(మన్నె నర్సింహా రెడ్డి)
ఆంధ్రా పాలకులను తెలంగాణను దోచుకుంటున్న దొంగలుగా, దోపిడీదార్లుగా ముద్రవేసి వెళ్ళగొట్టిన మన తెలంగాణా దొరలు చేస్తున్నదేమిటి??
ఆంధ్రా పాలకులను భూకబ్జాదారులుగా చిత్రీకరించి తరిమివేసిన మన నయా తెలంగాణ దొరలలో గడీల వాసన ఇంకా పోలేదా??
ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాచకొండ ప్రాంత రైతుల గోస చూస్తే అలాగే అనిపిస్తుంది మనకు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరుపడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన ఈ తెలంగాణా ప్రాంతంలో “ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాంరా దేవుడా??” అని బాధపడేవారు ఉన్నారంటే మీలో ఎవరైనా నమ్ముతారా??
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాచకొండ ప్రాంత రైతులలో ఏ ఒక్కరిని కదిలించినా ఇలాంటి బాధనే వ్యక్తం చేస్తున్నారు అక్కడి గిరిజన రైతులు.
ఇక అసలు విషయం లోకి వెళ్తే…..
రాచకొండ ప్రాంతంలోని 85, 106, 192, 273 సర్వే నంబర్లలో దాదాపుగా 2000 ఎకరాల భూమి సుమారు1000 మంది గిరిజన రైతుల పేరుమీద అసైన్డ్ పట్టా భూమిగా నమోదు అయివున్నది.
ఈ 4 సర్వే నంబర్ల లోని 2000 ఎకరాల భూమిని అక్కడి గిరిజన రైతులు సుమారు 6౼7 తరాలుగా సాగుచేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు.
గతంలో ఖుష్కి (మెట్ట) భూమిగా ఉన్న ఈ 2000 ఎకరాల భూమిని అక్కడి రైతులు తమ భార్యల పుస్తెలు అమ్ముకొని, బోర్లు వేయించి, రాళ్ళు రప్పలు ఏరివేసి, భూమిని చదును చేసి తరి పొలంగా మార్చుకున్నారు. తమ రక్తాన్ని స్వేధంగా మలిచి, భూమిని తడిపి బంగారు పంటలు పండించుకొన్నారు.
గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ 2000 ఎకరాల భూమిని అసైన్మెంట్ భూమిగా గుర్తించింది. దానికి అనుగుణంగా అక్కడి 1000 మంది గిరిజన రైతుల యొక్క పాసు పుస్తకాలలో అసైన్డ్ భూమిగా నమోదు చేసి వారి వారి భూముల పైన భూ యాజమాన్య హక్కులను జారీ చేసింది.
ఇలా తమకు జారీ అయిన ఈ పట్టాదారు పాసు పుస్తకాలను ఉపయోగించుకుని అక్కడి రైతులు తమకు సమీప బ్యాంకులలో పంట రుణాలను తెచ్చుకున్నారు. ఈ పంట రుణాలకు సంబంధించి 2004 లో ఒకసారి, మళ్ళీ 2009 లో రెండవసారి డా. వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఋణమాఫీ పథకం కూడా వర్తించడం జరిగింది.
ఇక్కడి వరకు బాగానే ఉంది ఈ రైతుల బ్రతుకు!! ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందో అప్పటినుండే వీళ్ళకు దరిద్రం దాపురించింది పాలకుల రూపంలో!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017 లో చేపట్టిన భూ ప్రక్షాళన సందర్భంగా మన తెలంగాణా ప్రభుత్వం ఈ 2000 ఎకరాల అసైన్డ్ భూమిని రెవిన్యూ, అటవీ శాఖ లకు సంబంధించిన వివాదాస్పద భూమిగా గుర్తించింది. సర్వే చేస్తే తప్ప కొత్త ఆకుపచ్చ పాస్ బుక్కులు ఇవ్వలేమని ఆ 2000 ఎకరాల భూమిపై ఆధారపడ్డ 1000 మంది గిరిజన రైతుల నోట్లో మట్టికొట్టింది.
2017లో భూ ప్రక్షాళన తర్వాత యావత్ తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల వద్ద నుండి పాత పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకొని కొత్త ఆకుపచ్చ రంగు పాస్ పుస్తకాలను జారీ చేసింది. అయితే ఈ రాచకొండ ప్రాంత గిరిజన రైతులకు మాత్రం కొత్త గ్రీన్ పాస్ పుస్తకాలు అందక నిరాశే ఎదురైంది.
కొత్త ఆకుపచ్చ రంగు పాస్ పుస్తకాలు అందని కారణంగా ఈ రైతులందరూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు!!
గత 3 సంవత్సరాల కాలంలో ఈ రాచకొండ భూములున్న రైతులలో దాదాపు 25౼30 మంది రైతులు చనిపోగా…..కొత్త ఆకుపచ్చ పాస్ బుక్ లేకపోవడం వల్ల వారికి రైతు భీమా పథకం కింద ఆర్థిక సహాయం అందలేదు.
పథకాల లబ్ధి పొందలేకపోయినా సరే….కనీసం కష్టం చేసుకొనైనా బ్రతుకుదాము అని భావించి తమ పొలాల్లోకి వెళ్తే అటవీశాఖకు చెందిన క్రింది స్థాయి అధికారుల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ అడ్డుకొంటున్నారు. రైతులను వారి భూముల్లో అడుగు పెట్టనివ్వట్లేదు, దున్ననివ్వట్లేదు!!
అధికారులు తమను అడ్డుకున్నప్పుడు ఈ భూములు తమవని రైతులు వారి దగ్గర ఉన్నటువంటి గత ప్రభుత్వాలు జారీ చేసిన పాత పాస్ బుక్కులను చూపించగా…అవి చెల్లవనీ, వాటిని మీరు లంచం ఇచ్చి తయారు చేయించుకున్నారని నానా దుర్భాషలాడుతూ అటవీ అధికారులు రైతులను బెదిరించి గెంటివేస్తున్నారు.
తమ బెదిరింపులకు లొంగకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా గిరిజన రైతులు తమ తమ భూముల్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుండటంతో….అటవీ అధికారులు అక్కడి పోలీస్ అధికారులతో కుమ్మక్కై తమ మాటవినని రైతులపై అక్రమ కేసులు బనాయించి ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు.
తమ భూ హక్కుల కోసం అటవీశాఖ అధికారులతో అవిశ్రాంతంగా పోరాడుతున్న రైతులను పోలీసులు తీసుకెళ్ళి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లో రోజులకు రోజులు కూర్చోబెట్టి వదిలేస్తున్నారు.
తమ భూ హక్కుల కోసం తహసీల్దార్, RDO, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ పదే పదే చెప్పులు అరిగేలా తిరిగినా “ఓపిక పట్టండి” అని రెవెన్యూ శాఖ అధికారులు రైతులకు సర్దిచెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించి, అటవీ అధికారులతో మాట్లాడి రైతులకు తగిన న్యాయం చేకూర్చట్లేదు!!
చివరి ప్రయత్నంగా తమ గోసను తమ నియోజకవర్గమైన మునుగొడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన రాచకొండ రైతులకు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వీరి సమస్యపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తన గళాన్ని వినిపించి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం చూస్తుంటే రాచకొండ రైతుల సమస్యపై పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు!!
సెజ్ ల పేరుతో, పరిశ్రమల పేరుతో, సినిమా స్టూడియోల పేరుతో, స్పోర్ట్స్ అకాడమీల పేరుతో కార్పొరేట్ శక్తులకు, అస్మదీయులకు ఎర్ర తివాచీ పరిచి ప్రభుత్వ భూములను కారుచౌకగా అప్పగిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వం 6౼7 తరాలుగా కాయా కష్టం చేసుకొని బ్రతుకుతున్న రాచకొండ రైతుల భూములను ఎందుకు లాక్కొంటోంది??
ఇందుకేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది??
ఈ రాచకొండ రైతులకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన 2000 ఎకరాల భూమిని ఇప్పటి మన బంగారు తెలంగాణ ప్రభుత్వం హస్తగతం చేసుకోవాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటి??
రెక్కాడితే కానీ డొక్కాడని పేద, బడుగు, బలహీన వర్గాల రైతులను వారికి కేటాయించిన భూముల్లో నుంచి వెల్లగొట్టడానికేనా మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది??
10 మందికి అన్నం పెట్టడానికి ప్రకృతి వైపరీత్యాలతో నిత్యం పోరాడుతూ, ప్రతీ రోజూ చస్తూ బ్రతుకుతున్న ఈ అమాయక రైతులకు రైతుబంధు, రైతుభీమా లాంటి ప్రభుత్వ పథకాలు అందకుండా చేసి, వారి బ్రతుకులను బజారుపాలు చెయ్యడం కోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది??
బంగారు తెలంగాణ అంటే ఇదేనా?? అన్నదాతల జీవితాలను బుగ్గిపాలు చెయ్యడమేనా బంగారు తెలంగాణ అంటే! తరతరాలుగా సంక్రమించిన భూమి హక్కులను కాలరాయడమేనా బంగారు తెలంగాణ అంటే! ఎవ్వరి కోసం ఈ బంగారు తెలంగాణ? భూమిని దున్ని, తాను పస్తులుండి సమాజ ఆకలి తీర్చే బక్కచిక్కిన రైతన్న కోసమా??
లేక….
భూమిని గద్దలా తన్నుకుపోయే కార్పొరేట్ శక్తుల కోసమా??
మా డిమాండ్లు
*ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రాచకొండ ప్రాంతంలోని 85, 106, 192, 273 సర్వే నంబర్లలో గల 2000 ఎకరాల భూమిని దాని హక్కుదారులైన 1000 మంది గిరిజన రైతుల పేరుమీద తిరిగి పట్టాలివ్వాలి.
* ప్రతీ రైతుకు పాత పాస్ బుక్ స్థానంలో కొత్త ఆకుపచ్చ పాస్ బుక్ ఇవ్వాలి.
* తెలంగాణ లోని మిగతా రైతుల మాదిరిగా రాచకొండ భూ బాధిత రైతులకు రైతుబంధు, రైతుభీమా పథకాలను వర్తింపజేయాలి.
* తమ భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించిన రైతులపై అటవీ అధికారులు, పోలీస్ అధికారులు బనాయించిన అక్రమ కేసులను వెంటనే రద్దు చెయ్యాలి.
* ఈ రాచకొండ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భూ బాధితుల పక్షాన సంస్థాన్ నారాయణపూర్ లో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, వైసీపీ అఖిల పక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. TRS ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి రాచకొండ భూ బాధితులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో తాము రాచకొండ భూ బాధితుల తరపున పోరాడుతామని, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించాయి.(ఇందులో వ్యక్తం చేసి అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ట్రెండింగ్ తెలుగున్యూస్ వాటితో ఏకీభవించనవసరం లేదు)
(మన్నె నర్సింహా రెడ్డి, 93930 44448, ధరణి భూసమస్యల వేదిక)