ఊరేగింపు (కవిత)

ఊరేగింపు

అర్ధరాత్రి మెలకువలో
ఆర్ద్రతా రాగంలో
అశాంతి గీతాల
ఒక పలవరింత
ఏదో కలవరింత
ఛిద్రమైన దేహాల అస్పష్ట రూపాలు
భళ్లుమన్న హృదయాల మౌన రోదనలు
అస్తిత్వం కోల్పోయిన
అస్థిపంజరాలు
ఇళ్లు లేని వీధిలో
వీధుల్లేని ఊరిలో
ఊరేగుతున్నాయి

ఎండిపోయిన ఏటిలో
పోటెత్తిన కన్నీళ్లు
పోటెత్తిన కన్నీట
మేటేసిన బతుకులు
తీరని కోర్కెల
తోరణాల రెపరెపల నీడలో
అస్తిత్వం లేని
అస్థిపంజరాలు
జనం లేని చోటులో
పెంజీకటి పేటలో
కర్కశ కంచుకోటలో
ఊరేగుతున్నాయి

– కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *