ఎవరన్నారో తెలియదు గాని, ఆఫ్గనిస్తాన్ కు సామ్రాజ్యాల వల్లకాడు అని పేరు. ఇది చరిత్ర పోడవునా సామ్రాజ్యాలు అక్కడి ఎడారి నేలల్లో అంతరించిపోయాయి. వాటి ఆనవాళ్లింకా అక్కడ కనబడతాయి. వాటి సంగతటుంచితే, ఆఫ్గనిస్తాన్ ఆధునిక సూపర్ పవర్లకు అక్షరాల స్మశాన భూమి అయింది. అక్కడి నేలలో 19 శతాబ్దంలో బ్రిటిష్ సూపర్ పవర్ పతనమయింది, 20 శతాబ్దంలో సోవియట్ సూపర్ పవర్ మట్టికరచింది. ఇపుడు తాజాగా అమెరికా సూపర్ పవర్ కూడా సమాధి అయింది… దీని మీద ఒక విశ్లేషణ
తాలిబన్లు ఈ రోజు చాలా బలమయిన, శక్తివంతమయిన సాయుధ దళం. ఒక పేద దేశంలోతయారయిన గెరిల్లా దళాల్లాగా తాలిబన్లు లేరు. తాలిబన్లు, అన్ని రకాల మారణాయుధాలను ప్రయోగించగలరు. వాటిని వాడటంలో నైపుణ్యం ఉంది. వాళ్లదగ్గిర లేని ఆయుధాల్లేవు. తాలిబన్లు ఇంత బలంగా తయారయ్యారు. దీని మీద పాకిస్తాన్ కుచెందిన ముషాహీద్ హుసేన్ (Mushahid Hussain) చాలా ఆసక్తికరమయిన వివరాలతో ఒక వ్యాసం రాశారు. అందులోని ముఖ్యాంశాలు:
ఆప్ఘనిస్తాన్ లో జరుగుతున్న యుద్ధాలకు, అంతర్యుద్ధాలకు 42 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇపుడు ఆమెరికా ఆఫ్గనిస్తాన్ ను ఉన్న ఫలానా వదిలేసి పారిపోవడంతో ఆదేశం సులభంగా తాలిబన్ల వశమయింది.
ఇది కేవలం ఆఫ్గానిస్తాన్ కు పరిమితమయిన చిన్న సంఘటన కాదు. ఆసియాలో అమెరికా శకానికి అంతం ఇది. ఆసియాలో చాల రకాల యుద్ధాలకు, అంతర్యుద్ధాలకు అమెరికాయే కారణం. అఫ్తానిస్తాన్ లో గత 42 సంవత్సరాలలో మూడు యుద్ధాలు జరిగాయి. అన్నింటిలో అమెరికా పాత్ర ఉంది. 1979 నుంచి 1989 దాకా జరిగిన ఆఫ్గాన్ జిహాదీ సోవియట్ అక్రమణకు వ్యతిరేకంగా జరిగింది. దీనికి నిధులు సమకూర్చింది అమెరికాయే. 1989 నుంచి 2001 దాకా ఆఫ్గాన్ సివిల్ వార్ జరిగింది. దీని వెనక అమెరికా హస్తం ఉంది. ఇక మూడోసారి 9/11 అమెరికా మీద టెర్రరిస్టు దాడి తర్వాత టెర్రరిస్టుల ఏరివేత అంటూ అమెరికా నాటో దళాలతో తనే రంగంలోకి దిగింది.
జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయన నేషనల్ సెక్యూరిటీ ఎడ్వయిజర్ గా డాక్టర్ జిగిన్యూ బ్రెజెజెన్ స్కీ (Zbigniew Kazimierz Brzezinski ) ఉండేవాడు. ఆయన జ్ఞాపకాల పుస్తకం ‘పవర్ అండ్ ప్రిన్సిపుల్’ (Power and Principles) లో ఆఫ్గనిస్తాన్ గురించి కొన్ని ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు.
1979జూలై 3న కార్డర్ ఒక ముఖ్య మయిన ఆఫ్గనిస్తాన్ ఉత్వర్వు మీద సంతకం చేశారు. అఫ్గనిస్తాన్ లో ముజాహిదీన్లకు $695,000 డాలర్ల సాయం అందించాడనికి సంబంధించిన ఉత్తర్వు అది. ఈ డబ్బును అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ పాకిస్తాన్ ద్వారా మొజాహిదీన్లకు అందించింది. నిజానికి అప్పటికింకా సోవియట్ సేనలు ఆఫ్గనిస్తాన్ లోకి రానేలేదు. ఆయన సంతకం చేసిన ఆరు నెలల తర్వాతే సోవియట్ సేనలు ఆఫ్గనిస్తాన్ లోకి వచ్చాయి.
ఈ నిధులు అందగానే ఆఫ్గనిస్తాన్ సిఐఎ కోవర్టు కేంద్రం అయిపోయింది. ఒక దశాబ్దం తర్వాత రష్యా సేనలు ఆఫ్గనిస్తాను వెళ్లిపోయేందుకు అనుమతించే విషయం మీద జెనీవా ఒప్పందం జరిగాక, ముజాహిదీన్ల గెరిల్లా యుద్దానికి అమెరికా 5 బిలియన్ డాలర్లను అందించింది.
అంతేనా!. అ తర్వాత మరొక పదేళ్ల పాటు మరొక బిలియన్ డాలర్లు అందించింది. దీనికి సౌదీ అరేబియా మ్యాచింగ్ గ్రాంటుగా మరొక .21 బిలియన్ డాలర్లు అందించింది. మరికొన్ని దేశాలు కూడా మరొక బిలియన్ డాలర్లు అందించాయి. అంతేకాదు, సుమారు లక్షల మంది ముజాహిదీన్లకు సైనిక శిక్షణ ఇచ్చింది. అయుధాలు సమకూర్చింది. వారితో పాటు అరబ్ ,తదితర ముస్లిం దేశాలకు చెందిన మరొక 10,000 మంది వలంటీర్లకు కూడా శిక్షణ ఇచ్చింది. ఇపుడు కాబూల్ లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు నాటి ముజాహిదీన్ల సైద్ధాంతిక వారసులే. వీరిలో కొంతమంది నాటి సోవియట్ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన వారే.
1998 జనవరి 15-21 మధ్య డా. బ్రెజెన్ స్కీ ఒక ఫ్రెంచ్ న్యూస్ పేపర్ (Le Nouvelle Observateur)కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మతోన్మాదానికి, ముస్లిం దేశాల అస్థిరతకు, ఆ మాటకొస్తే పాశ్చాత్య దేశాల అస్థిరతకు కూడా దారితీసేలా టెర్రరిస్టులకు నిధులందించినందుకు అమెరికా పశ్చాత్తాపడుతూ ఉందా అని అడినపుడు కన్నార్పకుండా ఆయనేం చెప్పారంటే… ప్రపంచ చరిత్రలో ఏది ముఖ్యం? తాలిబన్లా సోవియట్ యూనియన్ కూలిపోవడమా? లేక కొంతమంది ముస్లింల ఆందోళనా లేక సెంట్రల్ యూరోప్ విముక్తి, కోల్డ్ వార్ అంతమా, అని ఆయన అడిగారు. (“What is important in world history? The Taliban or the collapse of the Soviet Empire? Some agitaged Muslims or the liberation of Central Europe and the end of the Cold War?”)
తాలిబన్లు అనేది అమెరికా తయారుచేసిన భూతమే. అయితే, అమెరికా మీద 9/11 ట్రెర్రర్ దాడి జరిగాక దాన్ని మళ్లీ సీసాలోకి తోసేందుకు వాషింగ్టన్ ప్రయత్నించింది. అమెరికా చేత కాలేదు. అది అమెరికా మాట వినలేదు. పాకిస్తాన్ తో సహా అనేక దేశాలను బలవంతంగా ఈ యుద్ధంలోకి లాగారు. సౌదీ అరేబియాకూడా యద్ధం లోకి రావలసి వచ్చింది. ఎందుకంటే, 9/11 న రెండు న్యూయార్క్ టవర్ల మీద, పెంటగన్ మీద జరిగిన టెర్రరిస్టులు జరిపిన దాడిలో పాల్గొన్న19 మంది హైజాకర్ల లో 15మంది సౌదీ అరేబియా వాళ్లే. మిగతా వారిలో ఇద్దరు ఈజిప్లు వారు, ఒకరు లెబనాన్, మరొకరు యుఎఇ పౌరులు .అందువల్ల ఆమెరికా మాట కాదంటే పర్యవసానాలుంటాయని సౌదీ భయపడింది.
ఇంత భారీగా నిధులు వెచ్చించినా, అందించినా, సైనిక శిక్షణ ఇచ్చి ఆయుధాలు సమకూర్చినా, అఫ్గనిస్తాన్ ప్రాజక్టు విఫలమయ్యేందుకు కారణం అమెరికా విధానాలే. ఈ విధానాలు 2003 లో దారి తప్పాయి.
ఆఫ్గానిస్తాన్ ని సుస్థిరపరచేందుకు అమెరికా ఎపుడూ ప్రయత్నించలేదు. ఇలాంటి మంచి పనికి పూనుకోకుండా 2003లో అమెరికా ఇరాక్ మీద యుద్ధానికి పూనుకుంది. దీనికి కారణమేమింటే, అప్పటి అధ్యక్షుడు బుష్ కి మూడు దేశాలంటే మహామంట. అవి: ఉత్తర కొరియా, ఇరాన్, ఇరాక్. ఈ మూడింటిని కలిపి ఆయన అరిష్టత్రయం (Axis of Evil)అని పిలిచేవాడు. నిజానికి ఆమెరికా జరిగిన దాడిలో ఈ దేశాలకు పాత్రే లేదు. ఒక దశలో తాలిబన్ పరిపాలన రూపుమాపడంలో అమెరికా బాగా సహకరించిన దేశం ఇరాన్. ఇలాంటి ఇరాన్ కూడా అమెరికాకు శత్రుదేశమయింది.
అమెరికా ఆఫ్గానిస్తాన్ వైఫల్యానికి మరొక కారణం సామ్రాజ్య వాద పొగురుబోతు తనం.
2001 అక్టోబర్ 7న అంగ్లో అమెరికన్ సేనలు తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నపుడు బ్రిటిష్ టాప్ సీక్రెట్ బృందం ఒకటి మాస్కో సందర్శించింది. చిత్రంగా ఉంది కదూ! ఆఫ్గానిస్తాన్ ఎడారిలో చొరబడితే ఇరుక్కుపోతామనే భయం అమెరికాను పీడిస్తూ వచ్చింది. ఇరక్కుపోతే, బయటకొచ్చే మార్గంకనుక్కోవడమెలా అనే మాస్కో నుంచి నేర్చుకోవాలనుకుంది.
ఆఫ్గానిస్తాన్ లో సైనికతిష్ట వేసినపుడు సోవియట్ యూనియన్ అనుభవం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ బృందం సోవియట్ యూనియన్ వెళ్లింది.
కమ్యూనిస్టుల వ్యంగ్యంగానే నయినా మంచి సలహా ఇచ్చారు. దాన్ని ఆ తర్వాత పాటించలేదు. “మేంచేసిన తప్పునే మీరు చేస్తారు. మీరు ఆఫ్గన్ లో ప్రవేశిస్తారు. కాని అక్కడ ఓడిపోతారు. చాలా మంది మీ వాళ్లు చచ్చిపోతారు. తర్వాత మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది. అదే మాకు మంచింది,” అని రష్యా వాళ్లు చెప్పారు.( “You will make the same mistake as we did. You will go in, you will lose, many of you will die and then you’ll be forced to retreat, which is good for us”.)
ఇక మూడో కారణం: గందరగోళం. ఆఫ్గానిస్తాన్ తాము ఎందుకు ఉన్నామో, అమెరికన్లకే తెలియదు. అక్కడ సైనిక శిబిరాలు కట్టుకుని, కాబూల్ అమెరికా అందించే విదేశీసాయం మీద కాబూల్ ప్రభుత్వం బతికేలా చేశారు తప్ప అక్కడ ప్రజస్వామ్య వ్యవస్థలను పటిష్టపరిచే ప్రాజక్టు చేపట్టలేదు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆత్మగౌరవం ఉన్న ఏ ఆఫ్గానీ కూడా ముందుకు రాడు. ఆఫ్గాన్ ఇపుడు జరిగిందేమిటి? 170 మిలియన్ డాలర్లను సూట్ కేసుల్లో కుక్కుకుని అధ్యక్షుడు ఘని పారిపోయాడు. తాలిబన్ల వస్తున్నారంటే, ఎక్కడా కాసింత వ్యతిరేకత రాలేదు. వాళ్లను నిరోధించేందుకు ప్రజలే కాదు, పోలీసులు, సేనలు కూడా పూనుకోలేదు
ఆఫ్గానిస్తాన్ ప్రాజక్టు చుట్టు ఆమెరికా కట్టుకథలు కల్లి, వంచనకు పాల్పడుతూ ఎలా రెండు దశాబ్దాలు గడిపిందో వాషింగ్టన్ పోస్టు (Washington Post) 2019 నవంబర్ లో ఆఫ్గనిస్తాన్ పేపర్ల (Afghanistan Papers) ను పబ్లిష్ చేసి అమెరికాను బాగా బజారుకీడ్చింది.
అందుకే 9/11 ఇరవయ్యవ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా దిక్కు లేనిదయిపోయి పారిపోతుంటే చాలామందికి 1975లో కంబోడియా, వియత్నాంలలో అమెరికా పడిన తిప్పలు, 1979లో ఇరాన్ లో పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి.
ఆ దేశాలనువిడిచిపోతున్న అమెరికా అంబాసిడర్ చివరిగా, ‘ఈ దేశాన్ని నిన్నటి దాకా మే మే పాలించాం,’ అని గొణుక్కుంటూ విమానమెక్కారు.
అఫ్గానిస్తాన్ లో అమెరికాకు ఎదురయ్యింది ఏదో చిన్న ఇంటెలిజన్స్ ఫెయిల్యూర్ తో వచ్చిన సమస్య కాదు. అమెరికా అహంభావం నుంచి వచ్చి సమస్య ప్రపంచంలో ఏదేశంలోనైనా ప్రభుత్వాలను ఇష్టమొచ్చినట్లు మార్చేస్తామన్న అహంభావం నుంచి ఎదురైన పరాభవం.
కోల్డ్ వార్ సమయంలో అంటే 1945 నుంచి 1989 దాకా అమెరికా మూడో ప్రపంచ దేశాలలో 72 సార్లు ప్రభుత్వాలను మార్చేందుకు (Regime Change)కు ప్రయత్నించింది.
75 సంవత్సరాల కిందట రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా విజేతగా నిలబడింది. దీనితో ప్రపంచ రాజకీయాలలో అమెరికా శకం (American Century) మొదలయింది అంతా అనుకున్నారు. దానికి తోడు అఫ్గనిస్తాన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఓడిపోయింది.
తర్వా సోవియట్ యూనియన్ సామ్రాజ్యం కూలిపోయింది. దానితో పాట కమ్యూనిస్టు ప్రపంచం పటాపంచలయింది. ప్రజలు బెర్లిన్ గోడను కూల్చేశారు. దీనితో ‘అమెరికా శకం’ అంతా నిజమే అనుకున్నారు. ఈ నేపథ్యంలో 1991లో జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ ‘నేనేది చెబితే అదే’ అనే ప్రకటించారు.
ఇది జరిగి 30 యేళ్లయింది. ఈ అహంకారం, పొగరుబోత్తనం అంతా ఆఫ్గన్ ఇసుక దిబ్బల్లో సమాధి అయింది.
అఫ్గనిస్తాన్ కు సామ్రాజ్యాల స్మశానభూమి అని పేరుంది. ఇది అక్షరాల నిజమయింది. ఇక్కడ 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం, 20 వ శతాబ్దంలో సోవియట్ సామ్రాజ్యవాదం సమాధి అయ్యాయి. ఇపుడు అమెరికా సామ్రాజ్య వాదం కూడా అక్కడే సమాధి అయింది.
చివరకు ఏ పరిస్థితి, తాము తాలిబన్లకు అందించిన ఆయుధాలు చూసి భయపడే పరిస్థితి వచ్చింది. తన పౌరులను తరలించుకుపోయే పరిస్థితి కూడా లేకుండా పోయింది.