ప్రొద్దుటూరు రాజకీయాలలో సంచలనమైన డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి తెలుగు అక్షరానికి పదును పెట్టారని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్ అన్నారు.
అనారోగ్యంతో కర్నూలు ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ గత నెల 30 వతేదీ బుధవారం ఉదయం మృతి చెందిన రమణారెడ్డి సంస్మరణ సభ తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో శనివారం జరిగింది.
విద్యాపరిరక్షణ సంస్థ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ సం యు క్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో భూమన్ ముఖ్య వక్తగా ప్రసంగించారు.
పదుల సార్లు తిరుపతి వచ్చిన రమణారెడ్డి ఒక్క సారి కూడా తిరుమల కొండెక్కని అచ్చమైన నాస్తికుడని, అలాంటి రమణారెడ్డి మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా జరగడం బాధాకరమని భూమన్ వ్యాఖ్యానించారు.
ఒక వైపు హత్యలు, మరొక వైపు ర చనలు రమణారెడ్డికి ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రమణారెడ్డి తిరుపతిలో తమ ఇంటికి వచ్చినప్పుడు రెనెన్ మార్టిన్ గ్రామర్ లాంటిది తెలుగు లో రాయాలని అంటే, అంత తేలికా అనుకున్నానని, ఆయన అన్నట్టుగానే తెలుగింటి వ్యాకరణం రాశారని గుర్తుచేశారు.
రమణారెడ్డి సాహిత్యం, రచనలు ఒక ఎత్తైతే, ఉద్యమాలతో ఆయన వ్యవహరించిన తీరు మరొక ఎత్తని, సమావేశాలలో ఎవరు ఎన్ని రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా తన మాటే చివరి మాటగా చెలామణి అయ్యేలా వ్యవహరించారని, అదే ఆయనను దెబ్బతీసిందని అన్నారు. కొందరికి ఇష్టుడు, మరొకొందరికి అయిష్టుడని, కొందరికి కావలసిన వాడైతే, మరికొందరకి అవసరం లేని వాడయ్యాడని గుర్తు చేస్తూ, ఇన్ని పుస్తకాలు రాసినా నీ కుటుంబంతో, సమాజంతో నీవు ఎలా వ్యవహరించావన్నది ముఖ్యమని పేర్కొన్నారు.
రమణారెడ్డిలో ఎన్ని విషయాలు ఎలా ఉన్నా ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు ఆయనకున్న బలమైన వాంఛ అని స్పష్టం చేశారు.
సభలో ప్రముఖ రచయిత మదురాంతకం నరేంద్ర మట్లాడుతూ, రమణారెడ్డిలో ఉన్న భిన్న ప్రవృత్తులు మరొకరిలో చూడలేదని,ఆయనది విలక్షణ వ్యక్తిత్వం అని, ఆయన అభిరుచి కూడా భిన్నంగా ఉంటుందని అన్నారు.
రమణారెడ్డి రాసింది చాలా తక్కువ కథలైనా, ఒక గాంధేయ వాది రాయవలసిన ‘ రెక్కమాను’ వంటి కథ ఆయన రాయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
రమణారెడ్డి ఏ పని ఎందుకు, ఎప్పుడు చేస్తారో తెలియదని, ఆయనకు ఇష్టమైనవే రాశారని, అనువాదం చేశారని పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ, రమణారెడ్డిలో అనేక మంది రమణారెడ్లు ఉన్నారని, రచయితగా, అనువాదకుడిగా, ఫ్యాక్షన్ రాజకీయాలలో, అధికార రాజకీయాలలో మునిగిన తేలిన రాజకీయ నాయకుడిగా, డాక్టరుగా , న్యాయవాదిగా, కార్మికనాయకుడిగా రమణారెడ్డిలో ఇన్ని కోణాలుండడం ఆశ్చర్య మని పేర్కొన్నారు.
రమణారెడ్డి రాసిన ‘రాయలసీమ కన్నీటి గాథ’ రాయలసీమ ఉద్యమానికి ప్రణాళిక లాంటిదని, సీమ హక్కుల పత్రమని, అది చిన్న పుస్తకమే అయినా చాలా మందికి స్ఫూర్తి కలిగించిందని అన్నారు.
రాయలసీమ మేధావుల సంఘం నాయకుడు పురుషోత్తం మాట్లాడుతూ రమణారెడ్డి తన దృష్టిలో ఒక విశ్వవిద్యాలయం అని, ఒక గ్రంథాలయమని వ్యాఖ్యానించారు.
ఎకనామిక్స్ విభాగానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు ఆచార్య రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాపరిరక్షణ సమితి వ్యవస్థాపకులు వి. భాస్కర్, పలువురు పాల్గొన్నారు.