‘ఖజానా వెల వెల, జగన్ రెడ్డి & కం కళకళ’

ప్రజలు, ప్రభుత్వ ఖజనా వెలవెలబోతుంటే జగన్ రెడ్డి బృందం వేల కోట్లతో ఎలా కళకళలాడుతోందని తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ పేర్కొంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి ఈ కమిటీ కింది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఇప్పటికే ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, పెద్దఎత్తున అప్పులు చేస్తూ.. ఆ డబ్బుతో అవినీతి,  దుబారాకు పాల్పడుతున్నారని పార్టీ విమర్శించింది. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని స్ట్రాటజీ కమిటీ డిమాండ్ చేసింది.

చంద్రబాబునాయుడు సమావేశం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది.

సమావేశం తీసుకున్న నిర్ణయాలు:

 

1. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇప్పటివరకు ఆరు సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాటతప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. మరోవైపు అనధికార కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2014కు ముందు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటులో ఉన్న రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేసి 10వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిని సాధించడం జరిగింది. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చాం. జగన్ రెడ్డి అంతా నాశనం చేశారు. బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని కనెక్షన్ కట్ చేస్తున్నారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారు. తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని సమావేశం ప్రశ్నించింది. 2014లో చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం 3 నెలల్లోనే కరెంట్ కోతలు నివారించారు. మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి జగన్ రెడ్డి చేతుల్లో పెట్టారు. నేడు జగన్మోహన్ రెడ్డి అప్రకటితంగా 2,3 గంటలు కరెంట్ కోతలు పెడుతున్నారు. తమ కమీషన్ల కక్కుర్తితో, అసమర్థతతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించారు.

2. హౌస్ సైట్స్ విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారు. గృహ నిర్మాణ పునాదిపైన కేంద్రం రూ.3,700 కోట్లు విడుదల చేసింది. దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారు. దారిమళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీనే కోర్టులో కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. వారు కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారు. సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారు. రెండు సెంట్లు నగరాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి. రాష్ట్ర నిధుల నుంచి మరో రూ.2 లక్షలు గృహనిర్మాణానికి విడుదల చేయాలని, దారిమళ్లించిన నిధులు కూడా వెంటనే జమ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.

3. ఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా పెట్టారు. తెలుగుదేశం 98 లక్షల మందికి సమానంగా లబ్ధి చేకూర్చగా జగన్ రెడ్డి ప్రభుత్వం 78 లక్షల మందికి కుదించారు. 20 లక్షల మందికి ఎగనామం పెట్టారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తక్కువ ఇచ్చారు. సెప్టెంబర్ లో చెల్లించాల్సిన నగదును వాయిదాల మీద వాయిదాలు వేశారు. టీడీపీ హయాంలో రూ.21 వేల కోట్లు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమచేయడం జరిగింది. ఇప్పటికి జగన్ రెడ్డి ఇచ్చింది రూ.10వేల కోట్లు కూడా లేదు. డ్వాక్రా మహిళల పొదుపు నిధిని కాజేసేందుకు కుట్ర పన్నారు. డ్వాక్రా మహిళలకు రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు.

4. డ్రగ్స్ కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గంగిరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆషి ట్రేడింగ్ కంపెనీతో వేలకోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాకు శ్రీకారం చుట్టారు. ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె యొక్క నిక్ నేమ్ కాదా? ఆలీషా పెద్ద మనిషి అని చంద్రశేఖర్ రెడ్డి కితాబు ఎందుకు ఇచ్చారు? వారి అక్రమ వ్యాపారానికి ఇది నిదర్శనం కాదా? హవాలా, మనీలాండరింగ్ ద్వారా పెద్దఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గంజాయి, హెరాయన్, ఎర్రచందనం, తలనీలాలకు, స్మగ్లర్లకు పెద్దపీట వేయడమే జగన్ రెడ్డి విధానంగా ఉంది. దేశంలో ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్స్ ఏపీలోనే ఎందుకు ఉన్నాయి? మొన్న అయోధ్యరామిరెడ్డి కంపెనీల్లోనూ, నిన్న హెటిరో పార్థసారథిరెడ్డి సంస్థల్లో రూ.500 కోట్ల అక్రమాలను ఐటీ గుర్తించింది. వీరందరూ జగన్ రెడ్డి కేసుల్లో సహ నిందుతులు కాదా? ప్రజలు, ప్రభుత్వ ఖజనా వెలవెలబోతుంటే జగన్ రెడ్డి బృందం వేల కోట్లతో ఎలా కళకళలాడుతోంది?

5. ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో న్యాయస్థానం తీర్పుతోనైనా జగన్ రెడ్డి తీరు మారాలి. నీరు-చెట్టు, ఎస్డీఎఫ్ పనులు, సర్వశిక్షా అభియాన్, అంగన్ వాడీ, గోకులం, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనుల బిల్లుల విషయంలోనూ పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్స్ ను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటికే రూ.6 లక్షల కోట్లు అప్పులు చేశారు. పెద్దఎత్తున అప్పులు చేస్తూ.. ఆ డబ్బుతో అవినీతి, దుబారాకు పాల్పడుతున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

6. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ రెడ్డి వారికి తీరని ద్రోహం చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామనే హామీ ఏమైంది? జీతాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి. పెన్షన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ, డీఏలు చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అమూల్ కు పాలుపోయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు. రాష్ట్ర సహకార డైయిరీలను కాదని గుజరాత్ కు చెందిన అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.

7. సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య మళ్లీ చిచ్చుపెట్టేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. ఫేక్ ఐడీలతో దుష్ర్పచారం చేస్తూ రాజకీయ లబ్ధికి యత్నిస్తుండటాన్ని నేతలు ఖండించారు. వైసీపీ నేతల అవినీతిని, ప్రజా సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికి వైసీపీ కుల, మత, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే హీనస్థితికి దిగజార్చారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ.కె అచ్చెన్నాయుడు, శ్రీ నారా లోకేష్, శ్రీ నిమ్మల రామానాయుడు, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీ వర్ల రామయ్య, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, శ్రీ కాలవ శ్రీనివాసులు, శ్రీ కేఎస్ జవహర్, శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి, శ్రీ పట్టాభిరాం, శ్రీ టీడీ జనార్థన్, శ్రీ బీద రవిచంద్ర యాదవ్, శ్రీ పి.అశోక్ బాబు, శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి, శ్రీ మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *