* అక్టోబర్ 4, 2021, సోమవారం, ఉదయం 10 గంటల నుండి సాయింత్రం 4 గంటల వరకు…
* భవిష్యత్తులో సీమకు రైల్వే టాంకర్లతో త్రాగు నీరు తోలుకొనే పరిస్థితి రాకుండా కాపాడుకుందాం …
* దీక్ష వేదిక : నంద్యాల సివిల్ కోర్ట్ కాంప్లెక్స్/ నంద్యాల II టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర
రాయలసీమ దాహార్తిని తీర్చడానికి తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజక్టులకు మూడున్నర దశాబ్దాల క్రితం పాలకులు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజక్టుల నిర్మాణం 2014 లో రాష్ట్ర విభజన నాటికి సంపూర్తి కాకపోయినప్పటికీ, పాక్షికంగా నైనా నిర్వహణలో వున్నాయి.
ముచ్చుమర్రి ఎత్తిపోతల, కర్నూలు పక్షిమ ప్రాంతం లోని గురు రాఘవేంద్ర ఎత్తిపోతల, సిద్దాపురం ఎత్తిపోతాల పథకాలు అంతర్గత నీటి సర్దుబాట్లతో నిర్మించారు.
రాష్ట్ర విభజన నాటికి ఈ ప్రాజక్టులు కూడా నిర్వహణలో వున్నాయి. అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 లో పై ప్రాజక్టులను అన్నింటిని కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 14, 2021 నుండి అమలు చేయబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్లో, రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చిన పై ప్రాజక్టులకు 6 నెలల కాలంలో అనుమతులు పొందాలని పేర్కొంది. 6 నెలల కాలంలో అనుమతులు పొందక పోతే ఈ ప్రాజక్టుల నిర్మాణం పూర్తి అయినా, ఈ ప్రాజక్టుల నిర్వహణను అనుమతించమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ ప్రాజక్టులకు 6 నెలల కాలంలో అనుమతులు పొందడానికి అనేక అవాంతరాలు ఉన్నాయి. ఈ అవాంతరాలకు ప్రధాన కారణం ఈ ప్రాజక్టులకు నికరజలాలను కేటాయింపులు లేకపోవడం.
ఈ అవాంతరాన్ని తొలగించడానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దుమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజక్టు గోదావరి నది జలాలను కృష్ణా నదికి మళ్ళించడానికి వెసలుబాటు కలుగ చేస్తుంది. దీనితో ఆదా అయ్యే 165 టి ఎం సి ల కృష్ణా జలాల నుండి పై ప్రాజక్టులకు నికర జలాలు కేటాయించడానికి వీలు కలుగుతుంది.
దుమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టు నిర్మాణానికి 590 కోట్లు ఖర్చు చేసారని, ఈ ప్రాజక్టును రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచాలని, ఇది రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమని శ్రీ వెంకయ్య నాయడు గారు రాజ్యసభలో కోరారు. దీనికి అప్పటి కేంద్ర మంత్రి జయరాం రమేష్ గారు ఈ ప్రాజక్టు కు సంభందించి కొన్ని సాంకేతక వివరాలు అందవలసి ఉన్నందున, ఈ ప్రాజక్టును రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచలేక పోయినప్పటికి, ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో నిర్మాణం లో వున్న అన్ని ప్రాజక్టుల నిర్మాణం చేపడతామని రాజ్యసభలో ప్రకటించారు.
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం లో వున్న అన్ని ప్రాజక్టుల నిర్మాణం చేపడతామని రాష్ట్ర విభజన చట్టంలో కుడా పొందుపరచారు. కానీ రాష్ట్ర విభజన అనంతరం దుమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టు నిర్మాణం కొనసాకగించ పోవడంతో పై ప్రాజక్టులకు నికరజలాలను కేటాయింపులు చేయడానికి వీలు లేకుండా పోయింది. నికరజలాలు లేకుండా మిగులు జలాలపై ప్రాజక్టుల అనమతులు మంజూరు కావు.
అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చట్టబద్దత పొందిన, నిర్వహణలో వున్న పై ప్రాజక్టులు 6 నెలల కాలంలో అనుమతులు పొందకపోతే, ఈ ప్రాజక్టులు నిర్వహించడానికి వీలు లేదు అని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ లో పేర్కొనడం అత్యంత శోచనీయం.
ఈ ప్రాజక్టులు మిగులు జలాలను వాడుకొనడానికి, అదేవిదంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన చట్టబద్ద నీటిలో అంతర్గత సర్దుబాట్లతో నీటిని వినియోగించు కొనడానికి కూడా వీలు లేకుండా చేసే ఈ అంశం రాయలసీమ ఉనికికే తీవ్ర ప్రమాదం. భవిష్యత్తులో సాగు నీటికే కాదు, త్రాగు నీటికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఒకప్పుడు మద్రాస్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి రైల్వే టాంకర్ల ద్వారా నీటిని తోలినట్లే, రాయలసీమ తాగునీటి అవసరాలకు నీటిని తోలవల్సిన పరిస్థితి రాబోతుంది.
పోలవరం, విశాఖ ఉక్కు కోసం అంధ్రప్రదేశ్ లోని తెలుగు వారంతా పోరాడాలనే పిలుపు నిచ్చే అంధ్రప్రదేశ్ లోని పెద్దలంతా, రాయలసీమ కు సంభందించిన ఇంతటి కీలకమైన అంశాలపై అంటిముంటనట్టు వున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ అమలుతో రాయలసీమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతున్న దృశ్యం స్పష్టంగా కనపతుతున్నది. అంధ్రప్రదేశ్ లోని పెద్దలకు ఈ విషయం పై స్పందించే హృదయమో, సమయమో లేదనుకున్నా, రాయలసీమ వాసులం మనమైనా స్పందించాలి కదా ?
రాయలసీమ పల్లెలు, పట్టణాలు తాగునీటికి విలవిలలాడే పరిస్థితులు రాకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా నిర్వహించే రాయలసీమ ప్రజా నిరాహారా దీక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులవ్వాలని విజ్ఞప్తి.
రాయలసీమ సాగునీటి సాధన సమితి
25/510 B, శ్రీనివాస నగర్, నంద్యాల – 518 501, 98498 44776, 94934 58940 rayalaseemasss@gmail.com