నెత్తుటి మరక (కవిత)

 

నెత్తుటి మరక

మనిషి కింత మెతుకు పెట్టే
మట్టి మనిషి తల పగిలింది
రాబందుల పాలనలో…
నెత్తుటి మరక లేకుండా
పోరు సాగుతుందా…

బెడ్డ దుక్కిలో పగిలిన పాదాల సాక్షిగా….
పార్లెంటులో ప్రజాస్వామ్యం కి
మానం పోయినప్పుడే…
రాజ్యాంగానికి రక్షణ కరువై నప్పుడే
రైతు బతుకు బజార్న పడింది

తుండు తలపాగా వేసి…
సిలకట్టు ఎగ్గట్టి మిట్ట మధ్యాహ్నం
ఏరువాక తోలి నోడికి….
అకుబట్టలో జలగల మధ్య
జడివాన లో నారుమడిలో
తడిసి ముద్దయి నోడికి
మోడీ సైన్యం కొట్టిన దెబ్బ లో లెక్కా

ఎనుబోతులిని ఎదిరించి నోడు
ఏలి నోళ్ళ నేదిరించ లేడా
నెత్తురు ఏరులై పారినా
ఏరువాక వదల నోడు
ఎదురు తిరిగాక
ఎనక తిరగడంతెలీనోడు
తల పగిలినంత మాత్రానా
తలపాగా తీసేస్తాడా…?
యుద్ధం లో దిగాక
విజయమో….వీర మరణమో

రాకాసి రాజ్యమా…
కాలం గుప్పిట తెరవక ముందే
మరణ వాంగ్మూలం రాసిపెట్టుకో
విజయం ఎప్పటికైనా వీరులదే

మట్టిలో మెతుకు పండించే రైతు
ఎప్పటికీ వీరుడే… అజేయుడే..

-రెడ్డి శంకరరావు
9494333511
(28-8-2021 న హర్యానాలో రైతు లపై లాఠీ ఛార్జి కి నిరసనగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *