చేవెళ్ల నుంచే షర్మిళ పాదయాత్ర, ‘టిఆర్ ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం’

ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ వ‌చ్చింద‌ని, ఉంద‌ని, మేమే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని పాద‌యాత్ర ద్వారా భరోసా క‌లిగిస్తామని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పేర్కొన్నారు

స‌రిగ్గా ఈ రోజు నుంచి నెల రోజుల తర్వాత అంటే అక్టోబ‌ర్ 20వ తేదీన తాను యాత్ర  మొద‌లు పెట్ట‌బోతున్నట్లు ఆమె ప్రకటించారు.

“ఆ  రోజుల్లో  వైయ‌స్ఆర్ గారు మొద‌లు పెట్టిన విధంగానే మేం కూడా చేవేళ్ల‌లోనే ఈ పాద‌యాత్ర మొద‌లు పెడ‌తాం. జీహెచ్ ఎంసీ మిన‌హాయించి మిగ‌తా అన్ని ఉమ్మ‌డి జిల్లాలు క‌వ‌ర్ చేస్తూ దాదాపు 90 నియోజ‌క‌వ‌ర్గాల‌ను తాకుతూ అన్ని పూర్తి చేసుకుని తిరిగి చేవెళ్ల‌లోనే పాద‌యాత్ర‌ను ముగిస్తాం.”అని ఆమె ప్రకటించారు.

ఇంటికో ఉద్యోగ‌మ‌ని కెసిఆర్ చెప్పినా  మోస‌పోయిన నిరుద్యోగులు ఈ రోజు వ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుంటూనే ఉన్నారని. వారి త‌ర‌ఫున పోరాటం చేయ‌డానికి మేం ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నవిషయం గుర్తు చేశారు.

ఈ నెలరోజులలోపు  ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌ని ప‌క్షంలో పాద‌యాత్రలో కూడా ఈ నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తామని హెచ్చరించారు.

“ప్ర‌జ‌ల క‌ష్టాలు వింటూ వారికి మేం ఉన్నామ‌ని, వారి త‌ర‌ఫున పోరాడుతామని వారికి భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని ప్ర‌జ‌ల్లో ఆశ బ‌తికించ‌డ‌మే ఈ పాద‌యాత్ర ముఖ్య ఉద్దేశం,” అని ప్రకటించారు.”

యాత్ర ఉద్దేశం

పాద‌యాత్ర‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ వైయ‌స్ఆర్. వైయ‌స్ఆర్ పాద‌యాత్ర నుంచి పుట్టిన‌వే ఫీజు రీయింబ‌ర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, 108, 104, ఉచిత విద్యుత్ , కోటి ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల‌న్న జ‌ల‌య‌జ్ఞం. వైయ‌స్ఆర్  పాద‌యాత్ర నుంచి పుట్టిందే వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న‌ అని ఆమె వివరించారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే…

ఆయ‌న అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ మేం కూడా అక్టోబరు 20వ తేదీ నుంచి దాదాపు ఏడాది పాటు పాదయాత్ర చేప‌ట్ట‌బోతున్నాం. మా పాదయాత్ర పేరు ‘ప్ర‌జా ప్ర‌స్థాన యాత్ర‌’.

ఈ పాద‌యాత్ర‌లో స‌మ‌స్య‌లు విన‌డం, తెలుసుకోవ‌డ‌మే కాకుండా ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌నుక్కోవ‌డం కూడా పాద‌యాత్ర ఉద్దేశం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విన‌డ‌మే కాకుండా వారికి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని, వారి కోసం పోరాడుతామ‌ని, వారికి భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ఆర్ గారి సంక్షేమ పాల‌న మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని, వారికి ఆశ క‌ల్పిస్తూ .. మా పార్టీ సిద్ధాంతాలైన సంక్షేమం, స‌మాన‌త్వం, స్వ‌యం స‌మృద్ధి అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *