డా.యం.వి.ఆర్: ఉద్యమం, సాహిత్యం సంక్షిప్త పరిచయం
(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
డాక్టర్. యం.వి రమణారెడ్డి గారు ప్రొద్దుటూరు కేంద్రంగా జన్మించారు. యం.బి.బి యస్ చదివి తొలినాళ్ళలో వృత్తిరీత్యా వైద్యులుగా కొనసాగారు. ప్రగతిశీల భావాలు కలవారు. వామపక్ష భావాలకు ప్రభావితుడై సంఘాలలో పని చేసారు.
ఆ క్రమంలో సీమ ప్రాంతం ప్రత్యేక పరిస్థితులు చూసి అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి పోరాటాలు చేసారు.
1983 లో తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రొద్దుటూరు యం.యల్.ఏ గా గెలిచారు. సంవత్సరం తిరగకుండానే తానెంతో ఇష్టపడే యన్.టి.ఆర్ గారినే కాదని రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం చేసిన ఈ త్యాగం సీమ చరిత్రలో కీలకమైంది. తరతరాలుగా అన్ని రంగాలలో వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి, నీళ్ళు, పరిశ్రమల కోసం 1984 లో రాయలసీమ విమోచన సమితి ని ఏర్పాటు చేసి ఉద్యమాలు చేసారు. పాదయాత్రలు చేసారు. అనేక కరపత్రాలు, నివేదికలు ప్రచురించాడు. సీమ సమస్యల పై కదలిక తీసుకొచ్చారు.
అనంతర కాలంలో పార్టీలలో ఇమడలేక స్వంతంత్రగా ఎన్నికలలో నిలబడుతూ వచ్చారు. తాను ఎక్కడ ఉన్న సీమ సమస్యల పట్ల ఒక నిర్దిష్ట ప్రతిపాదనలతో పరిష్కారాలు తెలియచేయడానికి ఏనాడూ వెనుకాడలేదు. ఏదో ఒక రోజు సీమ సమాజం చైతన్యవంతం అవుతుందని, తమ సొంత కాళ్ళపై నిలబడుతుందని ఆయన చిరకాల ఆశ.
ప్రొద్దుటూరు లో రాయలసీమ వ్యాయామ కళాశాలను గొప్ప సంస్థగా రూపొందించారు. “కవిత”,”ప్రభంజనం” వంటి పత్రికలు నడిపారు.
ఇదంతా ఒక ఎత్తైతే రమణారెడ్డి గారికి సాహిత్యం పట్ల ఉండే ఆసక్తి అంతా ఇంత కాదు. సామాజిక, సాహిత్య అంశాల వ్యాసకర్త గా, కరపత్ర రచయితగా, కథారచయితగా, అనువాదకునిగా, చరిత్రకారునిగా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
9 స్వీయపుస్తకాలను, 7 అనువాద పుస్తకాలను, ఇంకా సాహిత్య విలువలున్న ఇతరుల పుస్తకాలను కవితా పబ్లికేషన్స్ స్థాపించి ప్రచురించారు. మరికొన్ని పుస్తకాలు వెలువడవలసి ఉంది. ఇలా ఏడుపదుల వయసులోను నిరంతరం ఆక్సిజన్ మాస్క్ తో ప్రాణం జీవితం నెట్టుకొస్తూ సాహిత్య రంగంలో నిరంతరంగా కృషి చేస్తూ వస్తున్నారు.
తన జీవితం స్ఫూర్తి వంతంగా కొనసాగించి, నేటితరాలకు ఆదర్శంగా నిలిచిన శ్రీ యం.వి రమణారెడ్డి గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం.
ఆయన ఆశయాలను కొనసాగిస్తాం.
————————–
*డా. యం.వి రమణారెడ్డి సాహిత్య పుస్తకాలు:*
*స్వీయ పుస్తకాలు..*
1. రాయలసీమ కన్నీటి గాథ
2. తెలుగు సినిమా – స్వర్ణయుగం
3. శంఖారావం ( వ్యాసాలు- వ్యక్తీకరణలు)
4. తెలుగింటి వ్యాకరణం
5.పరిష్కారం (కథల సంపుటి)
6. మహాభారత స్రవంతిలో
7. తెలుగింటికొచ్చిన ద్రౌపది.
8.ఆయుధం పట్టని యోధుడు
(మార్టిన్ లూథర్ కింగ్ జూ.. జీవిత చరిత్ర)
9. ప్రపంచ చరిత్ర (నాలుగు భాగాలు)
*అనువాదాలు..*
1. పురోగమనం…
( డా.జాషువా హార్న్స్ – “అవే విత్ పెస్ట్స్” నవలకు అనువాదం
2. రెక్కలు చాచిన పంజరం
( హెన్రీ షారియర్ – “పాపియాన్” నవలకు అనువాదం)
3. పెద్దపులి ఆత్మకథ…
( ఆర్.కె నారాయణ్ – “ఏ టైగర్ ఫర్ మాల్గుడి” కి అనువాదం)
4. చివరకు మిగిలింది?
(మార్గరెట్ మిచ్చెల్ – గాన్ విత్ ద విండ్” నవలకు అనువాదం)
5. మాటకారి
ఆర్.కె నారాయణ్ – “టాకిటివ్ మ్యాన్” కు అనువాదం)
6.కడుపుతీపి
(మాగ్జిం గోర్కి- అమ్మ నవలకు అనువాదం)
*ఇతర సాహిత్య ప్రచురణలు..*
1. శ్రీ శంకర కవితా వైభవం ( కరణం బాల సుబ్రహ్మణ్యం పుస్తకం)
2. మచ్చు తునకలు
(25 విలువైన కథల సంకలనం)
3. కాదంబరి ( బాణుడు కాదంబరి కి విద్వాన్ విశ్వం అనువాదం)
( *డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,
అనంతపురము.9963917187)