మీకిది తెలుసా? పూర్వం రెండు మూడు చిత్రాలు కలిపి విడుదల చేసే వారు

1935 వరకు తెలుగు టాకీ సినిమాలను ఆంధ్రలో తీసే వారు  కాదు. ఎక్కడో ఉన్న  కలకత్తా లోనో, బొంబాయిలోనో, కొల్హాపూరులోనే తీసే వారు. అయితే, తెలుగు ప్రాంతాలలో చిత్రాలు తీసే ప్రయత్నాలయితే జరిగాయి.  అంతకు ముందే కాకినాడలో సి. పుల్లయ్య  మూకీల మీద ప్రయోగాలు చేశారు.అలాగే మద్రాసులో రఘుపతి వెంకయ్య, ప్రకాష్ లు కొన్ని ప్రయత్నాలు చేశారు.  1936 నాటి నుండే విశాఖపట్టణం, రాజమండ్రిలలో సినిమాలు నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల ఫలితమే: సంపూర్ణ రామాయణం (1936), ప్రేమ విజయం (1936), దశావతారాలు (1937), భక్త జయదేవ (1938, ఆంధ్ర సినీటోన్).

సంపూర్ణ రామాయణం సినిమా ప్రకటనల్లో ‘రాజమహేంద్రవరమున శ్రీదుర్గాసినీటోన్ కంపెనీవారి స్వంతస్టూడియోలో తయారుకాబడిన తెలుగు మాట్లాడు ఫిల్ము’ అని వుంటుంది.

ముఖ్యంగా తమ చిత్రం టాకీ అని చెప్పటానికి  ‘తెలుగు మాట్లాడు ఫిల్ము’ అన్న పదాలు పెద్ద, లావుపాటి అక్షరాల్లో వుంటాయి!

చాలా పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారయిన ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. దానితో నిర్మాణ సంస్థ ఆర్ధికంగా దెబ్బతిన్నది.ఈ చిత్రం తీసిన దుర్గా సినీటోన్ యజమాని నిడమర్తి సూరయ్య నుండి దాన్ని అద్దెకు తీసుకుని ‘ఆంధ్ర టాకీస్’ అన్న కొత్త పేరుతో సి. పుల్లయ్య సినిమాలు తీయడం మొదలు పెట్టాడు.

అంత వరకు సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన టాకీ సినిమాలన్నీ (ఈస్ట్ ఇండియా వారి కోసం కలకత్తాలో తీసినవే.

‘ఆంధ్ర టాకీస్’ బ్యానర్ పైన తీసిన మొదటి సినిమా, శ్రీ సత్యనారాయణ (1938). సినిమా పేరులో వ్రతం అన్న మాట లేదు! సినిమా నిడివి ఎనిమిది వేల అడుగులు మించలేదు. వినోదం అంటే కనీసం మూడు గంటలకు  అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు ఈ నిడివేం సరిపోతుంది.

దీనితో దానికి అనుబంధంగా కాసులపేరు అనే రెండు రీళ్ల సినిమాని తీశారు.  ఇప్పటికీ అనుకునంత నిడివి రాలేదు. దీనితో చల్ మోహనరంగా అన్న మరో 2వేల అడుగుల లఘు చిత్రాన్ని కలిపారు. దీనితో  ఈ ప్రదర్శన మూడు చిత్రాల షో అయింది. అన్నింటిని కలిపి ముక్కోటి ఏకాదశి రోజున విడుదల చేసినట్లు సి. పుల్లయ్య కుమారుడు సి. ఎస్. రావు తన జ్ఞాపకాల్లో రాశారని చిత్రచరిత్రకారుడు పరుచూరి శ్రీనివాస్ ఈమాట లో రాశారు.

ఇలా రెండు లేక మూడు లఘు చిత్రాలు కలిపి విడుదల చేయడం అంతకు రెండేళ్ల ముందే జరిగింది. 1936లో సి. పుల్లయ్యే ఈస్ట్ ఇండియా వారి కోసం పిల్లలతో, ధ్రువవిజయం, సతీ అనసూయ అన్న రెండు లఘు చిత్రాలు తీశాడు. ఇదే వరసలో 1941లో వచ్చిన ‘భలే పెళ్లి, తారుమారు’, 1954లో వచ్చిన ‘బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కిష్టయ్య’లను (బాలానందం అనే పేరుతో) కూడా చెప్పుకోవచ్చు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *