యాదున్ననా ‘నేను కళ్ళాన్ని’

యాదున్ననా ‘నేను “కళ్ళాన్ని’

 

కాకం అంజన్న
యాదున్ననా” నేను కళ్ళాన్ని”
గుర్తున్ననా “వడ్ల కళ్ళాన్ని”
కూలి నాలీలకు” బువ్వ కుండని”
అన్నదాతలకు “మట్టి కంచాన్ని

చలికపార నన్ను
మలిచే చందమామ రూపంగా
పొరక నన్ను శుద్దిజేసే
ఒళ్ళంతా శుబ్రం గా
కళ్ల మంతా కలతిరిగి
రాళ్లు రప్పలు లేకుండా
ఈత తట్ట ఒడ్డుకేసే
మట్టి పెడ్డ మిగులకుండా
చిక్కగా అలుకు పూసి అద్దమోలే నన్ను జేసి
పేడ నీళ్లతోటి నాకు స్నానమాడించగా
కళ్ళమయ్యి నాడు కల కల మురిసిన
కలతప్పిపోయి నేడు వెళ వెళ బోతున్న

ఈత వంపులల్ల తిరిగి
పచ్చి కమ్మ కోసుకొచ్చి
నీళ్లల్లో నానవెట్టి
కమ్మ తీల్చి కట్లు చేసి
కోసినంక వరి సేను
మెదలు పేర్చి మోపు కట్టి
అమ్మలు అక్కలు నెత్తిన
సుట్ట బట్ట గట్టిగ కట్టి
వరము మీద కాలు
బెనకాకుండ నడవంగ
మోసుకొచ్చిన మోపులల్ల
వరికుప్ప తొక్కంగా
పంట నూర్చి, పొతము చేసిన నేను పచ్చి బాలింతని
రాసిపోసిన గింజలకు నేను “కన్నతల్లిని.”

సుక్క పొద్దున నిద్ర లేసి
పశులకు లెంకలు కట్టి
తలకు రుమాలు చుట్టి
నిండు కుప్ప పగుల కొట్టి
పిండోలే వెన్నెల మ్మ
తోడు వెంట నడుస్తుంటే
పశులవెనక పొరగాళ్లు
బంతి సుట్టు తిరిగేది
నిండు కంకులల్ల రాలి
గడ్డికింద దాక్కొంగా
పడుగు మీద గడ్డి ఎదిరి
పంట రాసి పోయంగా
పచ్చని పంది ట్ల అక్షింతలు చల్లి నట్టు
వెలిగి పోతిని నేను కొత్త పెళ్ళి కూతురులా

ఆవు పేడతీసుకొచ్చి
పొలికాన్ని జేసి
పంట చేల్లు కోసెటి
కోడవళమ్మను తోడు జేసీ
బొడ్డే పోసిన రాసి మీద
పెట్టినట్టి గుర్తులు
పంట బర్కత్ పెరగాలని
మొక్కుకున్న మొక్కులు
వడ్లు తూర్పు పట్టుతుంటే
రాగమెత్తిన పాటలు
వరసకలిపి మాటలాడె
బావ మర్దళ్ల కొంటె మాటలు
ఒక్కరూపాయి ఆశ పెడితే
పొద్దంత వడ్లు నింపి
తూర్పు చాట్లు అందించే
చిన్నపిల్లల చిన్ని జ్ఞాపకాలు
ఒక్కొక్కటి యాదికొచ్చికళ్ళ నీళ్లు రాల్చుతున్న
రైతన్నతో బంధాన్ని నెమరేసుకొంటున్న

అన్నదాతకు వంగి వంగి
దండాలు పెట్టిన
గంగిరెద్దు ఆటజూసి
బిచ్చమేసి తోలిచ్చిన
నేమలి కట్ట పట్టుకొని
ఊరూరు తిరిగేటి
పక్కీరు సాబుకు
జోలె నింపి పంపిన
చాకలోళ్లు , మంగలలోళ్లు
కుమ్మరాళ్ళ కమ్మరోళ్లు
పని పాటలోళ్ల పిలిషి
కడుపు ఆకలి తీర్చిన
కూలీ నాలి కుండల్లో మెతుకులు నేను
పేద సాద గుడిసెల్లో సద్ది బుక్కను నేను

ఎడ్ల బండి ఎదురు పోనక
తొనకంగా వడ్లు నింపే
వడ్లు కోలిసే కుండ
నన్న ఎడబాసింది
పంట రాసిమీద
రాజోలే కూసున్న
పొలికానీతో నాకు
బంధం తెగిపోయింది
సేను కోసే యంత్రం
పల్లేకు అడుగు వెట్టింది
ఇనుప కోరల రాకాసి
నన్ను గాయ పర్చింది
కళ్లనీరు పెడుతుంటే రైతన్న కళలకొచ్చి
యాది జేస్తున్న జెర గతం గుర్తుకొచ్చి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *