రమణారెడ్డి సార్ , మీరు మాకు దూరమయినది భౌతికంగానే – మీరు చూపిన రాయలసీమ ఉద్యమ మార్గనిర్దేశం మమ్మల్ని ముందుకు నడుపుతుంది.
Dr MVR బహుముఖ ప్రజ్ఞాశాలి. చదివింది వైద్య విద్య చేసింది రాజకీయ పోరాటం ప్రపంచ చరిత్ర రచన ఒక దానికి ఒకటి సంబంధం ఉండదు. రాజకీయ అంశాలు చర్చకు వస్తే రాజకీయ యోధుడు కనిపిస్తారు. సాహిత్యం గురించి చర్చ జరిగితే వారిలో ఓ గొప్ప రచయిత కనిపిస్తారు. నీటి సమస్య పరిష్కారం గురించి చర్చ జరిగితే ఓ నిపుణుడుతో మాట్లాడినట్లు ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఆర్థికవేత్త కనిపిస్తారు. అన్ని ఒక వ్యక్తిలో చూడాలంటే రమణారెడ్డి సార్ లోనే సాధ్యం అందుకే తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి రమణారెడ్డి.
కార్మిక నేతగా రాజకీయ నాయకుడిగా వారు ఎంత ఎదిగినా రమణారెడ్డి అంటే రాయలసీమ ఉద్యమ నేతగానే గుర్తుకువస్తారు అలా రాయలసీమ అంటే రమణారెడ్డి అనేలా వారి ప్రస్థానం సాగింది.
రాయలసీమ ఉద్యమ ప్రస్థానంలో రమణారెడ్డి గారిది ప్రత్యేక శైలి….
స్వాతంత్రానికి పూర్వం తొలితరం రాయలసీమ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన వ్యక్తిగా పప్పూరి రామాచార్యులు వారు ఉంటే మలితరం రాయలసీమ ఉద్యమ మార్గదర్శనం చేసింది రమణారెడ్డి గారే. మలితరంకే కాదు నేటి తరానికి వారు స్ఫూర్తి.
మా లాంటి వారు ఆమాట కొస్తే నేడు రాయలసీమ గురించి మాట్లాడుతున్న అనేకులు విభజన తర్వాత ఉద్యమంలోకి కొచ్చినారు. అందుకే వారు ఒక సందర్భంలో అంటారు నేడు రాయలసీమ ఉద్యమంలోకి వచ్చిన మీరు గుర్తించుకోవాల్సినది ” జనానికి మీరు కొత్త మీకు జనం కొత్త ” ఒక్క మాటలు నేటి రాయలసీమ ఉద్యమ కారుల నడక ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. తాను తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా నేడు వైసీపీకి దగ్గరగా ఉన్నా రాయలసీమ అభివృద్ధి అంశాలు చర్చకు వస్తే తాను ఏ పార్టీలో ఉన్నాను అన్న కోణంలో కాకుండా రాయలసీమకు ఏది ప్రయోజనం కలుగుతుందన్నదే ప్రాతిపదికన స్పందించేవారు. ముక్యంగా రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి వారు రచించిన రాయలసీమ కన్నీటి గాధ నేటికీ ఆలోచింప చేస్తుంది. వారు రాయలసీమ ఉద్యమ నేతగా ఉండవచ్చు నీటి సమస్య పరిష్కారం చర్చకు వస్తే దేశ , విదేశాలలో ఉన్న నీటి వివాదాలు గురించి అవలీలగా మాట్లాడగలిగిన వ్యక్తి రమణారెడ్డి. విలువలు , సిద్దాంతాల ప్రాతిపదికన రాజకీయాలు నేడు నడవడం లేదు అన్నది అంగీకరించక తప్పదు. ఈ పతనం మరికొంత కాలం కొనసాగవచ్చు. నిరాశ పడకుండా నిబద్ధత ఉన్న వ్యక్తులు చేయగలిగింది. తన పాత్రను తాను పోసించడం. తాను ఎక్కడ ఉన్నా తాను నమ్మిన ఆలోచనలు అమలు కోసం కృషి చేయడం అన్నది రమణారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం నేటి తరానికి నేర్పుతున్న పాఠం.
ప్రతి రాయలసీమ ఉద్యమ కార్యకర్తకు రమణారెడ్డి ఓ స్పూర్తి….
నాకు రాయలసీమ ఉద్యమంలో స్పూర్తినిచ్చింది రమణారెడ్డి సార్ అనడానికి గర్వపడుతాను. 2015 వారితో పరిచయం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు వారితో గడిపిన ప్రతి సందర్భంలో ఎదో నేర్చుకున్నాను అన్న సంతృప్తి కలిగింది. నా వరకు రమణారెడ్డి గారు ఓ లైబ్రరీ. వర్తమాన ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి , నీటి వివాదాలు , చరిత్ర , రాజకీయాలు ఇలా ఏ అంశంపై అనుమానం కలిగినా వెంటనే రమణారెడ్డి సార్ కి ఫోన్ చేస్తాను. వారు రూట్ చెపుతారు నేను ముందుకు వెళుతాను. అనారోగ్యంతో బాధపడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అని అంటే మీరు కలుషితమైన రాజకీయ వాతావరణంలో పడుతున్న ఇబ్బంది కన్నా నాకు వచ్చిన కష్టం పెద్దదా పురుషోత్తం అంటే ఓ సంతోషం. నాకు వారితో ఉన్న అనుబంధం ఇతరులతో పోల్చుకుంటే స్వల్పం .. కానీ ఏదో నన్ను ప్రత్యేకంగా చూసేవారు. ఈ మధ్య వారు రాసిన ప్రతి పుస్తకం నాకు పంపేవారు. వారం తర్వాత ఫోన్ చేసి ఎలా ఉన్నది అడిగే వారు. నేను ఒక సారి చదవలేదు సార్ మీకు చదివాను బాగుంది అని అబద్ధం చెప్పను అంటే లేదు పురుషోత్తం నీవు బాగుంది అంటే నా ప్రయత్నం పలించింది అనుకుంటాను. మరచి పోకుండా చదివి అభిప్రాయం చెప్పు అనేవారు.ధన్యజీవి రమణారెడ్డి గారితో అనుబంధం రావడం నాకు లభించిన అరుదైన అవకాశం. ఆలాంటివి తలుచుకుంటే కన్నీళ్లు ఆగవు ఆ మాటున అంత గొప్ప వ్యక్తి మనస్సులో నాకు లభించిన అంత గౌరవం చూసి గర్వంగాకూడా ఉంటుంది. రమణారెడ్డి సార్ మీరు నాకు స్ఫూర్తి మీద్వారా నేర్చుకున్న నాలుగు విషయాలను సమాజ ప్రయోజనాల కోసం వెచ్చిస్తానని మాటిస్తూ బరువెక్కిన హృదయంతో వీడ్కోలు…
మీ పురుషోత్తమ రెడ్డి