‘దేవుని కోసం కొండలు కోనలు వెతకనవసరం లేదు, మనిషిలోనే ఉన్నాడు’ అని చెప్పాడు గురజాడ! అంటే *గురజాడ నాస్తికుడు కాడు* అని అర్థం. ఆయన దృష్టిలో దేవుడు వేరు మతం వేరు అని భావించాలి. ఎందుకంటే ఆయన మతములన్నియు మాసిపోవును అన్నాడు కానీ దేవుడు లేకుండా పోతాడని చెప్పలేదు. ఆయన దృష్టిలో మతాలు తమ చిత్తం వచ్చిన రీతిలో దేవుణ్ణి వర్ణించి, వక్రీకరించి, విపరీతార్థాలు కల్పించి తాము కాపాడదలుచుకున్న రాజకీయ, సామాజిక, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలకు అండదండలుగా నిలబడ్డాయి.మనకు తెలుసు, చదరంగం ఆటలో ‘ *బిషప్* ‘, రాజును కాపాడే చతురంగబలాలలో ఒకడని!! *రాజు దైవాంశ సంభూతుడు* అని ప్రజలను నమ్మించినది కూడా ఈ మతాలేనని!! 21- 9-2021 గురజాడ 159వ జయంతి సందర్భంగా, మతం గురించి ఆయన చెప్పిన ఒక గొప్ప మాటలోని అంతరార్ధాన్ని తెలుసుకుందాం!
భారతీయ బానిస, ఫ్యూడల్ వ్యవస్థలకు వర్ణ-కుల వ్యవస్థలు సాంఘిక నిర్మాణ రూపంగా వుంటూ వచ్చాయి. మనం నాటి హిందూమతంగా చెప్పుకుంటున్న దానికివి నాలుగో, నాలుగువేల కాళ్ళో లాంటివి. దీనిని అత్యంత స్పష్టంగా నిరసించాడు అంటే నిచ్చెనమెట్ల హిందూ కులవ్యవస్థను గురజాడ పూర్తిగా నిరాకరించాడని అర్థం!
పుట్టుక కారణంగా *అధికులధములు* గా వ్యవహరిస్తున్న సంస్కృతిని గురజాడ తిరస్కరించటమే కాక *“దేశమున కొందరి వెలికి దోసిరి, మలినమే మాల* అనటమే కాక అలా వెలివేయటమే మలినమని ప్రకటించటం ద్వారా వర్ణకుల వ్యవస్థను పలువిధాల సమర్థించుకుంటూ, ఆచరిస్తూ వస్తున్న హిందూమతపు అమానవీయ పార్శ్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టాడు.
*దేవుడు-మతము* పేర్లతో సాగించే కార్యకలాపాల వెనుక బతుకు తెరువుకు పడే పాట్లుంటాయనీ, మతంకన్నా *ఆకలి తీర్చుకోవటం*ల్ మనిషికి ప్రాధమికమైనదని *“మీ పేరేమిటి?”* *“పెద్దమసీదు”* (మతము – విమతము) కథల ద్వారా గురజాడ చెప్పారు. *”కన్యాశుల్కం”* నాటకంలో మత విశ్వాసాలు, ఆచారాల పేర్లతో సాగించే వాటి వెనుకనున్న ఆర్థిక-లౌకిక ప్రయోజనాల సారాన్ని కళ్ళకు కట్టిస్తాడు. ఆవిధంగా తన కవిత్వం – కథలు-నాటకాలలో హిందూ మత వ్యవస్థను కాపాడుతున్న ఫ్యూడల్ సంస్కృతిని బహుముఖాలుగా గురజాడ తూర్పార బట్టాడు.
తనకు స్నేహితుడులాంటి శిష్యుడైన ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన ఉత్తరాలలో బౌద్ధం పట్ల చాలా సానుకూలంగా “బౌద్ధం అణగదొక్క బడినప్పుడు, భారతదేశం మతపరంగా ఆత్మహత్య చేసుకుంది” అంటూఆయన చేసిన వ్యాఖ్య చాలా పరిగణించదగినది. నిచ్చెన మెట్ల హిందూ కులవ్యవస్థ దాని సంస్కృతి పట్ల ఆయనకు గల నిరసనకు కూడా అది నిదర్శనంగా నిలిచే వ్యాఖ్య. ఎందుకంటే ఆయన “ఎల్లలోకము లొక్కయిల్లై వర్ణ భేదము లెల్ల కల్లై” ప్రేమ బంధముతో మానవజాతి వికసించాలని బలంగా వాంఛించాడు. అందుకు అడ్డు వచ్చే, మూఢ మతవిశ్వాసాలూ, సాంఘిక దురాచారాలూ, దేవుని పేరిట వాటి సమర్థనలూ….. అంతం కావాలని తను శారీరకంగా బక్కవాడైనా ఒంటరి వీరుడిలా కలం బలంతో యుద్ధం చేశాడు.
తన సమకాలికులలో భారతదేశంలోనే మరెవరూ చేయని మరొక గొప్ప నిర్ధారణ ఆయన చేశాడు. “మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచివెలుగును అంత స్వర్గ సుఖంబులన్నవి యవని విలసిల్లున్”
భక్తి విశ్వాసాలతో, ప్రార్థనలతో, వివిధ కర్మకాండలతో దేవుని ప్రసన్నం చేసుకొని, ఆయన కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులైతే, ఆ దేవుడు విముక్తిని ప్రసాదించి, మోక్షాన్నిచ్చి, ఆ పిమ్మట స్వర్గ సౌఖ్యాన్ని పొందే ఏర్పాట్లు చేస్తాడని మతాలు మనుషులకొక హామీనిస్తున్నాయి. కానీ గురజాడవారు *మతాలు మాసిపోతే భూమిమీదే స్వర్గ సౌఖ్యాలు విలసిల్లుతాయని* చెప్పాడు. జ్ఞానం ద్వారా మానవులు దాన్ని సాధించుకోగలుగుతారని ఆయన ప్రగాఢంగా నమ్మాడు.
పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా ఇంగ్లాండు – ఫ్రాన్స్ – జర్మనీ – ఇటలీ లాంటి దేశాలలో సంభవించిన పారిశ్రామిక విప్లవం – సాంస్కృతిక, జాతీయ పునరుజ్జీవనం – శాస్త్ర సాంకేతిక రంగాలలో, కళా, సాహిత్యాలలో, మతమూ – తాత్త్విక విశ్వాసాలలో సాగిన సంఘర్షణ, పెనుమార్పులుకి భావ, సామాజిక విప్లవాలకీ కారణమైనాయి. ఫలితంగా ఆధునిక ప్రజాస్వామిక తాత్త్వికత యొక్క బలమైన ప్రభావం గురజాడను సరికొత్త ఆలోచనలకు పురిగొల్పింది. గత చరిత్రలోని సాంఘిక – సాంస్కృతికోద్యమాలు ఏదో ఒక నూతన మత శాఖా చింతనతోనో, దేవుని ఆదేశం పేరుతో, కొత్త వ్యాఖ్యానాలతో ప్రజలను ఆకట్టుకోవటం ద్వారానో సాగాయి. ఫ్రెంచి విప్లవానికి (1789), యూరపులో జరిగిన రాచరిక వ్యతిరేక తిరుగుబాట్లు గతంలో ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ ఆస్థానాల్లో పెద్ద పీఠం వేసుకొని పెత్తనం చెలాయించిన మత వ్యవస్థలను నిరసించినాయి. ఫలితంగా ప్రజాస్వామిక రాజ్యం సూత్రరీత్యా మతానికి అతీతంగా వుండాలని అంగీకారమైంది. మానవ ప్రజ్ఞను, సృజనను, నైపుణ్యాన్ని తృణీకరించి కించపరిచే మతాలకు అతీతంగా, మత ఆలంబన అవసరం లేకుండానే సమస్త జీవనరంగాలపై పెరుగుతున్న ఆధునిక మానవ శాస్త్ర విజ్ఞానాల చైతన్యశక్తితో… మానవులు పురోగమించగలుగుతారని గురజాడ గ్రహించగలిగాడు. తరతరాల మానవ ఆకాంక్షలలో భాగంగా వున్న *ఊహా స్వర్గం*, భూమిపైనా *వాస్తవమై విలసిల్ల గలుగుతుందనే* ఊహను తన విశ్వాసంగా ప్రకటించాడు.
ఫ్రెంచి విప్లవానికి మేధో నాయకత్వాన్నందించిన వాల్టేర్-రూసోలు తమ లక్ష్యానికి అడ్డువచ్చిన మేరకు మతాన్ని తీవ్రంగా నిరసించారు. మతం హేతుబద్ధం, ప్రజాస్వామికo కావాలని చెప్పారు. 1917నాటి సోవియట్ విప్లవానికి ముందూ, తర్వాతా ప్రపంచదేశాలలో చెలరేగిన కార్మిక – కర్షక పోరాటాలూ, వలస సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ పోరాటాలూ, ఇంకా ‘స్వేచ్చ . – స్వాతంత్ర్యమూ- ప్రజాస్వామ్యమూ- సమసమాజా’ల కొరకు జరిగిన అనేకానేక పోరాటాలు ‘మతం’తో నిమిత్తం లేకుండానే జరిగాయి’. కొన్నిసార్లు వలస వ్యతిరేక పోరాటాలు మతం రూపం ధరించినప్పటికీ వాటిసారం ఆధునిక ప్రజాస్వామిక లౌకిక జాతీయతత్త్వమే కాని ‘నూతనమైన ప్రగతిశీల’ మత వ్యవస్థల నిర్మాణం కొరకు కాదు.
రాచరికయుగంలో ప్రజల నిరసన, ప్రతిఘటన రాజకీయాలూ, పాలకముఠాల నడుమ ఘర్షణలూ మతం రూపంలో కూడా వుండేవి. ఐరోపాలో ప్రొటెస్టెంట్ మతం, భారతదేశంలో శైవ, వైష్ణవమతాలూ అలాంటి పాత్రను కూడా పోషించాయి. 19వ శతాబ్దంలో బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ముస్లిం తెగలూ, హిందూ సన్యాసులూ చేసిన తిరుగుబాట్లకు జాతీయ స్వభావం వుంది. ప్రజాస్వామిక యుగంలో విస్పష్టమైన ఆర్ధిక-రాజకీయ సామాజిక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. దానితో మతం యొక్క సామాజిక నాయకత్వపు అవసరం వెనక్కి పోతుంది. ఇదికూడా మతం మసక బారటంలో భాగమే!!
తరతరాలుగా మతమూ దైవవిశ్వాసాలపై, మత ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్న మతవ్యవస్థలు గత నూరేళ్ల నుండీ – ప్రపంచం నలుమూలలా గల అభివృద్ధి నిరోధక దోపిడీ, ఆధిపత్య రాజ్యాల, ఆర్ధిక శక్తుల మద్దతుతో వాటి గుత్తాధిపత్యం కింద బతుకులీడుస్తున్నాయి. పునరుద్ధరింప బడుతున్నాయి. నేటి అమెరికా సామ్రాజ్యవాదం, తన ప్రపంచాధిపత్యానికై సాంస్కృతిక యుద్ధాల పేరుతో, ఇస్లాం ద్వేషాన్ని రెచ్చగొట్టీ, పలురకాల టెర్రరిజాల్ని పోషించీ, మతం సాకుతో తానే ఒక టెర్రరిస్టు మతరాజ్యంగా రాజకీయాలు నడుపుతోంది. క్షీణ సామ్రాజ్యవాద పతన లక్షణాల్ని/ప్రదర్శిస్తోంది. ప్రపంచంలోని సమస్త అభివృద్ధి నిరోధక మత శక్తులకు అండదండలనిస్తూ, వాటి నడుమ పోటీలు, ఘర్షణలు, విద్వేషాలు పెంచుతోంది. అయినప్పటికీ మానవుల చైతన్య పూరితమైన *సమష్టి “జ్ఞానం” అనే వెలుగు* ముందు వెలవెలబోతూ మతాలన్నీ మాసిపోతాయని నూరేళ్ళ క్రితమే గురజాడ చెప్పటం ఆయన దార్శనికతకు నిదర్శనం. శ్రీశ్రీ చెప్పని గురజాడ మేధోవిశిష్టతల్లో ఇదికూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణనలోనికి తీసుకోవాలి.
*“గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్”* అనే భావజాలం సాంప్రదాయక మత పునరుద్ధరణగా మారిందని మనకు తెలుసు. భారత పాలకవర్గాల ‘సర్వమత సమభావం’ మతాన్ని యథాతథ స్థితిలో సాగనిస్తూ మత వినియోగితా వాదమైన (Utilitarian) *కుహనా లౌకిక వాదం* గా రుజువు పరుచుకుంది. మతాన్ని రాజ్యవ్యవస్థకూ, విద్యావిధానానికీ అతీతంగా నిలపగలిగిన నూతన ప్రజాస్వామ్యమే మతంపట్ల నిజమైన ప్రజాస్వామిక దృక్పథాన్ని పాటించ గలుగుతుంది. గురజాడ చాలా దూరదృష్టితో చేసిన నిర్ధారణ అప్పటిదాకా అమలుకాదు.
అయితే “అన్నదమ్ములవలెను జాతులు* మతములన్నీ మెలగవలెనోయ్* “మతం వేరైతేను ఏమోయ్* మనసులొకటై మనుషులుంటే” అన్న వాటికీ పైన పేర్కొన్న “మతములన్నియు మాసిపోవును” అని చెప్పిన దానికీ వైరుధ్యం లేదా? అని అనుమానించేవారు కూడా వుండొచ్చు. నేడు మనుషుల నెత్తికెక్కి ఊరేగుతున్న మతాలు కాలగమనంలో భవిష్యత్తులో ఏదో ఒక నాటికి అంతరించిపోతాయి అని ఆయన దూరదృష్టితో అర్థం చేసుకున్న విషయమది. ప్రకృతి సమాజాల గురించిన మానవుల నిజమైన విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ మతం మసకబారుతూ, క్రమంగా మాసిపోతుందనేది ఆయన అవగాహన. అయితే వర్తమానంలో ప్రజలు విభిన్న మతాలుగా, కులాలుగా చీలి అనైక్యతతో జీవిస్తున్నారు. వారు చెట్టపట్టాల్ పట్టుకొని నడిస్తే గానీ దేశాభివృద్ధి జరగదు. అందరికీ తిండి దొరకదు. దేశీ సరుకులు పెరగవు. కళలు వికసించవు. ఆర్ధిక, సాంఘిక దోపిడీ అణచివేతల నుండి విముక్తి లభించదు. కనుక సమకాలీన వాస్తవ జీవితంలో సమస్త కుల-మతస్తులు దేశప్రగతికి – అనగా మనుషుల ప్రగతికి – ఐక్యంగా కృషి సల్పాలనేది ఆయన తాత్పర్యం. మానవ సమాజ వికాసానికి ఆటంకంగావున్న శక్తులనడ్డు తొలగించుకోగలిగిన చైతన్యమూ, జ్ఞానమూ పెంపొందుతున్న కొద్దీ మతాలు కనుమరుగయ్యే కాలం చేరువవుతుంది. అపుడు సమస్త మానవాళికీ మానవత్వమనే మతమొక్కటే సమ్మతమవుతుంది, అభిమతవుతుంది.
( 2012 ఆగస్టు- సెప్టెంబరు సంచిక ‘ప్రజాసాహితి’ నుండి)