చిన్న పాత్రల మహానటుడు: కాకరాల విలక్షణ జీవిత విశేషాలు

పౌరోహిత్యం నుంచి రంగస్థలం పైకి….

-రాఘవ శర్మ 

 

నాలుగక్షరాలలో కనిపించే కళారూపం ‘కాకరాల’. పౌరోహిత్యాన్ని వదిలేసి నాటకాల వైపు నడకలు.ఆయన తెలుగు సీనీరంగంలో విలక్షణమయిన పాత్రలు పోషించిన పాతతరం నటుడు. 250 చిత్రాలలో నటించారు.

నవ్వులు-పువ్వులు అనే ఒకసినిమా పత్రికకు విలేకరిగా పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు పేరుంది.సినిమా రంగానికి రాకముందు ఆయన 80 స్టేజీ నాటకాలలో నటించారు. 1960లో వచ్చిన సహస్ర శి రచ్చేద అపూర్వ చింతామణి ఆయన తొలిచిత్రం.

తాను వేసింది చిన పాత్రలే అయినా తనకు సంతృప్తి నిచ్చిన పాత్రలే డైరెక్టర్లు ఇచ్చారని ఆయన ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

‘ఓల్గా నుంచి గంగ’ తో సాగిన ఆలోచనలు.గరికపాటి రాజారావు శిష్యరికం. గొప్ప కళాకారుడు, మంచి రంగస్థల నటుడు.సినిమాల్లో అప్పు డప్పుడు కమెడియన్ గా కనిపించినా, నిజానికి సీరియస్ నటుడు. ఆయన అసలు పేరు కాకరాల వీరవెంకట సత్యనారాయణ.

ఇటీవ‌ల తిరుపతికి వచ్చిన కాకరాలను కదిలిస్తే, జీవితంలో అనేక జ్ఞాప‌కాలు, సినీ, రంగస్థల అనుభవాలు, మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం, భార్య, కూతుళ్లు, కుటుంబం; కన్నీళ్ళతో కూడిని ఉద్వేగం కలగలిసిన ఎనభైనాలుగేళ్ళ జీవనయానం. వ‌యోభారంతో ఒంగిపోయిన నడుము. పాల‌క‌ వర్గాలకు లొంగ‌ని మనసు. ఆ జీవన యానం
ఆయన మాటల్లోనే ఇలా…

“మా నాన్న పేరు కాకరాల వీరభద్రం.పౌరోహిత్యం చేసేవారు. మా నాన్న వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి లో ఉన్నప్పుడు పుట్టాను.

మా నాన్న స్థిరపరచిన తేదీ ప్రకారం 1937 డిసెంబర్ 18 న నేను పుట్టినట్టు లెక్క. అంతకు మించి ఆ ఊరితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు.

అక్కడికి సమీపంలోని మా అమ్మ కనకమహాలక్ష్మి పుట్టిల్లు కాకర పర్రు.అక్కడే పెరిగాను.అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి.వాటి పట్ల నాకు ఆసక్తి పెరిగింది.అవి నన్ను ఎక్కువగా ఉత్సాహపరిచాయి.నాటక వ్యామోహంలో పడిపోయాను.


కాకరాల జీవన యానం-1


ఎలిమెంటరీ చదువంతా మానాన్న దగ్గరే.ఆయన కనుసన్నలలోనే సాగింది. నిలకడలేని చదువు.నాన్న స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా తొర్రేడుకు నన్ను పంపారు.

ఆరోజుల్లో చదువు రాక పోతె గోడకుర్చీ వేయించేవారు.మళ్ళీ కాకరపర్రు తీసుకొచ్చి ఆరు, ఏడు చదవకుండా ఎకాఎకి ఎనిమిదవ తరగతిలో చేర్పించారు.

లెక్కలు అర్థమయ్యేవి కావు.నా స్టాండర్డ్ దెబ్బతింది.కోట ఆదినారాయణ మాష్టారు వద్ద ట్యూషన్ లో చేర్చారు.వారు చాలా శ్రద్ధ తీసుకుని నాకు పాఠాలు చెప్పేవారు. ఈ కాస్త చదువేదైనా అబ్బిందంటే వారి చలవ వల్లే.

వెంటాడిన ‘ఓల్గా నుంచి గంగ’

తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నాతోపాటు చదువుకునే కోరుకొండ లక్ష్మీపతిరావు అనే మంగలి కుర్రాడు మా అమ్మమ్మ గారి ఇంట్లో నే ఉండే వాడు. పగటిపూట ఒక్కొక్కరి ఇంట్లో భోజనం చేసే వాడు. రాత్రి పూట మాత్రం మా ఇంట్లో నే భోజనం చేసేవాడు. .

వాడు జీవితంలో చాలా సంఘర్షణ పడి వచ్చాడు.నేను బ్రాహ్మణ కుంటుంబం నుంచి వచ్చాను.మా ఇద్దరికీ వాదనలు జరిగేవి. వాదనలో వాడిని ఓడించాలని ప్రయత్నించి, ప్రతి సారీ ఓడిపోయేవాడిని. నేను తొలిసారిగా ‘కమ్యూనిజం’ అన్న మాట వాడి నోటి వెంటే విన్నాను.

వీణ్ణి ఎలాగైనా నెగ్గాలని అక్కడ ఉండే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా నుంచి గంగ’ పుస్తకం అక్క‌డ దొరికింది. అసలు చదవని నా చేత ఆ పుస్తకం ఆపకుండా చదివించింది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది.

ఆ ఊర్లో ఉన్నంత కాలం ఎంత వెతికినా ఆ పుస్తకం నాకు మళ్లీ దొరకలేదు. అల్లూరి సత్యనారాయణ రాజు అనువదించిన ఆ పుస్తకం నన్ను వెంటాడింది. ఆ తరువాత చాలా కాలానికి చాగంటి తులసి అనువాదం చేసిన ‘ఓల్గా నుంచి గంగ’ దొరికింది.

అందులో 20వ కథ ‘సుమేరుడు’ చాలా గొప్పది. అయితే ఈ కథ అల్లూరి సత్యనారాయణ రాజు అనువాదం చేసిన పుస్తకంలో లేదు. గాంధీ వాదానికి దళిత వాదం సమాధానం చెప్పిన కథ ఇది.ఆ రోజుల్లో గాంధీ నైతిక వ్యక్తిత్వం బలంగా ఉండడం వల్ల అల్లూరి సత్యనారాయణ రాజు సుమేరు కథను అనువాదం చేయకుండా వదిలేసి ఉండవచ్చు అనుకుంటున్నాను.

ఉద్యోగమా? పౌరోహిత్యమా?

నేను కాకరపర్రు లోనే పదవతరగతి చదివినప్పటికీ ఎస్ఎస్ ఎల్ సీ తప్పాను. ‘ఉద్యోగం చెయ్యి, లేదా నాతోపాటే పౌరోహిత్యం చేయి’ అన్నాడు మానాన్న. పౌరోహిత్యంలో మా నాన్న నెగ్గుకు రాలేకపోతున్నాడు.

అందులో ఉండే అవలక్షణాలు నాకు బాగా తెలుసు. అందు చేత , పౌరోహిత్యంలోకి వెళ్ళ‌డానికి నేను వ్యతిరేకించాను. ఆయన పోరు పడలేక కొంతకాలం పౌరోహిత్యం చేశాను.

రాజమండ్రిలోని గౌతమీ గ్రంథా లయం లో మేము నాటకాల కు రిహార్సల్ వేసే వాళ్లం. అప్పుడప్పుడు కాలక్షేపానికి గ్రంథాలయం లో కి వెళ్ళి పుస్తకాలు చదివే వాళ్లం. అలా వెతికితే మళ్ళీ ‘ఓల్గా నుంచి గంగ’ దొరికింది.

అందులో ఎనిమిదవ కథ ‘ప్రవాహణుడు’ రామాయణం కాలం నాటి నేపథ్యంలో రాసింది. అందులో గార్గి చాలా గొప్ప పాత్ర. మేన కోడలు అయిన గార్గితో యాజ్ఞవల్కుడు ‘ గార్గి.. ఇక నీవు ఒక్క మాట మాట్లాడినా నీ తల వక్కలవుతుంది’ అని అంటాడు.

‘ప్రవాహణుడు’ చదివాక నా దృష్టిలో మార్పు వచ్చింది. భుజానికుండే జంధ్యం నడుముకు వచ్చేసింది.

తీరుబడిగా కూర్చుని జీవితాన్ని గడిపే తరగతుల వారి తాత్విక సమర్థన కోసం వచ్చిన రచనలు యజ్ఞవాదం (వేదాలు),బ్రహ్మవాదం (ఉపనిషత్తులు), రాజ వాదం (భగవద్గీత) అని అర్థమైపోయింది.

రాహుల్ సాంకృత్యాయన్ రచనలు నన్ను చాలా ప్రభావితం చేశాయి.  ఆలోచనను, నా జీవిత గమనాన్ని మార్చేశాయి.

” ‘గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5, 1915-సెప్టెంబర్ 9,1963) లేకపోతే నేను లేను’ (ఇంకా ఉంది)

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *