KRMB: ప్రాజెక్టుల అప్పగింతలో తొందరపాటు

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల మధ్య కృష్ణ నీటి వినియోగం , ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బోర్డు పరిధిలోకి గోదావరి , కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను తీసుకురావాలని కోరుకోవడం మంచి నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు తమకు వర్తించవని ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో సహజన్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ జీఓ విడుదల చేయడం , KRMB ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మినహా మరో మార్గం లేదు. అదే సమయంలో KRMB విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో అనుమతి లేని ప్రాజెక్టులలో విభజన చట్టంలో పేర్కొన్న గాలేరు నగరి , హంద్రీనీవా , తెలుగుగంగ , వెలిగొండ ప్రాజెక్టులను , ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ముచ్చిమర్రి , సిద్దాపురం , గురురాఘవేంద్ర ప్రాజెక్టులను వివాదం లేని ప్రకాశం బ్యారేజీని కూడా చేర్చడం అభ్యంతరకరం. ప్రత్యేకంగా రాయలసీమ , ప్రకాశం జిల్లాలకు నష్టం. ఎగువ భాగాన నీటి కేటాయింపు లేని నెట్టంపాడుకు లిప్ట్ చేసే జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం.
తెలంగాణ ప్రభుత్వం కూడా వారి అభ్యంతరాలు వారు చెప్పారు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా బోర్డు ముందుకు వెళుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు తమ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులను అప్పగిస్తూ తెలంగాణ అప్పగిస్తే అన్న షరతులతో జీఓ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డుకు అప్పగిస్తే అన్న షరతులతో కూడిన జీఓ విడుదల చేసింది. కానీ ఆ షరతు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పరిమితం కావడం సరికాదు. వివాదం లేని ప్రకాశం బ్యారేజీ , విభజన చట్టంలో పేర్కొన్న గాలేరు నగరి , హంద్రీనీవా , వెలిగొండ , తెలుగుగంగ , ప్రాజెక్టులకు కొత్తగా అనుమతులు తీసుకోవాలంటే చాలా కష్టం. బోర్డు పరిధిలోకి వెళ్లిన తర్వాత రాయలసీమకు నీటి విడుదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి చేసుకున్న సిద్దాపురం , ముచ్చిమర్రి , గురురాఘవేంద్ర ప్రాజెక్టుల విషయంలో KRMB గెజిట్ లో ప్రస్తావించినట్లు అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనడాన్ని ఉపసంహరణ చేసుకోకుండా , రాయలసీమ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం కనుక బోర్డు తమ నిర్ణయాన్ని సడలించు కోకుండా ప్రాజెక్టులను అప్పగించే విషయంలో తొందరపడకూడదు.
జూరాల విషయంలో వెనకడుగు వేయకూడదు
జూరాల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువభాగన తెలంగాణలో జూరాల ఉన్నది. భీమా , కోయల్ సాగర్ లాంటి నీటి కేటాయింపు ఉన్న ప్రాజెక్టులతో బాటు 30 TMC ల సామర్థ్యంతో నీటి కేటాయింపు లేని నెట్టంపాడుకు కూడా జూరాల నుంచే లిప్ట్ చేస్తారు. వరదలు భారీగా ఉన్నప్పుడు పెద్ద సమస్య ఉండకపోవచ్చు కానీ పరిమిత స్థాయిలో వరద ఉన్నప్పుడు ముందుగానే తెలంగాణ ప్రభుత్వం లిప్ట్ చేస్తే శ్రీశైలంపై ప్రభావం ఉంటుంది. నెట్టంపాడుకు మిగులు , వరద జలాలను మాత్రమే వినియోగించే వెసులుబాటు ఉన్నది. శ్రీశైలం , సాగర్ , ప్రకాశం బ్యారేజీ పూర్తి అయిన తర్వాత జూరాల నుంచి లిప్ట్ చేసుకోవాలి. అలాంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ అజమాయిషీ క్రీంద ఉంటే నిబంధనలు పాటించడం సాధ్యమా ? ఎందుకంటే ఏపీ అధికారులు కూడా ఉన్న శ్రీశైలం , సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది ! తెలుసుకున్న తర్వాత జూరాల నుంచి నీటి కేటాయింపు లేని నెట్టంపాడుకు నిబంధనలు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని లిప్ట్ చేస్తుంది అని ఎలా విశ్వసించేది. అందుకే జూరాలను బోర్డు పరిధిలోకి తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం తమ పరిధిలోని ప్రాజెక్టులను KRMB కి అప్పగించే విషయంలో తొందరపడకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *