(గోలి సీతారామయ్య)
ప్రముఖ గాంధేయవాది, విద్యాదాత..అమరజీవి జొన్నాదుల రామారావు.
ఆ మహనీయుడు భౌతికంగానిష్క్రమించి (1966 సెప్టెంబర్,30) నేటికి 55 సంవత్సరాలు.
మంగళగిరిలో జొన్నాదుల రామారావు గారి పేరు వినగానే వెనుక తరముల వారు ఎంతో గొప్పగా తలపోసుకునేవారు. ఈ నేల గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి చేరినా, తరాలు మారి, కాలంలో వేగం పెరిగినా ఇప్పటికీ.. జొన్నాదుల రామారావు గారి గురించి చేనేత కుటుంబాల్లోనూ, నిరుపేద వర్గాల్లోనూ ఒక పుణ్యమూర్తి ఇతిహాసాన్ని తలంచుకున్నట్లు కాలంతో నిమిత్తం లేకుండా తలంచు కుంటూనే వుంటారు. కారణమేమంటే…ఆ రోజుల్లోఆయన చేసిన వితరణ, చూపిన ఆదర్శం, నిస్వార్థ ప్రజాసేవ ప్రజల హృదయాల్లోనాటుకు పోయింది.
ఆయన మంచితనం గురించి తరం నుండి తరానికి ఎవరి ప్రమేయం లేకుండా చాలా సహజంగా జీవనదిలా సాగి పోతూనే ఉంటుంది.
మంగళగిరిలోని జొన్నాదుల తిరుపళ్లి-కనకమ్మ దంపతులకు తృతీయ కుమారునిగా 1924లో రామారావు గారు జన్మించారు. వీరిది ఒక సాధారణ చేనేత కుటుంబం. తాడేపల్లి వాస్తవ్యులైన గోలి సుబ్బయ్య గారి కుమార్తె దమయంతి గారితో 1945లో రామారావు గారికి వివాహం జరిగింది.
ఈయన 5వతరగతే చదువుకున్నా లోకపరిశీలన వ్యవహార దక్షత పుష్కలంగా ఉండేవి. రెండు వందల చేనేత కుటుంబాలతో ఆయనకు నిత్య సంబంధాలు వుండేవి. ఆయన ఇంటి వద్ద రోజూ నేసిన చీరలు అప్పచేప్పేవాళ్లు, పచ్చం దిగాక పాగడి, నూలు కోసం వచ్చే వాళ్లు, అనామత్తు కోసం వచ్చేవాళ్లతో ఎంతో సందడిగా వుండేది. అంత హడావిడి లోనూ కార్మికుల యోగక్షేమాలు విచారించడం రామారావుగారికి
అలవాటుగా ఉండేది.
చేనేత కార్మికులు మాసిన గెడ్డంతో ఆయన కంటపడితే ముందు ప్రేమగా రూ.2లు ఇచ్చి గెడ్డం చేయించుకు రమ్మని చెప్పేవారు. చేనేత కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు వందలాది మందికి ఆయన ఫీజలు చెల్లించి విద్యాబుద్ధులు చెప్పించారు.
ఆనాటి చేనేత కాంగ్రెస్ నాయకులు శ్రీయుతులు అక్కల కోటయ్య, ప్రగడ కోటయ్య, జింకా వెంకట సుబ్బయ్య, తాళ్లకోటి వీరయ్య గార్లతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. విద్య పూర్తిచేసి ఖాళీగాఉన్న పిల్లలకు వారితో మాట్లాడి నూలు మిల్లుల్లో ఉద్యోగాలు ఇప్పించే వారు. ఆయనకు చేనేత అంటే ప్రాణం. చేనేత ప్రజలంటే ఎక్కడ లేని మమకారం. ప్రజా సేవకు పదవులే అక్కర్లేదని నిరూపించిన గాంధేయవాది. ఈయన కుమారుడైన జొన్నాదుల బాబూ శివప్రసాద్ తండ్రి భావాలను వారసత్వంగా స్వీకరించి, తండ్రి ఆశయాన్ని సంస్థాగతం చేయాలని మిత్రుల సహకారంతో మార్కండేయ ఎడ్యుకేషనల్ సోసైటీని స్థాపించారు.
37 సంవత్సరాల నుండి ఈ సోసైటీ పేద చేనేత విద్యార్థులకు తన సేవలను విస్రృత్తంగా అందిస్తున్నది.
మంగళగిరిలోని వెంకటేశ్వర ధియేటర్, గోపాలకృష్ణ టాకీస్ రామారావు గారి పర్యవేక్షణ లోనే నిర్మితమయ్యాయి. ఆనాటి ఎమ్మెల్సీ దామర్ల రమాకాంతరావు గారు రామారావు గారిని ఎంతో ప్రేమించేవారు. మంగళగిరిలోని వీవర్స్ కాలనీ రామారావు గారి పర్యవేక్షణలోనే నిర్మాణం అయింది. పద్మశాలీ బహుత్తమ సంఘానికి ఆయన ఎన్నో సేవ లందించారు. అలాగే మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కి చేనేత కార్మికులకు మంజూరీల పెంపు విషయమై చర్చల్లో పెద్దగా వ్యవ హారించేవారు. రామారావు గారి వయస్సు చిన్నదే అయినా ఆయన వ్యవహార శైలి నలుగురు మెచ్చేదిగా వుంటుంది. ఎవ్వరినీ నొప్పించని సౌజన్య మూర్తి. తనకు నష్టం కలిగినా ప్రజలకీ, తాను తలపెట్టిన కార్యానికి భంగం వాటిల్ల కూడదనేది ఆయన లక్ష్యం. ఆయన జీవిత కాలంలో కీర్తిని తప్ప, సంపదను ఆర్జించలేదు.
ఆయన జీవించింది 42 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన నూరేళ్ల సేవను ప్రజలకు అందించారు. చేనేత కుటుంబాలకు మాత్రమే కాక, నిరుపేద వర్గాలకు కూడా సేవలు అందాయి. ఆయన ఇంటి వద్ద ఒక కారు, డ్రైవర్ ఎప్పుడూ సిద్ధంగా వుండేవి. మంగళగిరిలో ఒక ఎమ్.బి.బి.యస్. డాక్టర్ లేని ఆ రోజుల్లో…. గర్భిణీ స్ర్తీల కాన్పు కోసం గుంటూరు తీసుకువెళ్లటానికి ఆ కారును వినియోగించారు. ఆ కారుకి కులమత భేదం లేదు.
జాతీయోద్యమ స్ఫూర్తితో చాలాకాలం పాటు రామారావు గారు అనేక సేవలతో పాటు, మహిళల కోసం అందించిన ఈ సేవ ఎంతో ప్రత్యేకం.
1966 సెప్టెంబర్ 30న ఆయన మరణించినప్పుడు “ఏ రాజకీయ నాయకుడికి రానంత జనం, ఊరు పట్టని జనం వచ్చారని, ఆయన్ను సాగనంపేంత వరకూ ఊరిలో పొయ్యి ముట్టించలేదని’’ ఇప్పటికీ పట్టణ ప్రజలు చాలా విశేషంగా చెప్పుకుంటూనే వున్నారు, చెప్పుకుంటారు కూడా.ఈ మహానీయుని చరిత్ర ఒక జీవనది. ఈ నది ఎప్పటికీ ఇంకదు. ఎందుకంటే- ఆయన ఎప్పటికీ మంగళగిరి చరిత్రలో చిరస్మరణీయులుగా వుంటారు.
(గోలి సీతారామయ్య, బుద్ధభూమి, వర్కింగ్ ఎడిటర్
మంగళగిరి)