ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అదే విధంగా పెన్షనర్లకు పెన్షన్లు కూడా చెల్లించలేని గడ్డుకాలం వచ్చింది. దీంతో ఉద్యోగులు నానా ఆగచాట్లుపడుతున్నారు.
అంతేకాదు, పదవీ విరమణ చేసిన వారికి చేయబోతున్న వారికి రావలసిన ఆర్థిక పరమైన సౌకర్యాలు పెన్షన్లు, Gratuity, GPF, APGLI Claims, APGLI Loans విడుదల కావడం లేదు. మరీ అన్యాయంగా వైద్య ఖర్చులు, దహన సంస్కారాల ఖర్చులు (మట్టి ఖర్చులు) కూడా ఒక సంవత్సర కాలంగా రావడంలేదు.
ఈ పరిస్థితి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికొక పరిష్కారం కనుగొనక పోతే, ఆందోళన తప్పదని స్పష్టం చేశారు.
పెండింగులో ఉన్న ఈ సమస్యల మీద ఈ రోజు AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి చర్చించారు.
ఎంతోకాలంగా ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని దానివలన ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఏర్పడుతున్నదని వారు ప్రధాన కార్యదర్శికి తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు
1. ప్రతినెల ఒకటవ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించలేని ఆర్థికశాఖ తీరును తీవ్రంగా గర్హిస్తున్నాము. ముఖ్యంగా పెన్షన్లు సకాలంలో రాక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వివిధ శాఖల్లో మరియు పోలీసుల శాఖతో సహా, సరెండర్ Leave Encashment డబ్బులతో పాటు, పదవీ విరమణ చేసిన మరియు చేయబోతున్న వారికి రావలసిన ఆర్థిక పరమైన సౌకర్యాలు అనగా పెన్షన్లు, Gratuity, GPF, APGLI Claims, APGLI Loans, వైద్య ఖర్చులు, దహన సంస్కారాలు ఖర్చులు (మట్టి ఖర్చులు) కూడా ఒక సంవత్సర కాలంగా రాక, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని వెంటనే చెల్లించాలి.
దశాబ్దాలుగా నెలనెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేవి. కాని ఇపుడు రావడం లేదు. ప్రతి నెల మొదట తేదీనే విధిగా జీతాలు, పెన్షన్లు చెల్లించే విధంగా ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికి ఆదేశాలు ఇవ్వాలి. అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
2. పి.ఆర్.సి కమిషన్ నివేదిక ఇచ్చి చాలాకాలం అయినందున ఈ సంవత్సరం దసరా లోపు 11వ పిఆర్సిని ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించాలి.
3. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రీతిగా సి.పి.ఎస్ ను రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
4. అలాగే 01-07-2018 నుండి పెండింగ్ లో ఉన్న డి.ఏ లలో రెండు డి.ఏలు అనగా 01-07-2018 మరియు 01-01-2019 డి.ఏ లను, 01-07-2018 నుండి 01-07-2021 వరకు ఇవ్వవలసిన మిగిలిన ఐదు డి.ఏ లను 31-12-2021 లోగా ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్లకు చెల్లించాలి.
5. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపాభుయీష్టమైన సి.ఎఫ్.ఎం.ఎస్(CFMS) విధానాన్ని రద్దు చేయాలి..
6. జిల్లా సెలెక్ట్ కమిటీల ద్వారా ROR ప్రకారం ఎంపిక కాబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని అలాగే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి.
7. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని, నెట్ వర్క్ ఆస్పత్రులను ప్రభుత్వం సరిగా నియంత్రించటం లేకపోవడం వలన ఉద్యోగులు అధిక మొత్తాలు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. రీయంబర్స్మెంట్ ద్వారా తక్కువ మొత్తాన్ని పొందుతున్నారు. కావున ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను రద్దుపరచి, ప్రభుత్వం ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రభుత్వ అజమాయిషీతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలు(Cashless Treatment) కల్పించాలి.
8. ప్రస్తుత ధరవరలను బట్టి కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వెంటనే పెంచాలి.
9. కొన్ని ప్రభుత్వ శాఖలలో గల కార్యదర్శులు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మరియు పురపాలక శాఖ మొదలగు శాఖలలో శాఖపరమైన పదోన్నతులు కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దాని వలన సంవత్సరాల తరబడి పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయని, కావున వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలి.
10. కోవిడ్ వలన మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలి. అంతేకాక, ప్రభుత్వ సంక్షేమ పథకాలుకరోనా కష్ట కాలంలో కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు – నిర్లక్ష్యం చూపిస్తుందనే భావన ప్రతీ ఉద్యోగులలోనూ నెలకొందని, తమ న్యాయ పరమైన చిన్న చిన్న కోర్కెలను కూడా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా పరిష్కరించడం లేదనే భావన ఉద్యోగ వర్గాలలో నెలకొందని దీనిని పారద్రోలాలి.
మా సమస్యలు పరిష్కారం కానియెడల దశల వారీగా పోరాటాలు చేయడానికి రెండు జే.ఏ.సి లు సిద్దం… అని ఉద్యోగులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసిన వారిలో
బండి శ్రీనివాసరావు, చైర్మన్, AP JAC, బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, AP JAC అమరావతి, . G. హృదయ రాజు, సెక్రెటరీ జనరల్, AP JAC, వైవీ రావు, సెక్రెటరీ జనరల్, AP JAC అమరావతి లతో పాటు AP Ngo’s రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K.V. శివారెడ్డి, AP JAC అమరావతి రాష్ట్ర కోశాధికారి వి వి మురళీకృష్ణ నాయుడు, రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి ఈశ్వర్, APRSA రాష్ట్ర ఉపాధ్యక్షులు R V రాజేష్ , రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జయబాబు, శ్రీ రంగారావు, AP Ngos రాష్ట్ర కార్యదర్శి తదితరులు ఉన్నారు.
అంతకు ముందు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరు JAC ల నాయకత్వం కలిసి ఈ క్రింది సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, AP JAC& AP JAC అమరావతి ఐక్య వేదిక ద్వారా మొదటి మెమొరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో రెండు, మూడు దఫాలుగా చర్చించారని, అవన్నీ చివరి దశలో ఉన్నాయని, ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యలపై సానుకూలంగా నిర్ణయం ప్రకటించేవిధంగా చేస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.