మంగళగిరిలో ఒక సాహిత్య సాయంకాలం…

 

(కృష్ణార్జునరావు)

నిన్న సాయంత్రం 6 గంటలకు మంగళగిరిలో మొన్న జరిగిన   ‘రైతు సమరభేరి’ పుస్తకం ఆవిష్కరణ సభ సమీక్షా సమావేశం కంచర్ల కాశయ్య  అధ్యక్షతన -కవి గోలి మధు ఇంటి వద్ద ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.

ఈ సమీక్షా సమావేశానికి పట్టణం లోని అభ్యుదయ కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, అభిమానులు, కళా పోషకులు పలువురు పాల్గొని గోలి మధూ గారిని అభినందించారు.

ప్రజా రచయితలు, కళాకారులు ఎప్పుడూ వర్తమాన సమస్యలపై స్పందించి ప్రజలకు మార్గదర్శులుగా నిలవాలని, ఆ విధంగా గోలి మధూ గారు ఢిల్లీ రైతాంగ ఉద్యమంపై విశేష రీతిలో స్పందించి అలుపెరగని కవితా సేద్యం చేస్తున్నాడని సమావేశంలో పాల్గొన్న పలువురు పెద్దలు కొనియాడారు.

ప్రగతిశీల న్యాయ వాదుల వేదిక జిల్లా కన్వీనర్ శిఖా సురేష్ బాబు గారు మాట్లాడుతూ… ఇటీవల మంగళగిరిలో సాహితీ, కళా కార్యక్రమాలు వరుసగా జరుగుతూ ఇతర ప్రాంతాల మిత్రులకు కూడా నూతనోత్సాహాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.

ఇకపై జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తమ వంతు సహకారం ఉంటుందని పెద్దలు దామర్ల కుబేరస్వామి గారు, పొట్లాబతుని లక్ష్మణరావు గారు, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు గారు సంతోషంగా వెల్లడించారు. మా విరాళాలు ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఉపయోగ పడినప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నారు.

రేకా కృష్ణార్జునరావు మాట్లాడుతూ… మంగళగిరిలో ఒక ఐక్య సాహితీ, కళా వేదికను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని విస్తృతం చేసుకోవాలని, నియోజకవర్గ స్థాయిలో కవులు, రచయితలు, కళాకారులను సంఘటిత పరచాలని, తద్వారా ప్రజల్లో అభ్యుదయ చైతన్యం కలిగించాలని చెప్పారు. మధూ గారి సామాజిక ప్రయాణంలో వారి కుటుంబం మొత్తం మమేకమై సాగటమనేది నాకు చాలా సంతోషం కలిగిస్తుందని, అందుకు వారి కుటుంబం మొత్తాన్ని అభినందిస్తున్నానని అన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన కంచర్ల కాశయ్య గారు మాట్లాడుతూ…. మంగళగిరిలో ఒకప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగేవని తాను కూడా ఆ కార్యక్రమాల ప్రభావంతో వామపక్ష ఉద్యమం లోకి వచ్చానని, కృష్ణార్జునరావు గారు ఏర్పాటు చేయాలనుకునే ఐక్య వేదికకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ అన్ని కార్యక్రమాల్లో పనిచేసే ఉద్యమకారులు సేద తీరే విధంగా అమ్మ రేకా సామ్రాజ్యం గారు చూపించే ఆత్మీయత, ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే నని అన్నారు.

సందుపట్ల భూపతి గారు, అల్లక తాతారావు గారు మాట్లాడుతూ… అందరి సమిష్టి కృషి, కృష్ణార్జునరావు గారి సమన్వయ నైపుణ్యం వెరసి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని అన్నారు. కవులు, కళాకారులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను సమావేశం దృష్టికి తెచ్చారు.

గోలి మధూ జీవిత భాగస్వామి శ్రీమతి సౌమ్య మాట్లాడుతూ…. ఒక మంచి ప్రభుత్వం ఏ విధంగా నైతే అన్ని శాఖలను ఏర్పాటు చేసుకుని జనరంజకంగా పాలన అందిస్తుందో, అదేవిధంగా కృష్ణార్జునరావు గారు ఏ పని తలపెట్టినా దానికి అవసరమైన టీమ్ లను ఏర్పాటు చేసుకుని సమిష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, అలాంటి సమిష్టి కృషితో రైతు సమరభేరి పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేసిన మిత్రులందరికీ మా కుటుంబం తరపున హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నామని చెప్పారు.

మధూ గారి అమ్మగారు పార్వతీ దేవి మాట్లాడుతూ…. చిన్న నాటి నుండి మా మధూ చాలా దయా హృదయం గల వాడని మా మధూ రాసిన కవితలకు ఇంత మంది మంచి వ్యక్తులు ఇంత ప్రజాదరణ కలిగేలా కృషి చేయటం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

రిటైర్డ్ ఉపాధ్యాయులు కంచర్ల అరుణాచలం గారు మాట్లాడుతూ…. సభా కార్యక్రమం చాలా బాగా జరిగిందని, ముందు ముందు జరిగే కార్యక్రమాల్లో మీతో కలిసి ప్రయాణిస్తానని, మంచి విషయాలను మంచి మార్గం ద్వారా చెప్పటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టమని చెప్పారు.

CPI పార్టీ నాయకులు అన్నవరపు ప్రభాకర్ గారు, గంజి వెంకయ్య గారు మాట్లాడుతూ… ప్రజా చైతన్యానికి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా ఉపయోగ పడతాయని అందుకోసమే కృష్ణార్జునరావు గారి సామాజిక, సాంస్కృతిక ఉద్యమంలో కలిసి ప్రయాణిస్తున్నామని చెప్పారు.

అభ్యుదయ వాది వాసి ప్రకాష్ గారు మాట్లాడుతూ…. నాకు మధూ గారు ఈ మధ్యనే పరిచయం అయినారని, ఈ సాంస్కృతిక ఉద్యమ ప్రభావంతో మధూ గారి కుటుంబంలో మేము కలిసి పోయి ఒకే కుటుంబం లాగా ఆత్మీయంగా ఉంటున్నామని చెప్పారు.

వీడియో గ్రాఫర్ వీరంకి రాజశేఖర్, ఫొటోగ్రాఫర్ సుధాకర్ లు మాట్లాడుతూ…. మధూ గారు చాలా మంచి వ్యక్తి అని, అందువల్లనే ఆయనకు ఏదో ఒక రూపంలో సహకరించాలని మాకు తెలిసిన విద్య ద్వారా కార్యక్రమాలకు సహకరిస్తున్నామని చెప్పారు.

ఆంధ్రజ్యోతి ఉప సంపాదకులు శిరందాసు నాగార్జున గారు మాట్లాడుతూ…. నేను చాలా విషయాలు గమనిస్తున్నాను. ఎంతో చక్కటి ప్రణాళిక తో సాగితేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తున్నానని చెప్పారు.

టిడిపి నాయకులు జొన్నాదుల నాగ మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ…. మిత్రులు కొనసాగించాలనుకునే సాంస్కృతిక ఉద్యమానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు.

చివరిగా రచయిత గోలి మధూ మాట్లాడుతూ…. తాను మొట్ట మొదట రాసిన భారతీయ ధర్మ విశ్లేషణ పుస్తకం నుండి నేటి రైతు సమరభేరి పుస్తకం వరకు తన కవితా ప్రయాణాన్ని సోదాహరణగా వివరించారు.

ఈ సమీక్షా సమావేశం చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. భవిష్యత్ కార్యాచరణకు అందరికీ ప్రేరణ కలిగించింది.

సమావేశం తదుపరి వచ్చిన మిత్రులందరికీ మధూ గారి కుటుంబం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటులో మధూ – సౌమ్య పిల్లలు పృథ్వీ రాజ్, ప్రకాష్ రాజ్ పూర్తిగా సహకరించారు.

‘రైతు సమరభేరి’  పుస్తకావిష్కరణ వార్త  ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/farm-law-rytu-samarabheri-poetry/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *