దళిత బంధు సరే, ఇంత గోల ఎందుకో?

 

దళితబంధు కార్యక్రమాన్ని స్వాగతీస్తున్నాం , బాగుంది అయితే దానికంటే ప్రభుత్వం ప్రచారం గోల ఎక్కువగా ఉందని, ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  హంగామా మానేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే దళితబంధు కింద పది లక్షల రూపాయల అందించాలని ఆయన  డిమాండ్ చేశారు.

అది కూడా కలెక్టర్, అధికారులు, బ్యాంక్ మేనేజర్ల అజమాయిషీ లేకుండా ఖర్చు పెట్టుకొనే స్వేచ్చ కలిపించాలని ఆయన కోరారు.

హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ని నమ్మే పరిస్థితుల్లో లేరు, ప్రజలు వస్తారో రారో అనే భయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు బస్సులు పెట్టి టిఆర్ఎస్ కార్యకర్తలను మీటింగ్ కు తరలిస్తున్నారు. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరికి కూడా RTC బస్సులు పంపి జనాన్ని తరలిస్తున్నారు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఏంటో అర్దం అవుతుంది . మీటింగ్ జరుగుతున్న ఊరికి కూడా బస్సులు పెట్టి జనాన్ని తీసుకుపోయే దుస్థితికి అధికార పార్టీ చేరుకుంది. అసలు ఇది ప్రజల మీటింగ్ కాదు.

మీటింగ్ కి తరలించే భాద్యత టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్స్, VROలు, VRA లు వేలామందికి అప్పగించారు. వీరితో పాటు 10 వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టారు. వీరితోనే సభా ప్రాంగణం నిండి పోతుందేమో.

హుజూరాబాద్ నియోజకవర్గం పోలీసుల పహరాలో ఉంది. వేలమందిని ముందస్తు అరెస్ట్ లు చేశారు. పోలీస్ స్టేషన్ లు, స్కూల్స్ నిండిపోయి సరిపోవడం లేదు. ఇలాంటి నిర్భందాల మధ్య  కెసిఆర్ హుజూరాబాద్ వస్తున్నారు. ఈ నియోజకవర్గం అంతా భయం గుప్పిట్లో ఉంది.

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

దళితబంధు కడు బీదరికంలో ఉన్న దళితులను ఆదుకోవడానికి పెట్టిన పథకం, కానీ ఇంత డబ్బు ఖర్చుచేసి ప్రచారం ఎందుకు ?

అయినా ఒక్కసారి ప్రారంభించిన కార్యక్రమానికి ఇంత భారీ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు?  వాసాలమర్రి లో ప్రారంబించిన దళితబంధు కార్యక్రమానికి ఎన్నికల కోసమే ఇక్కడ అతి ప్రచారం చేస్తున్నారు. ఎవడి సొమ్మని ప్రభుత్వదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును పార్టీ ప్రచారానికి వాడుకుంటున్న కెసిఆర్ ప్రజలకి సమాధానం చెప్పాలి.

ప్రభుత్వ ధనంతో సోకులు పడుతున్నారు. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ సొంత ప్రచారం చేసుకుంటున్నారు. ఈ డబ్బు పెడితే ఎన్నో పేద కుటుంబాలు బాగుపడేవి అని ఈటెల అన్నారు.

దళితబంధు కార్యక్రమం ను హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంబించడాన్ని స్వాగతీస్తున్నాంఅని అన్న ఈటల రాజేందర్. ఇది కేవలం ఎన్నికల కోసం కాకూడదని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు షరతులు లేకుండా అందిచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని కోరారు. దళితులతో పాటు ఇతర కులాలలో కడు పేదరికం అనుభవిస్తున్న ప్రతి కుటుంబానికి ఇది అందిచాలని డిమాండ్ చేశారు. ఎరుకల, వడ్డెర, సంచార జాతులు, కుమ్మరలు,విశ్వకర్మలు, పద్మ శాలీలు, నాయీ బ్రాహ్మణులు, రజకు,గౌడ,ముదిరాజ్, కాపుతో పాటు తెలంగాణ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇది అందించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *