కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగుచట్టాలు రైతులకు సంబంధించిన సమస్యకాదని, దేశంలోని 130 కోట్ల ప్రజానీకం సమస్య అని ప్రముఖ సామాజిక విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఆదివారం మంగళగిరి నగరంలోని శ్రీ మార్కండేయ పద్మశాలీయ కళ్యాణమండపంలో చైతన్య సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రజాకవి గోలి మధు రచించిన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి పుస్తకాన్ని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. తొలి ప్రతిని రేకా సామ్రాజ్యంకు అందజేశారు.
అనంతరం లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ… కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత పది నెలలుగా రైతులు అపారమైనటువంటి త్యాగాలు చేస్తూ ప్రతిష్టాత్మకమైనటువంటి వీరోచిత పోరాటం చేస్తున్నారు. దేశ రైతాంగాన్ని, వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి సాగిస్తున్న ఉద్యమానికి, పోరాటానికి తన కలాన్ని జోడించి యువకవి గోలి మధు నిర్విరామంగా కవితలు రాసి ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.
మంగళగిరి అనగానే అమరజీవి వేములపల్లి శ్రీకృష్ణ గుర్తొస్తారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవోడా..అంటూ ఆయన రచించిన ఆ గేయం తెలుగుజాతిని నాడు, నేడు, భవిష్యత్తులోనూ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి జాగృతిని చేకూర్చేటువంటింది. ఆ మహానుబావుడు కదలాడినటువంటి ప్రాంతమిది. ఇక్కడనుంచే శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రాతినిధ్యం వహించి రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, దోపిడీకి గురైన ప్రజానీకానికి కొండంత అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిత్వంగల మంచి నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ అని గుర్తుచేశారు. ఆయనకు నిజమైన వారసుడిగా గోలి మధును తాను భావిస్తున్నానని లక్ష్మీనారాయణ చెప్పారు. రైతాంగ సమస్యలపైన, నేడు జరుగుతున్న ఉద్యమంపైన స్పందించి తన కలాన్ని ఎక్కుపెట్టి ఒక సామాజిక స్పృహను రగిల్చినటువంటి యువకవి గోలి మధు అని కొనియాడారు. మధు గుండె చప్పుడే రైతాంగ గుండెచప్పుడుగా, ప్రజాస్పందనగా భావిస్తున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా నాయకుడు కంచర్ల కాశయ్య ‘రైతు సమరభేరి’ పుస్తక సమీక్ష చేశారు. రైతు అభ్యుదయ గేయాలను ఆలపిస్తూ సమీక్ష ఆసక్తికరంగా కొనసాగించారు.
సభకు అధ్యక్షత వహించిన మానవ వికాసమండలి అధ్యక్షుడు రేకా కృష్ణార్జునరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా ప్రజాకవి గోలి మధు ఏకధాటిగా వందకు పైటా కవితలు రాయడం అరుదైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రగతి శీల మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.గంగాభవాని ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడి ఉద్యమ తీరుతెన్నులను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాలకుల తీరును దుయ్యబట్టారు.
రాజధాని అమరావతి ఉద్యమ మహిళా జేఏసీ నాయకురాలు వరలక్ష్మి నేతృత్వంలో పలువురు మహిళారైతులు పుస్తకావిష్కరణ సభకు హాజరై సాగుచట్టాలపై రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
సభలో మంగళగిరి నగర ప్రముఖులు, పుస్తక ముద్రణ దాత దామర్ల కుబేరస్వామి, ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి పుస్తక రచయిత గోలి మధు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకర్, సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మంగళగిరి జేఏసీ కన్వీనర్ ఎండీ యూసుఫ్, ప్రగతి శీల న్యాయవాదుల వేదిక జిల్లా కన్వీనర్ శిఖా సురేష్ బాబు, విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు, ప్రజాకళాకారుడు సందుపట్ల భూపతి, యువ కవయిత్రి వాసి జ్యోత్స్న, గోలి సౌమ్య, మంగళగిరి చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనుంజయరావు, కార్యదర్శి అల్లక తాతారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో మంగళగిరి విశ్వశాంతి కళాపరిషత్ కళాకారులు ప్రదర్శించిన ‘మతసామరస్య ప్రబోధం’ మూకీ నాటిక సందేశాత్మకంగా సాగింది.