మిగతా లోహాల్లాగా కాకుండా, ఒక సారి భూమినుంచి తవ్వితీసిన తర్వాత ఏ మాత్రం చెక్కుచెదరని లోహం బంగారమే. వెయ్యేళ్లో రెండు వేల యేళ్ల కిందటో తవ్వితీసినా అది ఉన్నచోటే చెక్కుచెదరకుండా ఉంటుంది, లేదా ఒక ఆభరణం నుంచి మరొక రూపంలో మారి ఉండవచ్చు. మానవుడు మొదట సంగ్రహించిన లోహాలలో బంగారం ఒకటి. బంగారాన్ని సేకరించడం సులువు. ఎందుకంటే, ఇది ఇతర లోహాలతో కలసి పోయి ఉండదు. అందుకే విస్తారంగా వెలికి తీసి, వినియోగించాడు. 5000 సంవత్సరాల కిందట తయారుయిన బంగారు వస్తువులు ఈజిప్లు పిరమిడ్లలో కనిపించాయి.
అందువల్ల ప్రపంచంలో ఎంత బంగారుందో నిపుణులు అంచనా వేయలగలిగారు. ఒక అంచనా ప్రకారం, మనిషి ఇంతవరకు 197,576 టన్నుల బంగారాన్ని తవ్వితీశాడు. ఇందులో మూడింట రెండు వంతుల బంగారాన్ని 1950 తర్వాతే వెలికి తీశారు.
భూమ్మీద ఉన్న బంగారాన్ని ఔన్స్ సైజు (28.3495 గ్రాములు) ముక్కలు చేసి ఒక దాని పక్కన ఒకటి క్యూబ్ లాగా అమర్చితే, అది 21 మీటర్ల ఎత్తున్న దిమ్మె పరిమాణంలో ఉంటుంది.
మొత్తం ఇంతవరకు సేకరించిన బంగారంలో 47 శాతం అంటే 92,947 టన్నలు ఆభరణాల రూపంలో ఉంది. ప్రవేట్ ఇన్వెస్టు మెంట్ రూపంలో 21.6 శాతం, 42,618 టన్నులు నిల్వ ఉంది. ప్రభుత్వాల దగ్గిర 33,919 టన్నలు అంటే 17.2 శాతం నిలువ రూపంలో ఉంది. మరొక అంచనా ప్రకారం భూమిలో ఇంకా నిల్వ వున్న బంగారు కేవలం 54,000 టన్నులే.
ప్రతి సంవత్సరం 2500 టన్నుల నుంచి 3000 వేల టన్నుల భూమినుంచి బంగారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికయితే, బంగారు ఉత్పత్తి పెరుగుతూను ఉన్నా, ముందు ముందు అది స్థిరపడబోతున్నది. గనుల నుంచి బంగారు తవ్వి తీయడం చాలా అంశాల మీద అంటే బంగారు ధర, బంగారు సేకరణలో వాడే యంత్రపరికరాల ధరలు, ఇతర ఇన్ పుట్ దరలు మొదలైనవాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
బంగారు గనుల యజమానులు భూమిలో ఉన్న బాంగరు నిల్వలను రెండు రకాలు వర్గీకరిస్తారు. ఒకటి, వెంటనే తవ్వితే గిట్టుబాటయ్యే బంగారు నిల్వలు, ముందు ముందు ధరలు పెరిగినపుడు గిట్టుబాటయ్యే నిల్వలు.
1970 నుంచి బంగారు ఉత్పత్తి మూడింతలు పెరిగింది. ఏటా బంగారు కొనుగోళ్లునాలుగింతలు పెరిగాయి. పూర్వం బంగారాన్ని ఆభరణాల కోసమే కొనే వాళ్లు. ఇపుడు బంగారును రకరకాల ప్రయోజనాలకోసం కొంటున్నారు. బంగారు వినియోగం అభరణాల నుంచి ఎలెక్ట్రానిక్ పరికరాల దాకా, రిజర్వు బ్యాంక్ నిల్వల దాకా, ఇన్వెస్ట్ మెంటు దాకా విస్తరించింది.
బంగారు డిమాండ్ పశ్చిమ దేశాలలో కంటే తూర్పు దేశాలలోనే ఎక్కువ. సాంస్కృతిక బంగారానికి తూర్పుదేశాలలో చాలా ప్రాముఖ్యం ఉండటమే దీనికి కారణం.
2016 నాటి లెక్కల ప్రకారం, ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేదేశం చైనా. మొత్తం ఉత్పత్తిలో చైనా వాటా 14 శాతం. ఏసియాలో మొత్తంగా 23 శాతం బంగారు ఉత్పత్తవుతుంది. సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా 17 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్తర అమెరికాలో 16 శాతం బంగారు ఉత్పత్తి అవుతుంది. సుమారు 19 శాతం బంగారం ఆఫ్రికా గనుల నుంచి నుంచి వస్తున్నది.సిఐఎస్ (Commonwealth of Independent Nations) నుంచి 14 శాతం ఉత్పత్తి అవుతున్నది.
బంగారు స్వచ్ఛతను దానితో పాటు కలసి ఉన్న ఇతర లోహాల అధారంగా నిర్ణయిస్తారు. బంగారు మోతాదు వేయి యూనిట్లలో చెబుతారు. ఉదాహరణకు ఒక బంగారు వస్తువులో 885 పాళ్ల బంగారు, 115 పాళ్ల ఇతర లోహాలున్నపుడు ఈ బంగారు స్వచ్చత 885-ఫైన్ (885-Fine)అని చెబుతారు.
ఇక క్యారట్ (Karat)అనేది బంగారు స్వచ్ఛతకు మరొక కొలమానం. ఇది 24 పాయింట్ల స్కేల్. 14 క్యారట్ల బంగారం (14K Gold)అంటే ఈ బంగారులో 14 పాళ్ల బంగారం, 10 పాళ్ల ఇతర లోహాలు (వెండి, కాపర్)కలసి ఉన్నాయని అర్థం.
క్యారట్లు రెండు రకాలు
బంగారు క్యారట్ (Karat),వజ్రాలు తదితర విలువైన రాళ్లను కొలిచే ప్రమాణమయిన క్యారట్ (Carat) వేరు. దీనిని గురించి మరొక సారి తెలుసుకుందాం.