చైనాకు వ్యతిరేకంగా భారత్ ను అమెరికా పావులా వాడుకోవాలని చూస్తోందా !?

(మైత్రేయ భకల్)

సంక్షిప్త అనువాదం : రాఘవశర్మ

అమెరికాకు శాశ్వత ప్రయోజనాలే తప్ప శాశ్వత మిత్రులు ఉండరు. మిత్రులు వస్తారు, పోతారు కానీ, అమెరికా ఆధిపత్యం మాత్రం కొనసాగుతుండాలి.

దాని మిత్రత్వం భూభౌతిక రాజకీయ ప్రయోజనాల కోసమే. దాని సంబంధాలన్నీ దాని అవసరాన్ని బట్టి మారుతుంటాయి. దాని మిత్రత్వం, శత్రుత్వం అనేవి ఎత్తుగడల పైనే ఆధారపడుతూ, నైతికతకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

అవసరాన్ని బట్టి మెత్తగా, కఠినంగానే కాకుండా, క్రూరంగా కూడా వ్యవహరిస్తుంది. ఈ మేరకు అమెరికా తన రాయబారులకు శిక్షణ ఇస్తుంది.

చాలా దేశాలు వాస్తవిక భూభౌతిక రాజకీయాల కోసం వ్యవహరిస్తూ, పాక్షికంగా నైనా మానవ విలువలకోసం పయనిస్తుంటే, కొన్ని దేశాలు అమెరికాలా నీతి నియమాలనన్నిటినీ ఒదిలేసి వ్యవహరిస్తున్నాయి.

ఇలాంటి చర్యల వల్ల చాలా మంది పౌరులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి విషయాల పైన అమెరికా నాయకులకు ఏ మాత్రం విచారం లేదు.

అక్కడి అధికార వర్గం తమ దేశ ఆధిపత్యాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఎన్ని నగరాలను నాశనం చేశారో, ఎంతమంది పిల్లలను చంపారో లెక్కేలేదు. బ్రిటన్ నుంచి నాజీ జర్మనీ వరకు సాగిన పశ్చిమ దేశాల తరహా విలువల ప్రాతిపదికగానే అమెరికా విదేశీ విధానం రూపుదిద్దుకుంది.

వ్యవస్థీకృత జాతి వివక్ష, సాయుధ దురాక్రమణ, లక్ష్యాలు సాధించడానికి మారణ హెూమానికి పాల్పడడం, ఇతర దేశాలపై అపనమ్మకం, భిన్నాభిప్రాయాలను గౌరవించకపోవడం, నాగరికత రూపంలో కపటత్వం వంటివి అమెరికా విదేశీ విధానంలో ప్రధానమైనవి.

కొన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను అమెరికాకంటే ఎక్కువగా అతిక్రమించడం ఆశ్చర్యమేమీ కాదు. అమెరికా అంతర్జాతీయ చట్టాలనే కాదు, తన చట్టాలను కూడా అతిక్రమిస్తుంటుంది.

అంతర్జాతీయంగా అమెరికాకు గౌరవం ఉన్నప్పటికీ, శతాబ్దాలుగా తాను ఇచ్చిన హామీలను, చేసుకున్న ఒప్పందాలను అతిక్రమించింది. అమెరికా అధినేతల్లో ఒకరైన హెన్రీకి సింజర్ క్రూరత్వంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

అమెరికా తన మిత్రపక్షాలను తరచూ మార్చేస్తుంటుంది. కొత్త స్నేహితులను కొనుక్కుంటుంది. ఒకప్పుడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన సద్దాం హుస్సేన్ ను అమెరికా అంతమొందించింది. తాలిబన్లలోని ఒక వర్గానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసి, సమర్థించింది.

ఆఫ్ఘనిస్తాన్ పై దండయాత్రలో అదే తాలిబన్ అమెరికాను ఓడించింది.  సోవియట్ యూనియన్ సాయం చేసి, సాయుధ శిక్షణ ఇచ్చి, ఆయుధాలను సమకూర్చి, ఒసామా బిలాడెన్ వంటి వారిని పెంచి పోషించింది.

పాముకు పాలు పోస్తే కాటేసినట్టు, అమెరికా సాయం చేసిన శక్తులే అమెరికా పైన 2001 సెప్టెంబర్ 11వ తేదీన దాడి చేసి, మూడు వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి.

దశాబ్దాల తరబడి తమ దేశాలలో మారణ హెూమాన్ని సృష్టించి, కోట్లాదిమంది ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా ఆ దాడి జరిగింది.  ప్రపంచంలో అత్యంత సంపదకల భారత దేశానికి ఐరాపా వారు సముద్ర మార్గాన్ని కనుగొన్నప్పుడు సగటు అమెరికా పౌరులు భారత దేశంలోని యోగా గురించి తెలుసుకోవడం, కామసూత్రాల గురించి వ్యంగ్యోక్తులు విసరడం మినహా ఈ దేశం గురించి వారికి పెద్దగా ఏమీ తెలియదు.

భారతదేశ మంటే ఒక‌పు్ప‌డు అమెరికా విధానరూపకర్తలకు కాస్త గౌరవం ఉండేది. వాషింగ్టన్లో విధాన రూపకర్తలలో భారత వ్యతిరేక జబ్బు క్రమంగా వ్యాపింపచేశారు.

ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న 1970 నాటి కాలం అది. భారత దేశంలో “సామూహిక దుర్భిక్షం” రావాలని నిక్సన్ ప్రకటిస్తే,  భారతీయులు ….. కొడుకులు” అని కిసింజర్ తిట్టిపోశాడు.

చైనాకు ఒక ప్రధాన ఆటంకం లాగా, దానికి వ్యతిరేకంగా, అమెరికా ఆయుధాలకు మార్కెట్ గా, అమెరికా ఉత్పత్తులకు ముఖ్యమైన మార్కెట్ గా, లాభాలకు మూలంగా, మానవవనరులను దిగుమతి చేసుకునే కేంద్రంగా భారత దేశం ఉపయోగపడాలని అమెరికా ఆశిస్తోంది.

నిక్సన్ పాలనా కాలంకంటే భారత అమెరికా సంబంధాలు ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. చైనా వల్ల గతంలో ఎప్పుడూ లేనంత సాన్నిహిత్యం అమెరికా భార‌త్ మ‌ధ్య ఏర్పడింది.

తమ పూర్వ పాలకుల లాగానే నేటి అమెరికా అధికారులకు కూడా జాతి విద్వేషం ఇప్పటికీ ఉంది. భారత చైనా దేశాల మధ్య నిర్ధారణ జరగని సరిహద్దుల వల్ల 2020లో వివాదం తెలెత్తింది.

రెండు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి జరిగిన ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించింది. చైనాపట్ల వ్యతిరేకతతో భారత-చైనాల మధ్య ఉన్న విభేదాలను అమెరికా ఉపయోగించుకోవాలనుకుని, ఆ ఆనందంతో ఎగిరి గంతేసింది.

దక్షిణ చైనా సముద్రంలో దాని “దురాక్రమణ”ను భారత సరిహద్దులలో చైనా చర్యలతో పోల్చి చైనీయుల “యుద్ధభేరి”గా దాన్ని అభిర్ణించింది.

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా 800 మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న విషయం లోకానికి తెలియంది కాదు. భారత-చైనాల మధ్య మధ్యవర్తిత్వం నెరుపుతానని డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు భారత దేశం లోలోన సంతసించినప్పటికీ, ట్రంప్ ప్రతిపాదనను ఈ ఇరు దేశాలూ సున్నితంగా తిరస్కరించాయి.

అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత దేశంలో ఉన్న చైనా వ్యతిరేక ముఠా ‘ఖ్వాద్స‌ను అమెరికా పునరుద్ధరించింది.

భారత్ అంటే ఇప్పటివరకు పెద్దగా ఇష్టం లేని అమెరికాకు, ఇప్పుడు ఎంతో ప్రీతిపాత్రమైన ప్రియురాలిగా అక్కున చేర్చుకుంటోంది. పాత పగలుపోయి, చైనా వ్యతిరేకతకు భారత దేశాన్ని ఒక పావులా వాడుకుంటూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆధిపత్య దేశాలు అంత తేలిగ్గా, అంత తొందరగా ఇతర దేశాలకు గౌరవించవు.

ఇటీవల వ్యాపించిన కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోడానికి భారత దేశానికి వ్యాక్సిన్, ఇతర వైద్య సమాగ్రి అవసరమైనప్పుడు, అమెరికా వద్ద అవి మిగులు ఉన్నప్పటికీ భారత్ కు సాయం చేయలేదు.

వాక్సిన్ కాలపరిమితి తీరిపోయి వృథా అయిపోయినా పరవాలేదు కానీ విదేశాలకు: ముఖ్యంగా తన మిత్ర దేశాల‌కు కూడా సరఫరా చేయలేదు.

తన దేశంలో మేధావులు, రాజకీయ నాయకుల నుంచి విమర్శలు రావడంతో వాటి సరఫరాకు అంగీకరించింది. అమెరికా భారత దేశానికి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో దీని వల్ల స్పష్టమవుతోంది.

ప్రాణాధార మందులను, వైద్యపరికరాలను ఇలా ఆలస్యం చేయడం దాని క్రూరత్వ లక్షణమే కానీ, మిత్రపక్షాలకు సాయం చేయాలన్న ఆలోచన దానికి ఏ కోశానా లేదు. తాజా సంఘటన వల్ల అమెరికా అసలు రంగు బైట పెడుతోంది.

చైనా పైన తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి దక్షిణ చైనా సముద్రంలో ‘నౌకల స్వేచ్ఛావిహారాన్ని’ నిర్వహించాలని తన నౌకాదళాన్ని ఆదేశించింది.

ఇది గొరిల్లా యుద్ధాన్ని పోలి ఉంది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించే ఇది జరుగుతోందని నమ్మబలికింది. ఆశ్చర్యకరంగా భారతదేశ ఆర్థిక మండలి పరిధి’లోకి అనుమతి లేకుండా ప్రవేశించింది.

భారత దేశ అనుమతి తీసుకోకుండానే మన జలాశయాలలో బహిరంగంగా ఏడవ నౌకా విన్యాసాలను నిర్వహించి, “నౌకాయాన హక్కులు, స్వేచ్ఛ” తమకుందని సమర్థించుకుంది.  చైనాతో ఉపయోగించిన భాషనే భారత దేశం పట్ల కూడా ఉపయోగించింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

తన కోసం ‘ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల’ (యుఎన్‌సీఎల్‌ఓఎస్)ను కూడా మార్చాలని భావిస్తోంది. అమెరికా కనుక భారత్ దేశం పట్ల ఇలా విచక్షణా జ్ఞానం లేకుండా వ్యవహరిస్తూ పోతే పశ్చిమ దేశాలకు కూడా మనం చులకనై, అవి కూడా అలా వ్యవహరించే ప్ర‌మాదం లేక‌పోలేదు.

భారతదేశం తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని క్వారన్ టైన్ లేకుండా ఐరోపా సమాఖ్య తమ దేశాల్లోకి అనుమతించడం లేదు.  కోవీ షీల్డ్ కూడా వైద్యపరంగా ఐరోపాలో తయారుచేసే వాక్సిన్ తో సమానమైనదే.

కేవలం భారతదేశంలో తయారయ్యిందనే ఒకే ఒక్క సాకుతో ఈ ఆంక్షలు విధించారు.  యూరప్ దేశాల వారు కూడా భారత దేశానికి వచ్చినప్పుడు వారిని మనం కూడా తిరస్కరిస్తే 15 ఐరాపా దేశాల వారు ఎంత బాధపడ్డారో!

రష్యా నుంచి ఎస్-400 మిస్సైళ్ళ‌ను భారత్ దిగుమతిచేసుకున్నప్పుడు అమెరికా ఎలా వ్యవహరించిందో చూద్దాం.  టర్కీ, చైనాలు ఎస్-400 ను కొనుగోలు చేయడానికి గతంలో అనుమతించింది.

ఈ ఏడాది చివరికి భారత దేశం వాటిని దిగుమతి చేసుకునే సమయానికి అనుమతిస్తుందా, లేదా అన్నది ప్రశ్నే.  ఒక వేళ అనుమతిస్తే, అమెరికా-చైనాల మధ్య జరిగే భూభౌతిక రాజకీయ క్రీడలో భారత దేశం పావుగా ఉపయోగపడుతుందనేది ఒక సూచన.

ఒక వేళ అనుమతించకపోతే రష్యా వ్యతిరేకతను రుజువు చేసుకున్నట్టవుతుంది. ఒక సంఘటన తరువాత మరొక సంఘటనతో అమెరికా భారతదేశాన్ని ఒక జాతిగా కాకుండా చైనాకు వ్యతిరేకంగా అది చేసే హైబ్రిడ్ యుద్ధంలో ఒక పావుగా వాడుకోవాలని చూస్తోంది.

చుట్టుముట్టిన మంటలమధ్య అమెరికా పెట్టే గొంతెమ్మ కోర్కెలను భారత దేశం వంటి దేశాలు గమనిస్తున్నాయి. వియత్నాం కూడా ఈ మధ్య అమెరికాను చూసి ఆశ్చర్యపోతోంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా మిత్రపక్షాలను అన్వేషించడంలో భాగంగా అప్పుడప్పుడూ వాటికి బహుమతులను కూడా ఇస్తోంది.

(rt.com సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *