వైఎస్ ఆర్ లబ్దిదారులంతా ముఖం చాటేశారు, ఎందుకో తెలుసా?

హైదరాబాద్‌ లో నిన్న రాత్రి జరిగిన   YSR సంస్మర ‘ఆత్మీయ సభ’ కు ఆశించినంత స్పందన రాలేదు. వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి లబ్దిదారులెవరూ రాలేదు. చాలా తక్కువ మందే వచ్చారు. వచ్చిన వాళ్లలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లంతా రాజకీయంగా క్రియాశీలంగా లేరు. వాళ్లెరూ విజయమ్మ ‘తెలంగాణ మిషన్ ’కు డైరెక్టుగా పనికిరారు.

వైఎస్ ఆర్ ఆత్మగా పేరున్న  KVP రామచంద్రరావు,  అపుడు మంత్రిగా పని చేసిన రఘువీరారెడ్డి,  ఆరోజుల్లో ఎంపిగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ లు వచ్చిన వారిలో అంత్యంత రాజకీయ  ప్రముఖులు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేతలు గోనె ప్రకాష్, బిజెపి  నేత కూన శ్రీశైలం గౌడ్, కంతేటి సత్యనారాయణ రాజు, రామచంద్రమూర్తి, మాజీడిజిపి  దినేష్ రెడ్డి, రిటైర్డ్ ఐపిఎస్  ప్రభాకర్ రెడ్డితో పాటు శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, డివి  సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, బండారు శ్రీనివాస్, జంధ్యాల రవి శంకర్ , మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి లు మిగతా వారిలో ఉన్న ప్రముఖులు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిజెపి నేత ఎపి జితేందర్ రెడ్డిలు మాత్రం క్రియాశీలంగా ఉన్న రాజకీయ నాయకులు. వీరిద్దరు వైఎస్ ఆర్ తెలంగాణలోకి వచ్చే అవకాశం లేదు. వారిద్దరు షర్మిల పార్టీని ప్రమోట్ చేసే అవకాశం కూడా లేదు.

వైఎస్ ఆర్ చనిపోయి పుష్కరకాలం అయిపోయాక  విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. అది కూడా తెలంగాణలో ‘వైఎస్ ఆర్ తెలంగాణ’ అనే పార్టీని  కూతరు షర్మిల ఏర్పాటు చేయడం,  దానికి ప్రచార కర్తగా విజయమ్మ వ్యవహరిస్తూ ఉంటున్న నేపథ్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

అంటే ఇపుడు జరిగిన ఆత్మీయ సమ్మేళనం జరపడానికి, షర్మిల తెలంగాణ రాజకీయప్రవేశానికి  సంబంధం లేదని చెప్పలేం.

ఈ సమావేశం వైఎస్ ఆర్ సంస్మరణ కంటే వైఎస్ ఆర్ కూతురు రాజకీయ పార్టీకి మద్దతు కోరడమే ముఖ్యమనిపించే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఈ కారణం చేతనే రాజకీయాల్లో ఇపుడు క్రియాశీలంగా ఉన్న వాళ్లెవరూ ఈ సమావేశానికి రాలేదు.

‘వైఎస్ ఆర్ ఆత్మీయ సమ్మేళనం’ అని చెప్పినా, అసలు ఉద్దేశాన్ని అది కప్పిపుచ్చలేకపోయింది.  కాబట్టి  వైఎస్ఆర్ దాతృత్వం నుంచి ఆర్థికంగా, రాజకీయంగా లబ్దిపొందిన వారెవ రూ ఈ సమావేశానికి వచ్చే సాహసం చేయలేదు.

2004 నుంచి 2009 దాకా వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు  ప్రభుత్వం స్కీములను, స్కాములను ఉపయోగించుకుని లబ్దిపొందిన  వారు ఆంధ్ర తెలంగాణలలో వేల సంఖ్యలో ఉన్నారు.

మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలు అయ్యారు. కార్పొరేషన్ ఛెయిర్మన్ లు అయిన వారున్నారు. అలాగే వైఎస్ ఆర్ రాజకీయ వితరణల వల్ల కాంట్రాక్టులు పొందినవారు,  మైనింగ్ (Mining) లీజులు పొందినవాళ్లు, ఎస్ ఇజడ్ (SEZ) లు పొందిన వాళ్లతో  కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలను అనుభవించిన వాళ్లూ ఉన్నారు.

వారెవరూ  ఈ సమావేశానికి రాలేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇది షర్మిల పార్టీని ప్రమోట్ చేసేందుకు జరుగుతున్న బహిరంగ  ప్రయత్నమనే విషయం  చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.ఇది అందరిని భయపెట్టి ఉండవచ్చు.  లేదావాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. ఇపుడు వైఎస్ ఆర్ అంటూ కూర్చున్నచెట్టును నరుక్కోలేరు. రాజకీయాల్లో లబ్దియే ముఖ్యం, లాయల్టీ తర్వాతే.

ఎందుకంటే, రాష్ట్ర విభజన తర్వాత, వైఎస్ ఆర్ వారసత్వం అంటూ ఆంధ్రలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  తెలంగాణలో వైఎస్ ఆర్ అభిమానులు వివిధ పార్టలలో ఉండిపోయారు. అలాంటపుడు వారంత షర్మిలను రాజకీయంగా ప్రమోట్ చేసేందుకు ముందుకెలా వస్తారు? ఇదే విజయమ్మ సమావేశానికి ఆశించినస్థాయిలో వైఎస్ఆర్ లబ్దిదారులు రాకపోవడానికి కారణం.

వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు మాజీ ఐఎఎస్ లు, మాజీ ఐపిఎస్ లు, కొందరు సీనియర్‌ జర్నలిస్ట్‌లు, పారిశ్రామికవేత్తలు హైటెక్స్‌ సమావేశానికి వచ్చారు. వీళ్లతో పాటు రాజీవ్ త్రివేది, వైఎస్ ఆర్ వల్ల రాజ్యసభ్యత్వం పొందిన గిరీష్ సంఘి , నవయుగ సీవీ రావు, ఎపి జితేందర్ రెడ్డి విచ్చేశారు.

వీరెవరూ తెలంగాణ లో షర్మిల రాజకీయ లక్ష్యం నెరవేర్చేందుకు పనికిరారు.

ఆంధ్రలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతమయ్యేందుకు విజయమ్మ చాలా తీవ్రంగా కృషి చేశారు. సాధారణ గృహిణిగా ఉంటూ వచ్చిన విజయమ్మ వైఎస్ మరణం తర్వాత రాజకీయ పాత్ర పోషించడం మొదలుపెట్టారు. నోరు విప్పేందుకు మొహమాట పడుతూ వచ్చిన తెలుగు ఇల్లాలు  మెల్లిగా ఓదార్పు యాత్రల్లో పాల్గొంటూ, ఇంటికి వచ్చిన రాజకీయ నాయకులతో మాట్లాడుతూ, జగన్  సభలలో కనిపిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే రాజకీయోపన్యాసలు మొదపెట్టారు. చాలా తక్కువ కాలంలో  ఆమె ఇంత యాక్టివ్ అవుతారని ఎవరూ వూహించి వుండరు. ఆమె చక్కగా ప్రసంగించడం నేర్చుకున్నారు. ఎలా వోటర్ల మనుసుదోచుకోవాలోనేర్చుకున్నారు. ఆమె మాటల్లో లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ఆమె ఎపుడూ ఎవ్వరినీ,ఆ మాటకొస్తే వైఎస్ఆర్ బద్ధ శత్రువులను కూడా పలెత్తు  మాట అనే వారు కాదు.    వైఎస్ఆర్ కు విశిష్ట ఆదరణను ఎలా ఓట్లుగా మలుచుకోవాలో ఆమె బాగా నేర్చుకున్నారు.  చాలామంది రాజకీయ నాయకులు ప్రసంగాలకంటే ఆమె ప్రసంగాలు అర్థవంతంగా ఉంటాయి. కొందరికి నచ్చకపోవచ్చు, కొందురు ఆమె ఎత్తుగడలో తెలంగాణని  కూడా వైఎస్ కుటుంబానికి కట్టబెట్టాలనే వ్యూహం చూడవచ్చు.మరికొందరు ఆమెను వ్యతిరేకించవ్చు.ఎవరి అభిప్రాయాలువాళ్లవి. ఒకటి మాత్రం నిజం, ఆమె రాజకీయాల్లో రాటు దేలారు. ఒక రాజకీయ నేతకు భార్యగా,  ఒక ముఖ్యమంత్రికి తల్లిగా, మరొక రాజకీయనాయకురాలికి  తల్లిగా ఆమె తన రాజకీయ పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు.

ఆంధ్రలో జగన్ విజయంలో ఆమె  పాత్ర ఎవరూ కాదనలేరు. మరి, ప్రాంతీయ భావజాలంతో  ఏర్పడిన తెలంగాణలో ఆంధ్రా కడప జిల్లాకు చెందిన విజయమ్మ  వ్యూహం ఏ మేరకు విజయవంతమవుతుందో ఇపుడే చెప్పలేం?

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *