తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీవేంకటేశ్వరుడు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ అభయమిచ్చారు.
శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో ఈ వాహన సేవను నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి కర్పూర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మాయా జగత్తు నుంచి బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం అని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవాల్లో ప్రధాన వాహన సేవ అయిన గరుడ సేవను ఈ రోజు రాత్రి ఏడు గంటల నుంచి నిర్వహించనున్నారు.
సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించి.. గరుడ సేవలో పాల్గొంటారు.