పత్రికా ప్రకటన తిరుపతి, 2021 సెప్టెంబరు 01
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 14న ఉదయం 7.30 నుండి 9.30 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సెప్టెంబరు 17న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 18న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి చేపడతారు. చివరిరోజు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనే అవకాశం
పవిత్రోత్సవాల్లో పాల్గొనాలని భావించే భక్తులను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ సేవలో అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. త్వరలో ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జీతో కలిపి ఈ సేవా టికెట్ ధరను రూ.1001/-గా నిర్ణయించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలో పాల్గొనే గృహస్తులను(ఇద్దరిని) 90 రోజుల్లోపు రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా ఉచితంగా శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
సెప్టెంబరు 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 17న అంకురార్పణం రోజున కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్ సేవ, సాయంత్రం బ్రేక్ దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా సెప్టెంబరు 18 నుండి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.