ఏంటబ్బా! కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ చిత్ర విచిత్రాలు!

(టి.లక్ష్మీనారాయణ)
కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు బిజెపి, కాంగ్రెస్, సమాజ్ వాదీ, టిడిపి, టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ, వగైరా వగైరా పార్టీల్లో గతంలో చేరారు, ఇంకా అడపాదడపా చేరుతూనే ఉన్నారే! అని కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ ముక్కున వేలేసుకొంటున్నారు. అలాగే, కాంగ్రెస్, ఇతర పార్టీల నుండి కూడా దారితప్పివచ్చిన కొందరు కమ్యూనిస్టు పార్టీల్లోను చేరుతున్నారే! ఇదెక్కడి సోద్యమని మరికొందరు విస్తుపోతున్నారు.
ఇటీవల సీపీఐ ని వదలి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కన్హయ కుమార్
ఇటీవల సీపీఐ ని వదలి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కన్హయ కుమార్
కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు కొందరు మానసికక్షోభకు గురౌతూ, కొందరు మెసేజ్ లు పంపి, ఫోన్లు చేసి, వారి ఆవేదనను నాతో పంచుకున్నారు. వాటికి స్పందించి ఈ పోస్టు పెడుతున్నా.
ఒక వ్యక్తి వ్యక్తిత్వం అతని గుణగణాలు, తాత్విక చింతనపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల సమూహమే సమాజం. ఆ సమాజాన్ని నియంత్రణ చేసే రాజ్య స్వభావం, ప్రజల చైతన్యం మీద ఆధారపడి ఆ సమాజం యొక్క అభివృద్ధి దశ, స్వభావాన్ని అంచనా వేయబడుతుంది.
వ్యక్తుల సమూహమే రాజకీయ పార్టీ. సామాజిక స్పృహతో, కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షణ లేదా విశ్వాసంతో వ్యక్తులు కమ్యూనిస్టు పార్టీలకు దగ్గరౌతుంటారు, లేదా, సభ్యులుగా చేరుతుంటారు. తుపాకీ పట్టిన ప్రతి ఒక్కరు విప్లవకారుడు కాదు కదా! అలాగే, ఎర్రజెండా పట్టుకొన్న ప్రతి వ్యక్తి కమ్యూనిస్టు కాలేడు. కమ్యూనిస్టు పార్టీల్లో చేరిన ప్రతి వ్యక్తి కమ్యూనిస్టునని చెప్పుకోవడం సహజం. అందులో తప్పు లేదు. కానీ, కమ్యూనిస్టు పార్టీల్లో చేరిన వ్యక్తులను కమ్యూనిస్టులుగా సానపట్టే బాధ్యత కమ్యూనిస్టు పార్టీల సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.
కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు పార్టీలుగా మనగలగాలి అంటే మార్క్సిస్టు భావజాలాన్ని ఒక శాస్త్రీయ భావజాలంగా విశ్వసిస్తూ, ఆచరిస్తూ, కమ్యూనిస్టు నైతిక విలువలను పరిరక్షించుకోవాలి. అంటే, వాటికి అనుగుణంగా తన శ్రేణులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలి. కమ్యూనిస్టు పార్టీలు అనుసరించే విప్లవ పంథా, రాజకీయ విధానం, ఎత్తుగడలపై ఆధారపడి వాటి మనుగడ, ప్రగతి, భవిష్యత్తు ఉంటుంది.
వ్యక్తులు వారి వ్యక్తిత్వాన్ని వారే తీర్చిదిద్దుకోవాలి. కమ్యూనిస్టుగా జీవించాలనే నిబద్ధత ఉంటే కమ్యూనిస్టుగా జీవిచడం కష్టం కాదు. కమ్యూనిస్టు విలువలతో జీవితం గడపడంలో ఉన్న సంతృప్తి అనిర్వచనీయమైనది, వర్ణనాతీతమైనది. కమ్యూనిస్టుగా జీవితాంతం జీవించడం ప్రతి కమ్యూనిస్టుకు నేటి సమాజంలో అగ్నిపరిక్షే! పరిపూర్ణమైన కమ్యూనిస్టుగా ఒక వ్యక్తి జీవించాడా! లేదా! అన్నది ఆ వ్యక్తి మరణానంతరమే తేల్చగలిగిన అంశం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *