దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల ముందు నిధులు పారడం చూశాం గాని, ఇలా వరదై పొర్లడం ఇదే మొదటిసారి.
హూజురాబాద్ కు తొందర్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.మాజీ ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ ఎస్ కు రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అసవరమయింది. అయితే ఇది ఇలా దళిత బంధుకు దారితీస్తుందని ఎవరూ వూహించి వుండరేమో.
మొన్న ఆగస్టు 16న హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు గాను మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
ఇలా ఒక నియోజకవర్గానికి ఒక నెలలోపు, ఒక కమ్యూనిటీ వర్తించే పథకానికి వేయికోట్లు విడుదల చేయమనేది భారతదేశం చరిత్రలో ఎపుడూజరిగి ఉండదు. ఇలాంటి విషయాల్లో గిన్నీస్ రికార్డు ఉంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుంది.
రెండు నెలల్లో దళిత బంధుపథకానికి రు. 2 వేల కోట్లు విడుదల చేస్తానని ముఖ్యమంత్రిప్రకటించారు. దాని ప్రకారం మరొక వారం రెండు వారాల్లో మరొక వేయి కోట్లు విడుదలవుతాయి. అంటే హూజురాబాద్ లోదళితులు మహా అదృష్టవంతులు.ఇంటింటికీ లాటరీ తగులుతూఉంది.
ముఖ్యమంత్రి ప్రకటించిన దళితబంధు దేశంలో ని అతిపెద్ద పథకం. కుటుంబానికి ఉచితంగా పదిలక్షలరుపాయలు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ముందు జాతీయ పథకాలు కూడా దిగదడుపే. ఈ పథకాన్ని వచ్చే ఎన్నికల దాకా ముఖ్యమంత్రి దశల వారీగా అమలుచేస్తూ పోతూ ఉంటారు.
మొత్తంగా ఈ పథకానికి 80 వేల రుపాలయ నుంచి లక్ష కోట్ల రుపాయల దాకా ఖర్చవుతాయని, దానిని ఖర్చుచేసేందుకు వెనుకాడమని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తెలంగాణలో ఓటు విలువ భూముల్లాగా పెరుగుతూఉంది. రాష్ట్రంలో 17 శాతం మంది దళితులున్నారు. ఈ పథకంతో దళితులు మరొక పార్టీ వైపు చూడకుండా టిఆర్ ఎస్ ఓటేసి మరొక 30యేళ్లు పార్టీని అధికారంలో ఉంచుతారని ముఖ్యమంత్రి ఆశ. ఇదేమవుతుందో చూడాలి.
ఇది ఇలా ఉంటే…
మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎన్నికల లోపు దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు ఎలా ప్రచారం చేయాలి, పథకం అమలయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి గురించి ఆయన సూచనలు చేస్తారని తెలిసింది.