినా,  మెయిన్ ల్యాండ్ కు దూరంగా ఉన్న అండమాన్, నికోబార్  దీవులను అక్రమించుకోవాలని జపాన్ చాలా కాలంగా చూస్తూ ఉంది. అది చివరకు  1942 మార్చి 23న నెరవేరింది. ఆ రోజు సునాయాసంగా ఈ దీవులు  జపాన్ అక్రమణలోకి వెళ్లిపోయాయి.  1945 అక్టోబర్ 9 దాకా అండమాన్ నికోబార్ ప్రాంతం జపాన్ అధిపత్యంలో ఉండింది.హిరోషిమా, నాగసాకిల మీద ఆటంబాంబులు పడ్డాక, జపాన్ లొంగిపోయింది. ఇందులో భాగంగా అండమాన్స్ లో కూడా  జపాన్   లొంగిపోయింది. ఈ దీవులను బ్రిటిష్ ఇండియాకు సరెండర్ చేసింది.

 

అండమాన్స్ లోకి చొరబడుతున్న జపాన్ సైనికులు credit: wikimedia commons
బ్రిటిష్ ఇండియాని ఆక్రమించుకోవాలని జపాన్ చాలా కిందటే ప్లాన్ వేసింది.  అండమాన్స్ ని అక్రమించుకున్నాక, బర్మానుంచి ఈశాన్య భారత్ లోని మణిపూర్ లోకూడా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. మణిపూర్ పరిసరాల్లోకి  జపాన్ సేనలు చొరబడ్డాయి. నాటి బ్రిటిష్ ఇండియా సేనలు ఇంపాల్ పట్టణం వద్ద  దీనిని తీవ్రంగా ప్రతిఘటించాయి. దీనికే ఇంపాల్ యుద్ధం (Imphal battle) అని పేరు. మొత్తానికి, భారతసేనలు వీరోచితంగా పోరాడి అక్కడి నుంచి జపాన్ సేనలను తరిమేయగలిగారు. అయితే, అండమాన్స్ లో ఇలా ప్రతిఘటన ఎదురుకాలేదు. దీవుల్లో ఉన్న బ్రిటిష్ సైనికులు  ఎలాంటి ఎదురుదాడి జరపకుండా జపాన్ సేనలకు లొంగిపోయారు.
లొంగిపోయిన ఆ కొద్ది మంది భారతీయ సైనికులను సుబాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లోకి రిక్రూట్ చేస్తుకున్నారు.  ఆరోజుల్లో బ్రిటిష్ వారి మీద కోపంతో నేతాజీ జర్మనీ, జపాన్ కు మద్దతు ప్రకటించారు.ఈ స్నహం తో  అండమాన్ దీవులను జపాన్ బోస్ కు అప్పగించింది. అలా అక్కడ ఐఎన్ ఎ అధిపత్యం మొదలయింది. అయితే, ఇది స్వతంత్రం కాలేదు. బోస్ చేతికి దీవుల పాలన వచ్చినా, అది జపాన్ లో అంతర్భాగంగానే ఉండింది. జపాన్ సేనలు ఆ దీవుల్లో జరిపిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు.  జపాన్ అక్రమణలో ఉన్నపుడు అండమాన్ ప్రజలు పడిన బాధలను  జయంత్ దాస్ గుప్తా  Japanese in Andaman & Nicobar Islands: Res  Sun Over Black Water  అనే పుస్తకంలో చాలా  వివరంగా రాశారు. బ్రిటిష్ ఇండియాకు గూఢచారులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలో అనేక మందికి మరణ శిక్ష విధించారు. అనేక మంది మహిళలను లైంగికంగా వేధించారు. చాలా మందిని నిర్బంధ కూలీగా మార్చుకున్నారని దాస్ గుప్తా రాశారు.
1945లో లొంగిపోతున్నట్లు ఒప్పందం మీద సంతకం చేస్తున్న జపాన్ సైనికాధికారులు credit: wikimedia commons
జపాన్ తనకు ఇచ్చిన ఈ దీవులను తీసుకునేందుకు  1943 డిసెంబర్ లో నేతాజీ సుబాష్ చంద్రబోస్ రాజధాని పోర్ట్  బ్లయర్ కు వచ్చారు. ఆయన వచ్చాక అండమాన్స్ పేరు షహీద్ ద్వీప్ (Shaheed Dweep)గా మార్చారు. నికోబార్ ను స్వరాజ్ ద్వీప్ (Swaraj Dweep)నామకరణం చేశారు.  అయితే, స్థానికుల్లో జపాన్ మీద బాగా ద్వేషం పెరిగింది. జపాన్ సైనికుల హింసలను భరించలేక తాము నానా అగచాట్లు పడుతుంటే నేతాజీ లాంటి వ్యక్తి వాళ్లతో చేతులుకలపడం ప్రజలకు నచ్చలేదు. జపాన్ అకృత్యాలను వ్యతిరేకించిన వందలాది మందిని వేరే దీవికి తరలించి అక్కడ సేద్యం చేయమని చెప్పేవారు.  అండమాన్స్ జపాన్ ఆదీనంలోకి వచ్చాక ఆకలి పర్వం మొదలయింది. జపాన్ అక్రమణలో ఉన్నపుడు సుమారు 2000 మంది భారతీయులు అండమాన్స్ లో హతమయినట్లు ఆధారాలున్నాయి. ఇంత జరుగుతున్నపుడు గతం మర్చిపోవాలని బోస్ హితవు చేయడంతో, అక్కడి ప్రజల్లో ఆయన మీద కూడా ఆగ్రహం పెరిగిందని చరిత్రకారులు చెబుతారు.
అయితే, జపాన్ అక్రమణ కారణంగా బ్రిటిష్ నుంచి మొదట విముక్తి అయింది అండమాన్స్. ఇది తాత్కాలికమే అయినా, నేతాజీని బాగా ఉత్తేజ పరిచింది. జపాన్ నుంచి అది తన చేతికి రాగానే ఆయన మొదటి చేసిన పని అక్కడి సెల్యూలార్ జైలులో ఉన్న ఖైదీలందరిని విడుదల చేశారు.
జపాన్ నుంచి అండమాన్స్ విముక్తి ఫ్రాన్స్ లోని  బాస్టీల్ (Bastille) కోటతో పోలుస్తూ అది ఇండియాన్ బాస్టీల్ (Indian Bastille) అని ఆవేశపడ్డారు. ఫ్రెంచి విప్లవ సమయం (1789)లో మొదట  తిరుగుబాటు దారులు వశపర్చుకున్నది  పారిస్ సమీపాన ఉన్న బాస్టీల్ కోటనే (జూలై 14 1789), తర్వాత విప్లవం ఫ్రాన్స్ మొత్తం దావానలంగా వ్యాపించింది. అండమాన్  ‘విముక్తి’తో  భారత దేశమంతా ఇంక బ్రిటిష్ నుంచి విముక్తి అవుతుందని నేతాజీ కలకన్నారు.
“Like the fort of  Bastille in Paris which was liberated first during the French Revolution setting free political Prisoners, the Andamans, where Indian prisoners suffered, is the first to be liberated in India’s fight for Independence,” అని నేతాజీ   1943 నవంబర్ 8న ఒక ప్రకటన విడుదల చేశారు.
అండమాన్ పోర్ట్ బ్లయర్ సెల్యులార్ జెయిల్ ను సందర్శించి బయటకు వస్తున్నప్పటి ఫోటో.  అక్కడి గోడ మీద జపనీస్ భాష లో రాసిన బోర్డు అక్కడ కొనసాగుతున్న జపాన్ అధిపత్యానికి సాక్ష్యం.  అపుడు విడుదలయి ఖైదీలలో పంజాబ్ చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.  ఈ మధ్య పంజాబ్ అసెంబ్లీలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ జైలులో పంజాబీలు కూడా కష్టాలు పడ్డారని గుర్తుచేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. కేంద్ర పాలిత ప్రాంత అధికారులు జైలు వద్ద ఏర్పాటుచేస్తున్న లైట్ అండ్ సౌండ్ కార్యక్రమంలో పంజాబ్ ఖైదీల ప్రస్తావనే లేదని వారు పేర్కొన్నారు.  పంజాబ్ త్యాగాలకు గుర్తింపుగా  ఇక్కడి క్యాంప్ బెల్ బే దీవికి పంజాబ్ తాపు (Punjabi Tapu)అని పేరు పెట్టాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *