ఆఫ్ఘన్ మహిళ బతుకు నరకం చేసింది అమెరికాయే…

అఫ్ఘన్  తాలిబాన్ వశం కావడంపై ఆఫ్ఘన్ విప్లవ మహిళా సంఘం (RAWA) స్పందన:

 కోట్ల డాలర్లు వెచ్చింది, వేలాది మంది సైనిక దళాలతో, అత్యాధునికి మారణాయుధాల రెండు దశాబ్దాల పాటు ఆఫ్గనిస్తాన్ లో అమెరికా తిష్టవేసి సాధించిందేమిటి? అక్కడి ప్రభుత్వాన్ని అవినీతి మయంచేయడం, మతదురంహకారుల బలిసేలా చేయడమే. దీనితో మహిళల బతుకు అభద్రతలో పడిపోయింది.

 

ఈ అత్యవసర సమయంలో వారి అవసరాలను తీర్చడానికి ఆఫ్ఘన్ మహిళా మిషన్ (AWM ) ʹరావాʹ తో సంబంధంలోఉంది. అఫ్ఘన్ విమెన్స్ మిషన్ (Afghan Women’s Mission- AWM) కో-డైరెక్టర్ సోనాలి కొల్హత్కర్‌తో జరిగిన ఈ సంక్షిప్త ప్రశ్నోత్తరాలలో, ప్రస్తుత పరిణామాల మీద ʹరావాʹ తన అవగాహనను తెలియచేస్తోంది.

సోనాలి కొల్హత్కర్: ఎన్నో ఏళ్లుగా అమెరికా ఆక్రమణకు వ్యతిరేకంగా ʹరావాʹ మాట్లాడుతోంది, ఇప్పుడు అది ముగిసింది. తాలిబాన్లు తిరిగి వచ్చారు. ప్రస్తుతాని కంటే సురక్షితమైన పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ వుండేట్లుగా అమెరికా బలగాలను ప్రెసిడెంట్ బిడెన్ ఉపసంహరించుకోగలిగి వుండేవాడా? తాలిబన్లు అంత త్వరగా స్వాధీనం చేసుకోకుండా వుండడానికి ఏమైనా చేయగలిగి వుండేవాడా?

Sonali Kolhatkar (credit:womensmediacenter.com)

RAWA: గత 20 సంవత్సరాలలో, మా డిమాండ్లలో ఒకటి అమెరికా/ నాటో ఆక్రమణను అంతం చేయడం. వారు తమ ఇస్లామిక్ ఛాందసవాదుల్ని, సాంకేతిక నిపుణులను తమతో తీసుకెళ్లిపోయి, ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా వదిలేస్తే యింకా బాగుంటుంది. ఈ ఆక్రమణ కేవలం రక్తపాతం, విధ్వంసం, గందరగోళాలకు దారితీసింది. వారు మా దేశాన్ని అత్యంత అవినీతికర, రక్షణ రహిత, మాదకద్రవ్యాల మాఫియాదేశంగా, ముఖ్యంగా మహిళలకు ప్రమాదకరమైన ప్రదేశంగా మార్చారు. మేము మొదటి నుండి అలాంటి ఫలితాన్ని ఊహించగలిగాము. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ని ఆక్రమించిన ప్రారంభ రోజులలో 2001, అక్టోబర్ 11 న ʹRAWAʹ యిలా ప్రకటించింది:

ʹఅమెరికా దాడుల కొనసాగింపు, అమాయక పౌరుల బాధితుల సంఖ్య పెరుగుదల తాలిబాన్లకు ఒక సాకును ఇవ్వడమే కాకుండా, ఈ ప్రాంతంలోనే కాక, ప్రపంచమంతటా కూడా మతోన్మాద శక్తుల సాధికారతకు కారణమవుతుంది.ʹ

మేము ఈ ఆక్రమణను వ్యతిరేకించటానికి ప్రధాన కారణం ʹతీవ్రవాదంపై యుద్ధంʹ అనే మంచి ముసుగులో వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం.

2002 లో ఉత్తర కూటమి దోపిడీదారులు, హంతకులు తిరిగి అధికారంలోకి వచ్చిన ఆరంభ రోజుల నుండి, దోహా లో చివరి శాంతి చర్చలు, లావాదేవీలు, ఒప్పందాలు, 2020/21 లో 5000 మంది ఉగ్రవాదులను జైళ్ల నుండి విడుదల చేయడం వరకు, చూస్తే ఉపసంహరణకు కూడా మంచి ముగింపు ఉండదు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

దండయాత్ర చేయడానికి కానీ లేదా జోక్యం చేసుకోవడానికి కానీ పెంటగాన్ ముందుకు తెచ్చిన సిద్ధాంతమేదీ సురక్షితమైన స్థితిలో ముగియదని పెంటగాన్ రుజువు చేసింది. అన్ని సామ్రాజ్యవాద శక్తులు తమ సొంత వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే దేశాలపై దాడి చేస్తాయి కానీ అబద్ధాలు, శక్తివంతమైన కార్పొరేట్ మీడియా ద్వారా తమ అసలు ఉద్దేశ్యాన్ని, ఎజెండాను దాచడానికి ప్రయత్నిస్తాయి.


“In the past 20 years, one of our demands was an end to the US/NATO occupation, and even better if they take their Islamic fundamentalists and technocrats with them and let our people decide their own fate. This occupation only resulted in bloodshed, destruction, and chaos. They turned our country into the most corrupt, insecure, drug-mafia, and dangerous place, especially for women.”


ʹమహిళల హక్కులుʹ, ʹప్రజాస్వామ్యంʹ, ʹజాతి నిర్మాణంʹ మొదలైన విలువలు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా/నాటో లక్ష్యాలలో భాగమని చెప్పడం హాస్యాస్పదం! ఆఫ్ఘనిస్తాన్‌‌ని అస్థిరపరచి, తీవ్రవాదిగా మార్చి, ప్రత్యర్థి శక్తులను ప్రత్యేకించి చైనా, రష్యాలను చుట్టుముట్టడానికి, ప్రాంతీయ యుద్ధాల ద్వారా వారి ఆర్థిక వ్యవస్థలను క్షీణింపచేయడానికి అమెరికా అక్కడ ఉంది. అయితే, విమానాశ్రయాన్ని నియంత్రించడానికి, తన దౌత్యవేత్తలనూ, సిబ్బందినీ సురక్షితంగా తరలించడానికి 48 గంటల్లోనే మళ్లీ సైన్యాన్ని పంపాల్సి రావలసినంత వినాశకరమైన, అవమానకరమైన, ఇబ్బందికరమైన నిష్క్రమణను అమెరికా ప్రభుత్వం కోరుకోలేదు.

అమెరికా తన బలహీనతల వల్ల తప్ప, తాను సృష్టించిన తాలిబాన్ చేతిలో ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచివెళ్ళిందని మేము అనుకోవడం లేదు. ఈ ఉపసంహరణకు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

మొదటగా, అమెరికాలో అనేక రంగాల్లో నెలకొన్న అంతరంగిక సంక్షోభం ప్రధాన కారణం. కోవిడ్ -19 విపత్తుకి బలహీనమైన ప్రతిస్పందన, కాపిటల్ హిల్‌పై దాడి, గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ప్రజల గొప్ప నిరసనలలో అమెరికా వ్యవస్థ క్షీణతకు సంకేతాలు కనిపించాయి. అంతర్గత జ్వలంత సమస్యలపై దృష్టి పెట్టడానికి విధాన రూపకర్తలు బలగాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది.

రెండవ కారణం ఏమిటంటే, ఆఫ్ఘన్ యుద్ధం అనూహ్యంగా ఖరీదైన యుద్ధంగా తయారై, ఖర్చు కోట్లలోకి చేరింది, అదంతా పన్ను చెల్లింపుదారుల నుండి వసూలుచేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టాల్సిన తీవ్ర ఆర్థిక ఒత్తిడిని అమెరికాపై తీసుకువచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్‌ను సురక్షితంగా చేయడమనేది ఎప్పుడూ వారి లక్ష్యం కాదని వారి యుద్ధ పిపాస విధానాలు నిరూపించాయి.

అంతేకాకుండా, ఉపసంహరణ అస్తవ్యస్తంగా ఉంటుందని తెలిసి కూడా చేసారు. ఇప్పుడు తాలిబాన్లు అధికారంలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ వెలుగులోకి వచ్చింది, కానీ గత 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ప్రతిరోజూ వందలాది మంది ప్రజల్నిచంపేసారు. మా దేశం నాశనమైంది, కానీ ఆ విషయం మీడియాలో చాలా అరుదుగా వచ్చింది.

సోనాలి కొల్హత్కర్: ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు తాము మహిళల హక్కులను గౌరవిస్తామని తాలిబాన్ నాయకత్వం చెబుతోంది. కొన్ని పాశ్చాత్య మీడియాలు దీనిని సానుకూల దృక్పథంతో చిత్రించాయి. 20 సంవత్సరాల క్రితంకూడా తాలిబాన్లు ఇదే మాట చెప్పలేదా?మానవ హక్కులు, మహిళల హక్కుల పట్ల వారి వైఖరిలో ఏదైనా మార్పు ఉందని మీరు అనుకుంటున్నారా?

RAWA: కార్పొరేట్ మీడియా మా విధ్వంసమైన ప్రజల గాయాలను మరింత ఎక్కువ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తోంది. క్రూరమైన తాలిబాన్లను ఆమోదయోగ్యంగా చేయడానికి వారుచేసిన ప్రయత్నాలకు వారే సిగ్గుపడాలి.1996 నాటి భావజాలానికీ, ఈనాటికీ తేడా లేదని తాలిబాన్ ప్రతినిధి ప్రకటించారు. మహిళల హక్కుల గురించి వారు చెప్పేది వారి మునుపటి చీకటి పాలనలో ఉపయోగించిన ఖచ్చితమైన పదబంధమే: షరియా చట్టాన్ని అమలు చేయడం.

ఈ రోజుల్లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని ప్రాంతాలలో క్షమాభిక్షను ప్రకటించారు. వారి నినాదం ʹక్షమించడం యిచ్చే ఆనందం, ప్రతీకారం యివ్వలేదు.ʹ కానీ వాస్తవానికి వారు ప్రతిరోజూ ప్రజలను చంపుతున్నారు. తాలిబాన్ తెల్ల జెండాకు బదులు మూడు రంగుల ఆఫ్ఘన్ జాతీయ జెండాను పట్టుకున్నాడని నిన్ననే నంగర్‌హార్‌లో ఒక బాలుడిని కాల్చి చంపారు. కాందహార్‌లో నలుగురు మాజీ సైనికాధికారులను ఉరితీశారు, ఫేస్‌బుక్‌లో తాలిబాన్ వ్యతిరేక పోస్ట్‌‌లు రాసినందుకు హెరాత్ ప్రావిన్స్ లో ఒక యువ ఆఫ్ఘన్ కవి మెహ్రాన్ పోపాల్‌ను అరెస్టు చేశారు, అతని ఆచూకీ కుటుంబానికి తెలియదు. వారి ప్రతినిధులు మంచి, మెరుగుపెట్టిన పదాలు వాడుతున్నప్పటికీ వారి హింసాత్మక చర్యలకు ఇవి కొన్ని ఉదాహరణలు.

కానీ తాలిబాన్లు ఆడుతున్న నాటకాల్లోవారి దావాలు ఒకటి అని మేము నమ్ముతున్నాము. వారు తమను తాము సంఘటితం చేసుకోడానికి ఎక్కువ సమయాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి. తమ ప్రభుత్వ నిర్మాణానికి, ఇంటెలిజెన్స్ విభాగాన్ని సృష్టించడానికి, గడ్డంఎంత పొడుగు వుండాలి, డ్రెస్ కోడ్ఏమిటి, ఒక మహిళకు ఒక ʹమహ్రమ్ʹ (మగ సహచరుడు, తండ్రి, సోదరుడు లేదా భర్త మాత్రమే)మాత్రమే ఉండటం లాంటి ప్రజల రోజువారీ జీవితాల సూక్ష్మ వివరాలను నియంత్రించే బాధ్యతను నిర్వహించే –ʹనైతిక విలువల స్థాపన–అనైతిక చర్య నివారణʹ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ʹమేము మహిళల హక్కులకు వ్యతిరేకం కాదనీ అయితే అవి ఇస్లామిక్/షరియా చట్టాల పరిధిలో ఉండాలిʹ అనీ తాలిబాన్ అంటోంది.

ఇస్లామిక్/షరియా చట్టం అస్పష్టమైనది, ఇస్లామిక్ పాలకులు తమ స్వంత రాజకీయ ఎజెండాలు, నియమాలకు ప్రయోజనం చేకూర్చడానికి ఆ చట్టాన్ని వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు. ఇంకా, పాశ్చాత్యులు కూడా వాటిని గుర్తించి పరిగణించాలని తాలిబాన్ కోరుకుంటోంది. ఈ దావాలన్నీ తమను తాము ʹమంచివారుగాʹ చిత్రించుకొనే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి.

బహుశా కొన్ని నెలల తర్వాత వారు ʹమాకు న్యాయం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నందున ఎన్నికలు నిర్వహిస్తామనిʹ కూడా అనవచ్చు! ఈ నటన వల్ల వారి నిజమైన స్వభావం ఎప్పటికీ మారదు, స్త్రీద్వేషి, అమానవీయ, క్రూర, ప్రతిఘాతుక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల వ్యతిరేకులైన ఇస్లామిక్ ఛాందసవాదులుగానే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తాలిబాన్ మనస్తత్వం మారలేదు, ఎప్పటికీ మారదుకూడా!

సోనాలి కోల్హత్కర్: ఆఫ్ఘన్ జాతీయ సైన్యం, అమెరికా మద్దతు యిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వమూ అంత త్వరగా ఎందుకని విడిపోయాయి?

RAWA: అనేక కారణాల్లో కొన్ని ప్రధానమైనవి:
1) ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్‌లకు అప్పగించే ఒప్పందం ప్రకారం ప్రతిదీ జరిగింది. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్, ఇతర ప్రాంతీయ పాత్రధారులతో చర్చలు జరిపి ప్రధానంగా తాలిబాన్లతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. తాలిబాన్లను అధికారంలోకి తీసుకురావడానికి రహస్యంగా జరిగిన ఏర్పాటు కాబట్టి దానివల్ల ఆఫ్ఘన్ ప్రజలకు ప్రయోజనం లేదని తెలిసిన సైనికులు యుద్ధంలో చనిపోవడానికి సిద్ధంగా లేరు. తాలిబాన్లను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో నమ్మకద్రోహ పాత్రను పోషించిన జల్మయ్ ఖలీల్జాద్‌ను ఆఫ్ఘన్ ప్రజలు తీవ్రంగా ద్వేషించారు.

2. ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న యుద్ధం ఆఫ్ఘన్ ప్రజల యుద్ధంకాదనీ, దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్నదికాదని, తమ సొంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం విదేశీ శక్తులు చేస్తున్నాయనీ, ఆఫ్ఘన్‌లు యుద్ధానికి ఇంధనాలు మాత్రమేనని చాలా మంది ఆఫ్ఘన్‌లు బాగా అర్థం చేసుకున్నారు. తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం కారణంగా మెజారిటీ యువకులు బలగాలలో చేరుతున్నారు కాబట్టి వారికి పోరాడాలనే నిబద్ధత, నైతికత లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ను వినియోగదారుల దేశంగా ఉంచడానికి అమెరికా, పశ్చిమ దేశాలు 20 సంవత్సరాల పాటు ప్రయత్నించాయి. పరిశ్రమాభివృద్ధినిఅడ్డుకున్నాయి. ఈ పరిస్థితి నిరుద్యోగం, పేదరికాలను విపరీతంగా సృష్టించి, కీలుబొమ్మ ప్రభుత్వంలోనూ, తాలిబాన్‌లలోనూ యువకులు భర్తీ కావడానికీ, నల్లమందు ఉత్పత్తి వృద్ధికీ మార్గం సుగమం చేసింది.

3) ఆఫ్ఘన్ దళాలు ఒక వారం వ్యవధిలోనే ఓడిపోయేంత బలహీనంగా లేవు, కానీ తాలిబాన్‌లతో తిరిగి పోరాడవద్దనీ, లొంగిపోవాలనీ అధ్యక్ష భవనం నుండి ఆదేశాలు అందుతున్నాయి. చాలా ప్రావిన్సులను శాంతియుతంగా తాలిబాన్లకు అప్పగించారు.

4) హమీద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీల కీలుబొమ్మల పాలన సంవత్సరాలుగా తాలిబాన్లను ʹఅసంతృప్త సోదరులుʹ అని పిలుస్తోంది, వారి అత్యంత క్రూరమైన కమాండర్లు, నాయకులను జైళ్ల నుండి విడుదల చేసింది. ʹశత్రువుʹ అని పిలవకుండా ʹసోదరుడుʹ అని పిలిచే బలగంతో పోరాడమని ఆఫ్ఘన్ సైనికులను అడగడం, తాలిబాన్లకు ధైర్యాన్నిచ్చింది, ఆఫ్ఘన్ సాయుధ దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది.

5) సాయుధ దళాలు ఇంతకుముందెన్నడూ లేనంతగా అవినీతిలో కూరుకుపోయాయి. కాబూల్‌లో కూర్చున్న చాలా మంది జనరల్స్ (ఎక్కువగా ఉత్తర కూటమికి చెందిన మాజీ క్రూర యుద్దప్రభువులు) మిలియన్ల డాలర్లను కాజేశారు, వారు యుద్ధ క్షేత్రంలో పోరాడుతున్న సైనికుల ఆహారం, జీతాలలో కూడా కోత విధించారు. కేవలం కాగితాల మీద మాత్రమే సైనికులువున్నారు అని ʹసిగార్ʹ (స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఫర్ రీకనస్ట్రక్షన్ అనే అమెరికా సంస్థ-అను) బహిర్గతం చేశాడు. ఉన్నత స్థాయి అధికారులు తమ జేబులను నింపుకోవడంలో బిజీగా ఉన్నారు. వారు వేలాది మంది ʹలేని సైనికులʹ జీతం, రేషన్‌ను తమ స్వంత బ్యాంకు ఖాతాల్లోకి మార్చుకున్నారు.

6) పోరాటంలో తాలిబన్లను ముట్టడించినప్పుడు, ఆఫ్ఘన్ బలగాలు సహాయం కావాలని అడిగితే కాబూల్ పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో పదుల సంఖ్యలో వున్న సైనికులకు వారాల తరబడి మందుగుండు సామగ్రి, ఆహారం సరఫరా లేకుండా పోయినప్పుడు తాలిబాన్‌లు వారిని ఊచకోత కోశారు. అందువల్ల సాయుధ దళాలలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (దావోస్ 2019) లో, 2014 నుండి 45,000 మందికి పైగా ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది మరణించారని, అదే సమయంలో యుఎస్/నాటో సిబ్బంది 72 మంది మాత్రమే మరణించారని అష్రఫ్ ఘనీ ఒప్పుకున్నాడు.

7) మొత్తంమీద సమాజంలో పెరుగుతున్న అవినీతి, అన్యాయం, నిరుద్యోగం, అభద్రత, అనిశ్చయత, మోసం, విస్తృతమైన పేదరికం, మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్ మొదలైనవి తాలిబాన్ పునరుధ్భావానికి తావు కల్పించాయి.

సోనాలి కోల్హత్కర్: ఇప్పుడు RAWA, ఆఫ్ఘన్ ప్రజలు, మహిళలకు అమెరికన్లు సహాయం చేయగలిగే ఉత్తమ మార్గం ఏమిటి?

RAWA: ఈ కాలమంతటా స్వేచ్ఛాప్రియులైన అమెరికా ప్రజలు మాతో ఉండటం మాకు చాలా అదృష్టంగా, సంతోషంగా అనిపిస్తుంది. అమెరికన్లు తమ ప్రభుత్వ యుద్ధ ప్రోత్సహ విధానాలకు వ్యతిరేకంగా తమ స్వరాన్నెత్తాలి, నిరసన తెలియజేయాలి, ఈ క్రూరులకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల పోరాటాన్ని బలోపేతం చేయడానికి మాకు మద్దతు ఇవ్వాలి.
ప్రతిఘటించడం మానవ స్వభావం, అందుకు చరిత్ర సాక్ష్యంగా వుంటుంది.

అమెరికాలో జరిగిన పోరాటాల్లో ʹవాల్ స్ట్రీట్ ఆక్రమించుʹ, ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ ఉద్యమాలలాంటి అద్భుతమైన ఉదాహరణలు మనకుఉన్నాయి. ఎలాంటి అణచివేత, హింసలు ప్రతిఘటనను ఆపలేవని మనం చూశాము. మహిళలు ఇకపై సంకెళ్లలో వుండరు! తాలిబాన్లు రాజధానిలోకి ప్రవేశించిన మరుసటి రోజు ఉదయమే, ధైర్యవంతులైన మా యువతుల బృందం డౌన్ డౌన్ తాలిబాన్! అనే నినాదాలను కాబూల్ గోడలపై చిత్రించింది. మా మహిళలు ఇప్పుడు రాజకీయంగా చైతన్యవంతులు. వారు 20 సంవత్సరాల క్రితం సులభంగా వేసుకోగలిగిన బుర్ఖా కింద ఇకపై జీవించాలనుకోవడంలేదు. సురక్షితంగా ఉండటానికి తెలివైన మార్గాలను కనుగొంటూనే మేము మా పోరాటాలను కొనసాగిస్తాము.

అమానుష అమెరికా సైనిక సామ్రాజ్యం ఆఫ్ఘన్ ప్రజల శత్రువు మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, అస్థిరతలకు అతిపెద్ద ముప్పుకూడా అని మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఆ వ్యవస్థ క్షీణదశ పొలిమేరల్లో ఉందికాబట్టి, వైట్ హౌస్, పెంటగాన్, కాపిటల్‌హిల్‌లో వున్న క్రూరమైన యుద్ధ-పిపాసులకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని తీవ్రతరం చేయడం శాంతి ప్రేమికులు, ప్రగతిశీల, వామపక్ష, న్యాయాన్ని కాంక్షించే వ్యక్తులు, సమూహాలందరి విధి. కుళ్ళిన వ్యవస్థను న్యాయ, మానవత్వాల వ్యవస్థగా మార్చడం వల్ల లక్షలాది మంది పేద, అణచివేతకు గురైన అమెరికన్ ప్రజలకు విముక్తి లభించడమే కాకుండా ప్రపంచం ప్రతి మూలలోనూ శాశ్వత ప్రభావం ఉంటుంది.

ఇప్పుడు 90 వ దశకం చివరిలో తాలిబాన్ నెత్తుటి పాలనలో ఉన్నప్పుడు జరిగినట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌ను, ఆఫ్ఘన్ మహిళలను ప్రపంచం మర్చిపోతుందేమోనని మా భయం. అందువల్ల, అమెరికాలోని ప్రగతిశీల వ్యక్తులు, సంస్థలు ఆఫ్ఘన్ మహిళలను మర్చిపోకూడదు.

మేము మా స్వరాన్ని మరింతగా పెంచుతాము. మా ప్రతిఘటనను కొనసాగిస్తాము. లౌకిక ప్రజాస్వామ్యం, మహిళల హక్కుల కోసం పోరాడతాం!

(afghanwomensmission.org సౌజన్యంతో)

అనువాదం: పద్మ కొండిపర్తి
మహిళా మార్గం జులై-సెప్టెంబర్ సంచికలో ముద్రణ కాబోతోంది)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *