మానవ జాతి చరిత్రలో ఈ బండరాయికి చాలా ప్రాముఖ్యం ఉండబోతున్నది. మరొక గ్రహం మీద రాతి మీద మనిషి చెక్కిన రంద్రాలివి. సెప్టెంబర్ మొదటి వారంలో అంగారక గ్రహం మీద ఉన్న జెజెరో గోతిలో నుంచి తీసుకున్న ఈ రాయి ఈ గ్రహం గట్టు విప్పబోతున్నది. రాతిలో ఆంగారకుడి చరిత్రను అన్వేషించబోతున్నారు అమెరికా నాసా శాస్త్రవేత్తలు.
అమెరికా నాసా శాస్త్రవేత్తలు పంపిన పర్సివరెన్స్ రోవర్ (Peseverance Rover) అంగారకుడి గట్టు విప్పే ఈ రాతి నమూనాలను సేకరించింది.
మార్స్ రోవర్ ఇలా రాతి నమూనా సేకరించాలనుకోవడం రెండోసారి. మొదటి ప్రయత్నం ఆగస్టు 6 విజయవంతం కాలేదు. ప్లాన్ ప్రకారం, రోవర్ ఈ శాంపిల్ ను సేకరించి 233 నెంబర్ ఉన్న శాంపిల్ ట్యూబ్ లో నింపాలి. చేయవల్సిన పనులన్నీ రోవర్ చేసింది. తీరా చూస్తే ట్యూట్ లో శాంపిల్ లేదు.
రెండో సారి విజయవంతమయింది. ఈ రాతి మీద రంద్రం వేసి అక్కడి నుంచి సేకరించిన పొడి నమూనాలను విశ్లేషించి, అంగారకుడి మీద అగ్నిపర్వతాల తీరు, నీటి ఉనికిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.
రెండో ప్రయత్నంలో ఈ రాయి మీద రోవర్ రెండు రంద్రాలు వేసింది . ఈ ఫోటోలో కిందివైపు ఉన్న గుర్తు పర్సివరెన్స్ రాతిస్వరూపం తెలుసుకునేందుకు ఒక సారి గోకడం వల్లఏర్పడిన మచ్చ.
మొదటి శాంపిల్ ను ఒక రాయి మీద మొదటి రంద్రం వేసి సేకరించింది. ఈ ప్రదేశాన్ని మాంట్ డెనియెర్ (Montdenier)అని పిలుస్తారు. ఇది సెప్టెంబర్ 6 న జరిగింది.
రెండో రంద్రాన్నిసెప్టెంబర్ 8న వేసి పొడిని సేకరించింది. ఈ రంద్రం పేరు మాంటనాక్ (Montagnac). ఆంగారకుడి మీద అగ్ని పర్వతాలు ఎపుడు యాక్టివ్ ఉన్నాయి, నీళ్లెపుడు వ్యాపించి ఉన్నాయనే అంశాల టైమ్ లైన్ ను నిర్ధారించేందుకు శాంపిల్స్ పనికొస్తాయి.
“It looks like out first rocks reveal a potentially habitable sustained environment,” అని కెన్ ఫార్లే అనే నాసా సైంటిస్టు చెప్పారు. అంగారకుడి మీద ఒకపుడునీళ్లుండినాయన్నవిషయం చాలా ప్రాముఖ్యంతో కూడుకున్నదని ఆయన అన్నారు.
పర్సివరెన్స్ రోవర్ ఈ రాయిని జెజెరో క్రేటర్ నుంచి తీసుకుంది. ఈ రాయి బ్రీఫ్ కేస్ సైజులో ఉంటుంది. దాని మీద రంద్రం వేసి సేకరించిన పొడిని గాలి చొరబడని ట్యూబ్స్ లో రోవర్ భద్రపరిచింది. మొత్తంగా 43 ట్యూబ్స్ ని రోవర్ నింపాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యక్షంగా పరిశీలించాలంటే ఈ శాంపిల్స్ భూమి (Mars Sample Return Campaign) కి రావాలి. ఇవి భూమికి చేరితే భూమి మీదకు మరొక గ్రహం నుంచి మనిషి శాస్త్రీయంగా తీసుకువచ్చిన తొలి శాంపిల్ అవుతుంది.
ఈ శాంపిల్స్ తో పాటు జెజెరో గోతి లోపలి భూభాగం పొరలను కూడా పరిశీలించి, ఒకప్పుడు అంగారకుడి మీద ప్రాణి బతికేందుకు అవసరమయిన పరిస్థితులు నిజంగానే ఉండినాయా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు.
రోవర్ శాంపిల్ తీసుకునే ప్రయత్నం సెప్టెంబర్ 1 న మొదలుపెట్టింది. రోవర్ కు ఉన్న రోబోటిక్ చేతి చివర న్న ఉలి తో రాయి మీద రంద్రం వేయడం మొదలుపెట్టింది. ఈ రాయిని రాసెటి (Rochette)పిలుస్తున్నారు. ఇది ఆసక్తికరమయిన ప్రక్రియ. రంద్రం వేయడం పూర్తి కాగానే రోవర్ మరొక చేత్తో ఒక ట్యూబ్ అందిస్తుంది. దీనిని వెంటనే ఒక కెమెరా (Mastcam-Z) ఫోటో తీస్తుంది. తర్వాత, ఈ ఫోటోల అధారంగా ట్యూబ్ లో రాతి పొడి శాంపిల్ నిజంగానే ఉందని, ఇక సీల్ చేయవచ్చని మిషన్ కంట్రోలర్స్ చెప్పగానే సీల్ చేయడం మొదలవుతుంది. సెప్టెంబర్ 6, 12.34 EDT పర్సివరెన్స్ రోవర్ 266 నంబర్ ఉన్న ట్యూబ్ లోని ఈ శాంపిల్ ను సీల్ చేసింది
తర్వాత ఈ ట్యూబ్ ని రోవర్ లోపలికి తీసుకువచ్చి భద్రపరుస్తుంది. ఈ దశలన్నింటిని రోవర్ కెమెరాలు ఫోటో తీస్తూనే ఉంటాయి. ఇదంతా కూడా ఎలా ప్లాన్ చేశారో అలాగే ఒక తప్పిదం లేకుండా పూర్తయింది.
ఇక శాంపిల్ ను భూమికి తీసుకురావాలి (Mars Return Mission MRS). ఎలా? యూరోపియన్ స్పేస్ ఏజన్సీ శాస్త్రవేత్తలతో కలసి ఈ రిటర్న్ మిషన్ కు నాసా ప్లాన్ చేస్తూ ఉంది. ఈ శాంపిల్స్ సేకరణ ఒక ఎత్తయితే, వాటిని భూమికి తీసుకురావడం మరొక ఎత్తు. ఇదెలా జరుగుతుందో కింది వీడియో చూడండి
ఇపుడు పర్సివరెన్స్ రోవర్ జెజెరో క్రేటర్ లోపలి పొరలను కూడా అంగారకుడి చరిత్రకోసం గాలిస్తూ ఉంది. ఒక్కపుడు ఈ క్రేటర్ నీరుండిందనేందుకు ఎలాంటి అనుమానం లేదు. ఆ నీళ్లెంతకాలం ఉన్నాయి, ఏమయిపోయాయనేది ఇపుడు తెలుసుకోవలసి ఉంది. రోవర్ తీసుకొస్తున్న రాతి పొడి, దుమ్ము, గుళక రాళ్లు ఈ రహస్యాన్ని చేధించేందుకే…
జెజెరో గోతిలో ఉన్న నీళ్లని ఈరాళ్లు పీల్చుకుని ఉండవచ్చు. అపుడు నీళ్లలోని లవణాలు (Salts) రాతి స్వరూపాన్ని మారుస్తాయి. లేదానీళ్లు ఆవిరైనపుడు లవణాల అవశేషాలు క్రేటర్ లోనో, రాళ్ల మీద ఉండవచ్చు. అపుడు ఆవశేషాలలో సూక్ష్మ నీటి బుడగలు ఉండవచ్చు. ఈ నీటి బుడగుల ప్రాచీన కాలం టైమ్ క్యాప్య్సూల్ లా పనిచేస్తాయని, అంగారకుడి వాతావరణ చరిత్రను వెల్లడిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.