పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదేం రాజకీయ సంస్కృతి 

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన రాజకీయ పార్టీలు దృఢంగా నిలబడితేనే ఆ దేశ పరువు దక్కుతుంది.  ఇటీవల కేంద్ర లో,  రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నపార్టీల, ప్రతిపక్ష పార్టీల మధ్య సంబంధాలు బాగా దిగజారాయి. ఇది ప్రజాస్వామ్యవ్యవస్థకు మాయని మచ్చ.  పార్టీలు చౌకబారు విమర్శల చేసుకోవడం మామూలయింది.  తిట్లు,శాపనార్థాలు రాజకీయ ప్రచారమయ్యాయి. రాజకీయ నాయకుల ఉపన్యాపాలలో తిట్లకు, బెదిరింపులకు,చవక బారు విమర్శకులే ప్రాధాన్యం ఎక్కువయింది. దీని మీద విపరీతంగా కార్టూన్లు కూడా వస్తున్నాయి. రాజకీయ నాయకుడు అంటేనీచార్థం స్థిరపడిపోతున్నది. తొడగొట్టడం ఒక వీరోచిత స్పందన అవుతున్నది. మొన్న టిఆర్ ఎస్ మంత్రి మల్లారెడ్డి,  పిసిసి అధ్యక్షుడు చేసిన విమర్శలకు సమాధానం తొడగొట్టడమే అన్నట్లు  ప్రదర్శించి చూపారు.మరొక టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అంతకు ముందు తన మీద వచ్చిన విమర్శలకు భయంకరమయిన తిట్లతో సమాధానమిచ్చారు.

అన్ని రాజకీయ పార్టీలలో ఇలాంటి తిట్ల సంస్కృతి బలపడుతూ ఉంది. ఇలాంటి వాళ్లను ఓటేసి గెలిపించుకున్నామా అనే ఆలోచన ఓటర్లలో కలిగే సమయం వచ్చింది.

విమర్శల్లో అర్ధముండు, చిత్తశుద్ధి కానరాదు

అధికార పార్టీ  లక్ష్యం నిరంతరం తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని, ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేయాలని వివిధ వాగ్దానాలు ప్రలోభాల ద్వారా ప్రజలను తమ వైపు మళ్ళించాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే క్రమంలో అసహనానికి గురైన అధికార పార్టీ ప్రతిపక్షాలపై, ప్రజలపై అనేక విమర్శలు చేస్తున్నది.

ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి అప్పుడప్పుడు చేసే విమర్శలను అధికార పార్టీ సహించకపోవడం, అధికార పార్టీ ప్రతిపక్షాలను నిరంతరం నిఘా వేసి ఉంచడం అవసరమైతే అరెస్టు చేసే నోరు మూయడం వంటి చర్యల ద్వారా సంఘర్షణ మరింత జటిలమవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి?

జాతీయ స్థాయి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చేపట్టే  ప్రతి పని కూడా ఏకపక్షంగా జరుగుతున్నదే. చట్టసభలను నామమాత్రంగా  నిర్వహించి ప్రతిపక్షాలు లేకున్నా కూడా అప్పుడప్పుడు బిల్లులను పాస్ చేస్తున్న విధానం కొనసాగుతున్నది. పభల్లో ప్రతిపక్ష నిర్మూలన అనేది చాలా బాహాటంగా సాగుతూ ఉంది.  ప్రభుత్వ ధోరణిని వ్యతిరేకించిన ప్రతిపక్షాలను మార్షల్స్ ద్వారా బయటకు పంపించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణమయింది.

రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగి పోవడం ,భూదందాల తో అక్రమార్కుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే రాజకీయ పార్టీ నాయకులు నిరంతరం అవినీతికి పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం ఎలాంటి కట్టడి చేయకుండా అవినీతి పరులను కాపాడుతుందని  ప్రతిపక్షాలు విమర్శించడం పరిపాటి.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఫామ్ హౌస్ ల సంస్కృతి బాగా ప్రబలింది. రాజకీయాల్లో నిలదొక్కుకున్నోళ్లంతా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ తో ఫామ్ హౌస్ తెలంగాణలో బాగా పాపులర్ అయింది. ఫామ్ హౌస్ కు ముఖ్యమంత్రి పరిమితంకావడంతో  సచివాలయానికి మంత్రులు  రాకపోవడం లేదని, ప్రగతి భవన్ చుట్టే రాజకీయ కార్యకలాపాలు నడుస్తున్నాయని  ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయి. మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ అధినేత తో పాటు మంత్రులు శాసనసభ్యులు కూడా ప్రతిపక్షాలను అవమానకరమైన రీతిలో కనీస సంస్కారం పాటించకుండా విమర్శించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి రాజకీయాల్లో అంతరించిపోయిన మరొక అంశం సంప్రదింపులు.  ప్రతిపక్షం ఇక అధికారంలోకి రాదనే భావన రూలింగ్ లోకి వచ్చిన వెంటనే గెల్చిన పార్టీ భావిస్తూ ఉంది. అందుకే ఇటీవల ముఖ్యమంత్రులు అయిదేళ్ల టర్మ్  గురించి కాకుండా యాభై యేళ్లు  టర్మ్ గురించిమాట్లాడుతున్నారు. దీనితో   ప్రభుత్వ పథకాలు రూపొందిస్తున్నపుడు గాని, అమలు చేస్తున్న సందర్భంలో  గాని  ప్రతిపక్షాలను సంప్రదించే పద్ధతి పోయింది. అసలు ప్రతిపక్షాలను  రూలింగ్ పార్టీలు గుర్తించడమేలేదే. తెలంగాణో ఇటీవల దళిత బంద్ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసినఅఖిల పక్ష సమావేశంలో ఆ తరహాలో అదే మొదటిదేమో. ప్రతిపక్షాలను విస్మరించే  సంప్రదాయం మంచిది కాదు.
ముఖ్యమంత్రి గారు రెండవ సారి అధికారంలోకి వస్తున్న సందర్భంలో ప్రభుత్వం కీలక విషయాల్లో అఖిల పక్షాలతో, ప్రజా సంఘాలతో తప్పకుండా చర్చి స్తుందని హామీ ఇచ్చినప్పటికీ ఆ వైపుగా ఒక్క అడుగు కూడా పడలేదు.

రాజ్యాంగబద్ధంగా పరిమిత అధికారాలతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఇష్టమున్నట్టు గా ఏకపక్షంగా ఖర్చు చేసినటువంటి దాఖలాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగినవి.
రైతు బంధు కేవలం ఉన్నత వర్గాలకు భూస్వాములకు మాత్రమే ఉపయోగ పడుతుo టే అసలే భూమి లేని నిరుపేదలకు దీని వల్ల ఒరిగిందేమిటి?
వేల కోట్లతో నిర్మించవలసిన ప్రాజెక్టులను డిజైన్లు మార్చి లక్షల కోట్లతో నిర్మించడం ద్వారా అవినీతికి హద్దు లేకుండా పోతే ఏ వర్గాలకు దీనివల్ల ప్రయోజనం జరుగిందో మన అందరికి తెలుసు.

కేవలం హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వము మొత్తము మంత్రులు, శాసనసభ్యులు హుజురాబాద్ లో తిష్ట వేయడం దేనికి సంకేతం?

16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో 2014లో అధికారానికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల కోట్ల పైచిలుకు అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించినపుడు ప్రజల పక్షాన ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో మేధావులు, నిపుణులు, న్యాయశాస్త్ర కోవిదులు, ప్రజాసంఘాలు జోక్యం చేసుకొని ప్రభుత్వాల  తిరోగమన విధానాల పైన ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే పరస్పర విమర్శనాస్త్రాలు, వెకిలి మాటలు, అవమానకరమైన ఈసడింపులకు ముగింపు పలకవచ్చు.హక్కుల కార్యకర్తలు,బుద్ధిజీవులకు, జర్నలిస్టులకు
ఏ గతిపడు తున్నదో గమనిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరగవలసిన కృషి ,కర్తవ్యాలు అర్థమౌతున్నాయి.

రావాల్సిన మార్పు

అనుభవము లేని అధికార పార్టీనేతలు, నాయకత్వం ఆసరా చూసుకుని ప్రతిపక్షాలకు చెందిన  అనుభవజ్ఞలపై అగౌరవంగా మాట్లాడటం నిత్యమూ జరుగుతూ ఉంది. అధికారపార్టీలో అసహనం ఎక్కువయిపోతున్నది. విమర్శలను ఏ మాత్రం సహించలేకపోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి.

పార్టీపరంగా అధికార ప్రతినిధి మాత్రమే మాట్లాడే విధంగా అది కూడా సభ్యసమాజం గౌరవించే విధంగా మాత్రమే ఉండాలి.

అధికారం తాత్కాలికమేనని అహంకారంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అనే సంకేతం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అవసరం ఉన్నది.

ఇటీవల ఇష్టమున్నట్టు గా మాట్లాడిన టువంటి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల పైన న్యాయస్థానంలో కేసు నమోదైన విషయం అందరికీ తెలిసినదే. దీనికి అధికార పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి కూడా మినహాయింపు ఇవ్వకుండా దోషులపై కఠినమైన శిక్షలు విధించి నట్లయితే ఈ దుర్మార్గపు అసభ్య పదజాలం కి విమర్శలకు చరమగీతం పాడవచ్చు.ఆ మధ్య ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు ధూషణలకు పాల్పడవద్దని భారత ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థించింది. భారత ప్రజాస్వామ్య సౌదం బలోపేతం కావాలంటే రాజకీయ పార్టీలలో విజ్ఞత, రాజనీతిజ్ఞత, అవగాహన, అధ్యయనము, సామాజిక చింతన ఉన్న వారిని నాయకులుగా ఎన్నుకోవాలి. ఈ విషయంలో అప్రమత్తం కాకపోతే, ముందు ముందు రాజకీయాలు ఇంకా దిగజారిపోతాయి. అందుకే ఎన్నికల సమయంలోనే కాదు, నిరంతరం రాజకీయ పార్టీలకు, సభ్యులుకు ఒక ప్రర్తనా నియమావళి (కోడ్) ఉండాలేమో.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *