తిరుమల బ్రహ్మోత్సవాలు: ఈ రోజు శ్రీవారికి సేవ ఎలా జరిగిందంటే ?

ప తిరుమల, 2021 అక్టోబ‌రు 10

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో పచ్చకర్పూరం, లవంగాలు, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తామర మరియు తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాల‌ల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌లు, కిరీటాల‌తో స్న‌ప‌న తిరుమంజ‌నం వైభవంగా జ‌రిగింది.

రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ వాసుదేవ భ‌ట్టాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌ను అనుగ్రహించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చ‌క‌స్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శోభాయమానంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

తిరుపూర్ కు చెందిన దాత శ్రీ రాజేందర్ స‌హ‌కారంతో స్వామి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక మాల‌లు, కిరీటాలు ఏర్పాటు చేశామని టిటిడి ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *