తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు నేతృత్వంలో జరుగుతున్న అష్టాదశ పురాణాల అనువాద కార్యక్రమం వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి పండిత మండలిని ఆదేశించారు.
శ్వేత భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన పండిత మండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అష్టాదశ పురాణాల్లో ఇప్పటిదాకా నాలుగు పురాణాల అనువాదం పూర్తయిందని, మిగిలిన 14 పురాణాల అనువాద కార్యక్రమం వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిచేయాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే మరింతమంది పండితుల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు.
పండిత మండలి సభ్యులు ప్రస్తుతం నెలకు వారం రోజులు ఈ కార్యక్రమం మీద పనిచేస్తున్నారని చెప్పారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా పండితులను పిలిపించి పురాణాల అనువాద కార్యక్రమం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురాణ అనువాద కార్యక్రమం కోసం తిరుపతికి వచ్చే పండితుల తో పాటు, వారి భార్యకు కూడా ఉచిత వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న గరుడ పురాణం పారాయణానికి విశేష స్పందన వస్తోందని ఈవో చెప్పారు. కోవిడ్ మొదటి ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో నిర్వహించిన సుందరకాండ, భగవద్గీత, విరాటపర్వం పారాయణాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన మండలికి చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పద్దెనిమిది పురాణాలను ప్రసారం చేస్తామన్నారు. పండిత మండలి సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో పురాణాల అనువాదం చేయాలన్నారు. నేటి తరానికి పురాణ, ఇతిహాసాల గురించి తెలియజేసి వారిని సరైన మార్గంలో పయనించేలా ప్రయత్నం చేయడం టిటిడికే సాధ్యమవుతుందని ఈవో జవహర్ రెడ్డి వివరించారు. సనాతన ధర్మ ప్రచారం కోసం పండిత మండలి పురాణ అనువాద కార్యక్రమాన్ని నిర్దేశిత సమయం లోపు పూర్తిచేయాలని ఆయన చెప్పారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ, శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులు రెడ్డి, పండిత పరిషత్ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, శ్రీపాద సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో పండిత మండలి సభ్యులకు శ్రీవారి ప్రసాదాలను అందించారు.