కాషాయం బండి కామారెడ్డి చేరింది. పట్టణంగా కాషాయమయింది. ప్రజా సంగ్రామయాత్ర బిజెపి నేతలు వూహించిన దానికంటే లేదా కనీసం వూహించినట్లో సాగుతూ ఉంది. బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ఉంది. బండి సంజయ్ యాత్ర ఏ వూరు వెళ్లినా జనం విరగబడి వస్తున్నారు. బండి ఏమంత పేరున్న నాయకుడు కాడు, కేవలం ఎంపి మాత్రమే. ఇలాంటి బండిని చూడ్డానికి జనం విపరీతంగా వస్తున్నారు. బిజెపి ఈ జనాన్ని తోలినా, జనం వారంతకు వారే వచ్చినా, గతంలో బిజెపికి ఇంతసీన్ లేదు. తెలంగాణ ఉద్యమం సాగే రోజుల్లో కెసిఆర్ తన సభల కొస్తున్న జనాన్ని చూసి ఒక మాట ఎపుడూ చెప్పేవాడు…
“నేనేమన్నా సినిమాయాక్టర్ నా, నేనేమన్నా సూపర్ స్టార్ నా. శరీరం మీద పట్టమని పది కిలోల మాంసం లేదు. ఇంత జనం వస్తున్నారంటే. అది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల్లో ఉన్న ఆకాంక్ష,’ అని కెసిఆర్ అనే వారు.
ఇపుడు అదే తెలంగాణలో బిజెపియాత్రకు విపరీతంగా జనం వస్తున్నారు. ఎందుకొస్తున్నారో, అర్థం కావాడానికి టైం పడుతుంది. ఈ జనాన్ని, ఈ యాత్రని చూస్తే, ఒకటనిపిస్తుంది, బిజెపికి తెలంగాణలో పాపులర్ లీడర్ లేని కొరత బండి సంజయ్ తీరుస్తున్నాడని.
అదే నిజమయతే బిజెపి కిది కొత్త మలుపు. ఎందుకంటే, ప్రాంతీయ నాయకులు బలంగా ఉన్న రాష్ట్రంలోనే బిజెపి గెలుస్తూ వస్తున్నది. జాతీయ నాయకులు ఎంత లావుగా ఉన్నా, ఎన్ని కిలోల బరువున్నా రాష్ట్రాలలో వాళ్ల ఉపన్యాసాలు అర్థం కావడం లేదు, వాళ్ల ప్రభావమూ లేదు.
మూడు రోజుల కిందట ఇదే విషయాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు యడియూరప్ప చాలా స్పష్గంగా చెప్పారు. ప్రధాని మోదీ పేరు చెప్పి లోక్ సభ ఎన్నికలను గెలవవచ్చేమో గాని, అది అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయదు అని యడియూరప్ప చెప్పారు.
బిజెపికి పూర్వం మేధావులయిన నాయకులుండేవారు. జూపూడి యజ్ఞనారాయణ, వి. రామారావు, ప్రొఫెషర్ శేషగిరిరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు ఇలా… వీళ్ల తర్వాత మంచి పేరున్న దత్తాత్రేయ వంటి నేతలు వచ్చారు. అయితే,కాంగ్రెస్, టిడిపి, టిఆర్ ఎస్ లలో లాగా జనాకర్షణ వుండి, జనాన్ని సమీకరించగల నేతలు రాలేదు. అంటే, ఈ పార్టీకి ప్రాంతీయ నాయకుడు రాలేదింకా. ప్రాంతీయ నాయకుడు వస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టం. యడియూరప్ప చెప్పిందిదే.
ఇపుడు బండి సంజయ్ ఈ కొరత తీరుస్తున్నారా? ఈ ఫోటోల్లో ఉన్న జనాన్ని చూస్తే అది నిజమేమో అనిపిస్తుంది.