అంధ్రప్రదేశ్ కు అవతరణ దినోత్సవం లేదా?

(బొజ్జా దశరథ రామి రెడ్డి)

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తెలుగు ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 1931 లో మొదలైంది. ఈ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకు రాయలసీమ వాసుల మద్దతు కీలకమైంది.

రాయలసీమ వాసుల మద్దతుకై, రాయలసీమ అభివృద్దికి నిర్దిష్టమైన హామీలతో నవంబర్ 16, 1937 న “శ్రీబాగ్ ఒడంబడిక” రూపొందించడమైనది.

ప్రత్యేక తెలుగు రాష్ట్రంలో శ్రీబాగ్ ఒడంబడిక అమలు జరిగి రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావించి, రాయలసీమ వాసులు ఆంధ్ర నాయకులతో కలసి అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1, 1953 న సాధించుకున్నారు.

తదనంతరం నవంబర్ 1, 1956 లో తెలంగాణతో కలసి అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. జూన్ 2 , 2014 న తెలంగాణ విడిపోవడంతో అక్టోబర్ 1, 1953 ఏర్పడిన తెలుగు రాష్ట్ర భూబాగాల తోనే నేటి అంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలింది.

శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పటికి శ్రీబాగ్ ఒడంబడిక లోని ఏ ఒక్క అంశం అమలు పరచకపోవడంతో రాయలసీమ అభివృద్దికి నోచుకోలేదు.

ఈ నేపధ్యం లో 1953 లో ఏర్పడిన తెలుగు రాష్ట్ర భూ భాగాలతో కొనసాగుతున్న నేటి అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినాన్ని అక్టోబర్ 1 న నిర్వహించమని తెలంగాణా రాష్ట్రం విడిపోయిన నాటి నుండి నేటి వరకు రాయలసీమ వాసులు మరియు ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు.

కానీ గత ప్రభుత్వం తెలంగాణా విడిపోయిన జూన్ 2 వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణా కలసిన నవంబర్ 1 న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో ఏర్పడిన అసలైన అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న గత కొద్ది సంవత్సరాలుగా రాయలసీమ వాసులు మరియు ప్రజాస్వామిక వాదులు నిర్వహిస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అక్టోబర్ 1 వ తేదిన నే అంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలన్న డిమాండ్ ను పాలకుల ముందు నిరంతరం ఉంచుదాం. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడటానికి ఈ చారిత్రక దినోత్సవాన్ని రాయలసీమ వాసులు, అభిమానులు, ప్రజాస్వామిక వాదులు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

బొజ్జా దశరథరామిరెడ్డి 

(బొజ్జా దశరథ రామి రెడ్డి,  అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *