మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆదివారం ఉదయం పద్మశాలీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
పట్టణంలోని మార్కండేయ కళ్యాణమంటపంలో ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం ప్రశాంతంగా జరిగింది.
మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ ఏర్పాటైన అనంతరం ఈ ప్రాంతంలో ప్రధాన సామాజిక వర్గమైన పద్మశాలీయులతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ సామాజిక వర్గాల ప్రజలు సయితం ఈ సమావేశం ఏర్పాటుపై ఆసక్తిని కనబరిచారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్కే నగరాభివృద్ధి గురించి, పద్మశాలీయులకు సంబంధించిన నాంచారమ్మ చెరువు గురించి, సీకే విద్యాసంస్థల గురించి ప్రధానంగా మాట్లాడారు.
మంగళగిరిలో బైపాస్ రోడ్డుకు, గౌతమ బుద్ధా రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా లేనందున రహదార్ల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.
ప్రధానంగా తెనాలి రోడ్డుతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురు (అభిరుచి రెస్టారెంట్ పక్క) వీధి, పాతబస్టాండ్ సెంటర్ పెద్దమసీదు మీదుగా షరాఫ్ బజారు విస్తరణ గురించి వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అందరి అభిప్రాయాలకు అనుగుణంగా రహదార్ల విస్తరణ చేయనున్నట్లు ఆర్కే వెల్లడించారు.
పాతబస్టాండ్ స్థలంలో ఐదంతస్తుల చేనేత భవన్ నిర్మాణం కూడా త్వరలో చేపట్టి పూర్తి చేసిన అనంతరం తెనాలి రోడ్డు విస్తరణ చేపట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వివరించారు.
ఇంకా పలు విషయాలు ప్రస్తావించిన ఎమ్మెల్యే ఎవరికైనా ఏ అవసరం వచ్చినా తన కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమానికి అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ దామర్ల శివశంకర శ్రీనివాసరావు, హైకోర్టు మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కమిటీ మెంబరు దామర్ల వెంకట నరసింహ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ కార్పొరేషన్ డైరెక్టర్ పారేపల్లి విజయలక్ష్మి, అప్కో మాజీ పర్సన్ ఇన్ చార్జి వెనిగళ్ల శివ శంకరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, మాజీ వైస్ చైర్మన్లు మునగాల మల్లేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు, జనసేన అనుబంధ చేనేత వికాస అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు జగ్గారపు రాము, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షుడు జొన్నాదుల బాబూ శివప్రసాద్ (బాబ్జీ), రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నరు అనిల్ చక్రవర్తి ఇసునూరి, సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఆర్ వీ ప్రసాద్, పద్మశాలీయ సంఘ పెద్దలు గంజి రవీంద్రనాథ్, దామర్ల కుబేరస్వామి, చింతక్రింది కనకయ్య విద్యాసంస్థల ప్రతినిధులు ప్రెగడ ఆదిసుదర్శన సుందరరావు, జంజనం పాండురంగారావు, చేనేత వస్త్ర వ్యాపారులు, స్వర్ణకార, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.