ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, ఎందుకు జరుపుతారో తెలుసా?

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పరిష్కారంలో చట్టసభలకు బాధ్యత వహించవలసిన మంత్రివర్గాలు కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయేమో కానీ ఉపాధ్యాయులు ,సామాజిక పరిణామ క్రమం నేపథ్యంలో దేశ ప్రజలకు మాత్రం పూర్తి బాధ్యత వహించాలి. వహిస్తున్నారు కూడా!

ఈ దేశంలో పాలకులు, నాయకులు, పెట్టు బడిదారులు, పారిశ్రామికవేత్తలు చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు, ఉద్యోగులు అందరూ ప్రజలను కేంద్రంగా చేసుకుని తమ వ్యాపకాలను కొనసాగించి ప్రజల వినియోగం, కొనుగోలు ద్వారా వచ్చే లబ్దితో ఆర్జన అప్పుడప్పుడు అక్రమార్జన ద్వారా బ్రతుకుతున్న వారే.

ఈ విషయాన్ని ఆ వర్గాలు ఆమోదించిన, ఆమోదించక పోయినా ఉపాధ్యాయులు మాత్రం ప్రజల కష్టార్జితాన్ని తాము వేతన రూపంలో పొందుతున్నామని, ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతము ఆమోదించినవి. అంతేకాకుండా ఉపాధ్యాయ వర్గానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్న కారణంగా మిగతా వర్గాలకు భిన్నంగా నైతిక కట్టుబాటు కు ఉండవలసిన సంస్కారం ఉపాధ్యాయ వర్గం పై ఉన్నది.

ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవలసిన ఆవశ్యకత, ప్రాధాన్యత చర్చించవలసిన అవసరం ఉన్నది.

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం:-

ప్రజా జీవనానికి సంబంధించి అనేక అంశాల పైన జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు ను జరుపుకోవడం గత రెండు మూడు దశాబ్దాలుగా మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అంతర్జాతీయ విషయానికి వచ్చినప్పుడు అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి, ఆరోగ్య సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ ,యునెస్కో, యునిసెఫ్ వంటి సంస్థలు ఇటీవలికాలంలో కీలక బాధ్యతలు తీసుకోవడం వల్ల అది సాధ్యమవుతుంది.

అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ( యునెస్కో)1966 సంవత్సరంలో సెప్టెంబరు 21 నుండి 15 రోజులపాటు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉపాధ్యాయుల పరిస్థితులు, ప్రాధాన్యత, తదితర అంశాలపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి ,అంతర్జాతీయ కార్మిక సంస్థలతో పాటు అనేక ప్రభుత్వ ఇతర సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. విద్యారంగము, వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న పాత్ర దృష్ట్యా
ఉపాధ్యాయుల హోదా గౌరవాన్ని పెంచడానికి, హక్కులను, బాధ్యతలను నిర్వచించి కొన్ని నిర్ధిష్టమైన సిఫారసుల తోని అంతర్జాతీయ పత్రాన్ని ఆమోదించారు. “స్టేటస్ ఆఫ్ ది టీచర్స్” అనబడే ఈ పత్రాన్ని ఆమోదించిన అక్టోబర్ 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని, చేసిన సిఫారసుల అమలును సమీక్షించాలని నిర్ణయించింది.

1966 లో తీసుకున్న నిర్ణయం 1994వ సంవత్సరంలో కానీ అమలు కాలేదు. 1994 అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వరుసగా అంతర్జాతీయంగా నిర్వహించబడుతూ వస్తున్నది. ఐక్యరాజ్యసమితి, విద్యారంగ సమావేశాలలో దేశాల ప్రతినిధులు పాల్గొన్నప్పుడు ఆయా దేశాలలో అమలవుతున్న విద్యారంగము ఉపాధ్యాయుల స్థితిగతులపై చర్చలు జరుగుతున్నప్పటికీ ఇటీవల ప్రపంచంలో చాలా దేశాలతో పాటు భారత దేశంలో విద్య ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్న వేల విద్యారంగము ఉపాధ్యాయుల పరిస్థితి దినదినగండంగా మారుతున్నది.

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5వ తేదీ నాడు చాలా దేశాల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపు కుంటుండగా భారతదేశంలో మాత్రం రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం మీకందరికీ తెలిసిందే.

ఈ దినోత్సవాలు ఏ రకమైన ప్రభావాన్ని చూపుతున్నాయి

వాస్తవంగా ఈ దినోత్సవానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చర్చల నేపథ్యంలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విద్యారంగము, ఉపాధ్యాయుడు, సామాజిక స్థితిగతుల పైన నిరంతరం చర్చ జరగాలని సూచించినప్పటికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు తప్ప భారతదేశంలో అక్టోబర్ 5వ తేదీ నాడు పెద్దగా కార్యక్రమాలు జరిగిన పరిస్థితులు కనబడడం లేదు. ప్రభుత్వ స్థాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విద్యారంగ నిపుణులతో అధికారులతో సమీక్షించి ప్రగతిని ఎప్పటికప్పుడు మదింపు చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సమావేశాలు నిర్వహించుకొని ఉత్తమ ఉపాధ్యాయుల పేరున సత్కారాలను కొనసాగించడానికి మాత్రమే ఈ రోజులు పరిమితమవుతున్నాయి.

విద్యారంగము -ఉపాధ్యాయుడు:

విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను మేల్కొలిపి వ్యక్తిత్వ వికాసం నిర్మాణము చేసే క్రమంలో ఉపాధ్యాయునికి యంత్రాలు, టెక్నాలజీ,ఎవ్వరూ సాటిరారు. ఇటీవల కరోనా సందర్భంగా పాఠశాలలను కొనసాగించలేని పరిస్థితులలో విద్యార్థులు పాఠశాలకు రావడం ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వాలు ప్రభుత్వ ,ప్రైవేట్ రంగంలో ఆన్లైన్ బోధనకు అనుమతించింది. ఆన్లైన్ బోధన పై సమగ్ర సర్వే జరిపిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆన్లైన్ బోధన విద్యార్థులకు అవగతం కావడం లేదని, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల అయితే డబ్బు కోసమే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈనేపధ్యంలో ఇటీవల ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నవి. అంటే ఉపాధ్యాయుని మించి బోధన యంత్రాలు మాత్రమే సుసాధ్యం చేయలేవు అని తేలిపోయింది. ప్రశ్నోత్తర కార్యక్రమాలు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా తరగతి గది లోపల సమాజాన్ని మేళవించి బోధించే పరిస్థితులు ఆన్లైన్లో కనపడవు.


World Teachers’ Day is held annually on 5 October to celebrate all teachers around the globe.  It commemorates the anniversary of the adoption of the 1966 ILO/UNESCO Recommendation concerning the Status of Teachers. World Teachers’ Day has been celebrated since 1994.


అందుకే “దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని” కొటారి అన్న మాటల్లో ఎంతో సత్యం ఉన్నది. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని రూపుదిద్దు క్రమంలో ఉపాధ్యాయుడు తన అనుభవాలను, జ్ఞాపకాలను , భావి సవాళ్ళతో మేళవించి సామర్థ్యం గల వ్యక్తులుగా తయారు చేస్తారు.
వ్యక్తి నిర్మాణరంగంలో పాఠశాలలు ఉత్తమ కర్మాగారాలు గా ఉండాలంటే ఉపాధ్యాయుల చొరవ ,అంకితభావం ,పటిమ ,పటుత్వము, సంకల్పము, చిత్తశుద్ధి, ప్రతిభ, అధ్యయనము, అనుభవము, పరిశీలన, పరిశోధన కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల విద్యార్థులు పాఠశాల స్థాయిలో ఉంటే ప్రైవేటీకరణ మోజులో 60 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. ఫీజులు చెల్లించలేని పేద అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్లు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అందరికీ సమాన విద్య, అందరికీ నాణ్యమైన విద్య అందవలసిన ఈ పరిస్థితులలో ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వం పెంచి పోషించడం వలన పేద పిల్లలకు అన్యాయం జరుగుతుంది .ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ఇక మరో కోణంలో పేదవాళ్ళు అయినప్పటికీ కష్టార్జితాన్ని పిల్లల చదువు కోసం తమ సంపాదనలో అగ్రభాగాన్ని ఖర్చు చేస్తూ ఉండటం వల్ల కొనుగోలు శక్తి తగ్గి మరీ పేదలుగా మారుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని ఉపాధ్యాయులు కీలకమైన సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవడం ద్వారా తమ సామాజిక బాధ్యతను భుజానికెత్తుకో వలసిన ప్రధాన కర్తవ్యం నేటి ఆధునిక ఉపాధ్యాయుల పైన మరింతగా ఉన్నది. ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ సమాజానికి చెందినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు రంగాన్ని ఎత్తి చూపవలసి వస్తున్నది. ఒక విద్యారంగంలోనూ సకల సమస్యలకు పరిష్కారం ప్రైవేటు రంగాన్ని నిర్మూలించి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించడమే పరిష్కారమని అనేకమంది విద్యావేత్తలు, ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారులు బలమైన సంకేతాలు ఇచ్చారు.

ఆధునిక ఉపాధ్యాయులు కొన్ని సామాజిక బాధ్యతలు కర్తవ్యాలు

క్రమక్రమంగా ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్న కారణంగా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా సంక్లిష్టమైన నేటి పరిస్థితులలో ఆధునిక ఉపాధ్యాయుల పైన మరింత భారం పడుతున్నది. ఈ విషమ పరిస్థితులను బాధ్యతాయుతంగా స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలోని అధ్యాపకులు ప్రజల కష్టార్జితాన్ని తాము వేతనాల రూపంలో తీసుకుంటున్నామనే విషయాన్ని అంగీకరిస్తూనే ఆ పేద పిల్లల అభివృద్ధికి పూర్తిస్థాయిలో న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక సంబంధాలే ప్రధానమైన వేల అదనపు సంపాదన కోసము అన్ని వర్గాలతో పాటు ఉపాధ్యాయుల్లో కొద్దిమంది కూడా భిన్న వ్యాపకాలతో ఈ సందర్భంలో కొన్ని విమర్శలకు గురి అవుతున్నారు. ఆ విమర్శలను తిప్పి కొట్టి తమ నిజాయితీని చూపెట్టు కోవడానికి ఈ క్రింద కొన్ని సూచనలు తోడ్పడతాయని భావిస్తున్నాను.

– ఉపాధ్యాయులు పాఠశాలల కు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక స్థితిగతులను, క్షేత్రస్థాయి పరిశీలన అధ్యయనము, వివిధ శిక్షనల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని విద్యార్థులకు ప్రేమపూర్వకంగా అందించాలి.

– ప్రభుత్వం కల్పించిన అదనపు పనిభారం వల్ల అంకెల గారడీ లాంటి మార్కుల నమోదు, తరచుగా సమావేశాలు మాత్రమే కాకుండా వారు బోధించే సబ్జెక్టులో లోతైన పరిశోధన చేయడానికి సిద్ధపడడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం పిల్లలకు ఆ జ్ఞానాన్నిపంచె అవకాశం వస్తుంది.

– వివిధ విషయాలకు సంబంధించి పరిశోధన ఆలయాలు ప్రభుత్వము శ్రద్ధతో అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయవలసిన అవసరం అందుకు ఉపాధ్యాయులు డిమాండ్ చేయవలసిన అటువంటి బాధ్యత కూడా వారిపై ఉంది.

-ప్రశ్నించే తత్వాన్ని ఉపాధ్యాయులు అలవరచుకుoటే విద్యార్థుల్లో ఆ తత్వాన్ని మేల్కొల్పడం ద్వారా ఎందుకు? ఏమిటి? ఎక్కడ ?ఎప్పుడు? ఎవరు? ఎలా? అనే విభిన్న కోణాలలో విశ్లేషణా దృక్పథం అలవడుతుంది.
విద్యా రంగాన్ని మొక్కుబడి చేస్తున్న ప్రభుత్వాలు:-

ఈ విషయాన్ని చర్చించే ముందు కేరళ ఢిల్లీ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడ వలసి ఉన్నది. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్లో 26 శాతాన్ని కేటాయించడమే కాకుండా ప్రభుత్వ రంగంలో విద్యను బలోపేతం చేసే దిశగా పదివేల తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. అన్ని వసతులతో కూడిన ప్రయోగశాలలు ఇతర మౌలిక అవకాశాల నేపథ్యంలో అక్కడ ప్రైవేటు విద్యార్థులే ప్రభుత్వ పాఠశాల కు వస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గాని విద్యా మంత్రి గాని ముఖ్యమంత్రితో సహా అందరికీ విద్యారంగంపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. విద్యాశాఖ అధికారులు విద్యా మంత్రి చివరికి ముఖ్యమంత్రి కూడా పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులను సగౌరవంగా తగు సూచనలతో అలరిస్తారు తప్ప బెదిరించిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు అక్కడ 90 శాతానికి అక్షరాస్యత పెరిగింది. ఇక భారతదేశంలో మొదటి ర్యాంకు లో ఉన్న కేరళలో 21 శాతానికి పైగా నిధులను కేటాయిస్తూ 96 శాతం అక్షరాస్యులను చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కృతకృత్యమైంది అంటే ఎన్ని చర్యలు తీసుకున్నారో ఎంత శ్రద్ధ చూపుతారో మనం అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన అనుభవంలోకి వస్తే స్థానిక శాసనసభ్యులు మంత్రికి ముఖ్యమంత్రికి కూడా విద్యా రంగం పైన పట్టు ఉన్న అవకాశాలు లేవు. ఏనాడు కూడా విద్యా రంగం పై సమీక్ష జరపలేదు .విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు కేవలం 6 శాతం మాత్రమే. ఒక మామూలు అధికారి కూడా పాఠశాలను సందర్శిస్తే ప్రధానోపాధ్యాయుని సీటులో కూర్చుని బెదిరించడానికి సిద్ధపడతారు.

– చాలా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేవు.

– అనేక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడం, ప్రమోషన్ సౌకర్యాలను కల్పించకపోవడం, బదిలీల వ్యవస్థ నిరంతరం కొనసాగించక పోవడం, ఉపాధ్యాయులకు అదనపు పని భారం ఎక్కువగా కల్పించడం రాష్ట్ర విద్యా శాఖ లోపాలు గానే భావించవలసి ఉంటుంది. ఇక పాఠశాలల్లో 1500, 2,500 చొప్పున పనిచేస్తున్న సేవకుల స్థితిగతులను ప్రభుత్వము ఎప్పుడైనా ఆలోచించినదా? దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా పార్ట్టైమ్ స్వీపర్లు పనిచేస్తున్న వారి వేతనాలు ఇంకా 5000కు కూడా దాటలేదు..

* అయినప్పటికీ కొన్ని క్లిష్ట పరిస్థితుల మధ్యన ఉపాధ్యాయులుగా మనము సామాజిక బాధ్యతను విస్మరించకుండా ప్రజలతో ప్రజాజీవితంతో ప్రజా చైతన్య క్రమములో భాగస్వాములు కావాల్సిందిగా ఉపాధ్యాయులకు విజ్ఞప్తి. “హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడు” అనే సంఘ నినా దానికి కట్టుబడి పనిచేయవలసిన అవసరం సామాజిక మార్పు దోహదపడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఎక్కువగా ఉన్నది. ఈ విషయం ఏ చట్టంలో ను రాసి ఉండదు. సామాజిక మార్పుకు విద్య, సంఘ నీతి కివిద్య, వ్యక్తి నిర్మాణానికి విద్య అని అనడంలోనే ఉపాధ్యాయుల బాధ్యత అంతర్గతంగా దాగి ఉన్నది.

( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట).

One thought on “ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, ఎందుకు జరుపుతారో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *